కొమ్ముకాసే ఖాకీలపై సీజేఐ సంచలన కామెంట్లు.. జగన్ సర్కారుకూ వర్తిస్తుందా?
posted on Aug 26, 2021 @ 4:42PM
పోలీసులంటే అధికార పార్టీకి దాసులు అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. కొందరు ఖాకీలు ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటారు. మరికొందరు కొన్ని పార్టీల మనుషులుగా ముద్రపడి పోయారు. అందలమెక్కగానే తమ వారిని మంచి పొజిషన్లలో నియమిస్తుంటారు పాలకులు. గత ప్రభుత్వ అధికారులను అధఃపాతాళానికి తొక్కేస్తుంటారు. ఇలా పోలీస్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని.. ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యలకు దిగుతుంటారు. ఏపీలో ఈ ధోరణి మరింత తీవ్రంగా ఉందనే ఆరోపణ ఉంది. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. చంద్రబాబు మనిషంటూ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఎలా వేధిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. ఇక సీఐడీ చీఫ్‌గా తన మనిషి సునీల్‌కుమార్‌ను నియమించుకొని.. ప్రతిపక్ష నేతలపై కేసులు, కుట్రలకు తెగబడుతున్నారంటూ తీవ్ర విమర్శలు ఉన్నాయి. సొంతపార్టీ ఎంపీ రఘురామ అరెస్ట్, కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పోలీసుల తీరు బాగా వివాదాస్పదమైంది. ఇప్పటికే ఏపీ పోలీసులు డజనుకుపైగా టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. పలువురిని అరెస్ట్ చేసి కక్ష్య సాధింపు చర్యలకు దిగడం లాంటి చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పసుపు చొక్కా వేసుకున్నా.. సైకిల్ పట్టుకున్నా.. కేసులు పెట్టేంతలా పోలీసులు అధికార వైసీపీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. ఇదంతా పక్కనపెడితే.. తాజాగా సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఇలాంటి పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసులను ఉద్దేశించి కాకపోయినా.. సీజేఐ స్టేట్‌మెంట్స్ అన్నిరాష్ట్రాల ఖాకీలకు హెచ్చరికలా, సూచనలా ఉన్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....
అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సస్పెండయిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుతో ఏసీబీ, ఆర్థిక నేరాల విభాగం ఆయన నివాసంలో సోదాలు చేసి.. రాజద్రోహంతో పాటు ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది.
దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయన్నారు జస్టిస్ రమణ. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది కొత్త రకం ధోరణి అని.. దీనిని ఆపాలన్నారు జస్టిస్ రమణ. గుర్జిందర్ పాల్ సింగ్ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది.
సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీస్ అధికారులపై కులం, వర్గం ముద్ర వేసి అప్రాధాన్య పోస్టులకు మార్చేశారని అంటున్నారు. అప్పటి ఐబీ చీఫ్ ఏబీతో ఓ ఆట ఆడుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే ప్రస్తుత సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు ఇదే గతి పడుతుందని అంతా అంటున్నారు. ఇలా పార్టీలు మారినప్పుడల్లా.. పోలీసుల తీరు మారడం ఏమాత్రం సరికాదని.. సీజేఐ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. అందుకే, ఖాకీలు అధికార పార్టీకి కొమ్ముకాయడం మానుకొని.. నిస్పక్షపాతంగా నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు.