కాంగ్రెస్ గెలిస్తే దళితుడే సీఎం.. రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి చెక్?
posted on Aug 26, 2021 @ 7:58PM
కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్‌వాదులే కాంగ్రెస్‌ను ఓడిస్తారు అనేది నానుడి. అది నిజమే అన్నట్టు గతంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. తాజాగా, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది. పార్టీ పగ్గాలు చేపట్టాక రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. మాటలతో చేతలతో ప్రగతిభవన్‌పై దండెత్తుతున్నారు రేవంత్. దళిత-గిరిజన దండోరాలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను బహుజన భవన్ చేస్తానంటూ సవాల్ విసురుతున్నారు. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం. హస్తం పార్టీపై ప్రజల్లో మునుపటి ఆసక్తి. రేవంత్‌రెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి. అందుకే కాంగ్రెస్‌లో మరింత జోరు కనిపిస్తోంది. ఈ స్పీడ్ ఇలానే కొనసాగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీదే అధికారమని అంతా అనుకుంటున్నారు. ఈసారి కాంగ్రెస్‌దే గెలుపని భావిస్తున్నారు. మరి, కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే..? సీఎం అయ్యేది ఎవరు? ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేది ఎవరు? అంటే.. ఇంకెవరు? రేవంత్‌రెడ్డినే అనేది కాంగ్రెస్‌వాదుల మాట. సీఎం సీటుకు అన్ని అర్హతలు ఉన్న లీడర్ రేవంత్‌రెడ్డినే. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేది ఆయనే కాబట్టి.. ముఖ్యమంత్రి స్థానం కూడా రేవంత్‌కే దక్కాలనేది కేడర్ డిమాండ్.
అయితే, ఇంకా ఆలీ లేదు సూలూ లేదు.. అప్పుడే రేవంత్‌రెడ్డికి మోకాలొడ్డుతున్నారు కాంగ్రెస్ సీనియర్లు. రేవంత్‌రెడ్డిపై మొదటి నుంచీ చిటపటలు పేలుస్తూనే ఉన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి రాగానే.. డబ్బులిచ్చి కొనుక్కున్నారంటూ కిరికిరి స్టార్ట్ చేశారు. భువనగిరిలో సభ పెడతానంటే.. తాను బిజీ అంటూ సభనే లేకుండా చేశారు. ఇవి చాలవన్నట్టు.. తాజాగా రేవంత్‌రెడ్డి భవిష్యత్‌కు, అధిష్టించబోయే ముఖ్యమంత్రి పీఠానికి చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా డైలాగులు వదులుతున్నారు. "తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు." ఈ డైలాగ్ వినడానికి సింపుల్‌గా ఉన్నా దాని వెనుక పెద్ద మర్మమే దాగుందంటున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ రేవంత్‌రెడ్డికే ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం గ్రహించే.. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారంటూ కోమటిరెడ్డి మైండ్‌గేమ్ స్టార్ట్ చేశారని అంటున్నారు. సీఎం రేసులో రేవంత్‌రెడ్డి పేరు లేకుండా చేసేందుకే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలాంటి కామెంట్లు చేసుంటారనే చర్చ జరుగుతోంది.
లేదంటే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి ఎలా ప్రకటిస్తారు? అలాంటి ప్రకటనలు చేయాలంటే కాంగ్రెస్ అధిష్టానం చేయాలికానీ.. కోమటిరెడ్డి ఎవరు అలా అనడానికి? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక, పార్టీ స్టాండా? పార్టీ విధానమే అయితే ఆ విషయం పీసీసీ చీఫ్ ప్రకటించాలి కానీ, ఓ ఎంపీ అయిన కోమటిరెడ్డి ఎలా అనౌన్స్ చేస్తారు? ఇదంతా వెంకట్‌రెడ్డి ఒంటెత్తు పోకడలేనని.. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని.. కాంగ్రెస్ వాదులే మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి ముందరికాళ్లకు బంధాలు వేయడానికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలా దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. రేవంత్‌రెడ్డి విషయంలో పదే పదే హద్దు మీరుతున్న కోమటిరెడ్డిని పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి....