పవన్‌కల్యాణ్‌కు రఘురామ ఫుల్ సపోర్ట్.. సినీ పరిశ్రమను కాపాడాలంటూ రిక్వెస్ట్..
posted on Aug 26, 2021 @ 3:59PM
సీఎం జగన్‌ను, వైసీపీ సర్కారును, సాక్షి మీడియాను ఓ పట్టాన వదలడం లేదు ఎంపీ రఘురామ. ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు అయ్యే వరకూ వదిలేలా లేరు. ఇప్పటికే జగన్, విజయసాయిలపై కేసులు వేసిన రఘురామ.. ఇప్పుడిక సాక్షి మీడియాపైనా పిటిషన్‌కు సిద్ధమవుతున్నారు. హోల్‌సేల్‌గా జగన్ అండ్ కో కు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు.
సీఎం జగన్మోహన్‌రెడ్డిపై తాను వేసిన పిటిషన్ రద్దు అని సాక్షిలో ముందే వార్త రాశారని తప్పుబట్టారు రఘురామ. ఆ వార్తల వెనుక ఏముందో విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును సంప్రదించాలని న్యాయ నిపుణులకు తెలిపానన్నారు. సాక్షి క్లిపింగ్ కూడా న్యాయమూర్తికి పంపించడం జరిగిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.
అటు తనపై విమర్శలకు దిగిన ఎంపీ మోపిదేవిపైనా విరుచుకుపడ్డారు రఘురామ. "నేను ఎవరో ఆడిస్తే ఆడుతున్నానని మోపిదేవి అంటున్నారు. 18 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న వారు చెప్తే నేను వింటానా? నేను ఎర్రివాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని నేను గెలిశాను అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్న మీరెందుకు ఓడిపోయారు. జగన్ బొమ్మ మీకు పని చేయలేదా? మన నాయకుడి బొమ్మతోనే కాదు నేను నా బొమ్మతో కూడా నెగ్గాను. పలు కేసుల్లో నింధితుడిగా ఉండి మీరు నాపై కామెంట్ చేయడం మంచిది కాదు." అంటూ సహచర ఎంపీ మోపిదేవిపై మండిపడ్డారు రఘురామ.
అటు, పవన్‌కల్యాణ్ సినిమాపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు రఘురామ. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్‌సాబ్ సినిమా సందర్భంలో మన ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఒక అగ్ర నటుడిపై ఉన్న కోపాన్ని ప్రజలపై తీర్చుకుంటే ఎలా? థియేటర్ల రేట్లను మనం ఫిక్స్ చేస్తే ఎలా నడుస్తాయి. లాభం రాకున్నా సినిమా థియేటర్లను నడుపుతున్నారు. రాష్టంలో టికెట్ల రేట్లకు కారణం ఎవరో డిస్టిబ్యూటర్లు ఆలోచించాలి. ప్రభుత్వం రూ.50కి దొరికే మద్యాన్ని రూ.250కి అమ్ముతోంది. 150 రూపాయల మద్యాన్ని 250 చేస్తే కొనుకుంటున్నారు. మరి 150 సినిమా టికెట్ కొనలేరా? సినీ ప్రముఖులతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలి. సినీ పరిశ్రమను కాపాడండి. హీరోలను హీరోలుగానే ఉండనివ్వండి.’’ అని రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌రెడ్డికి సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా థియేటర్ల రేట్లను తగ్గించలేదని గుర్తు చేశారు రఘురామ. "ఆలోచించండి సీఎం జగన్మోహన్ రెడ్డి. పక్కా రాష్టాలు చేయని పనిని మీరు ఎందుకు చేస్తున్నారు. సినిమా ప్రేమికుడిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను సినిమ పరిశ్రమను కాపాడండి" అని అన్నారు.
"గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10శాతం వాటా ఉంది. ప్రభుత్వం వాటా ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. గంగవరం పోర్టుపై ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ప్రభుత్వంలో మనకు ఇబ్బందులు తప్పవు. ఒక్కసారి ఆలోచించండి. సమయవనం పాటించండి. పోలీసులు కావాలని ప్రభుత్వాల మెప్పుకోసం పని చేస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు." అని రఘురామ కృష్ణరాజు అన్నారు.