పంజాబ్ లో కాంగ్రెస్ VS కాంగ్రెస్.. రాహుల్ టీమ్ చేతులెత్తేసినట్టేనా..
posted on Aug 26, 2021 @ 3:31PM
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిజానికి, సింగ్- సిద్ధూల మధ్య ఏనాడూ సయోధ్యత లేదు. నాలుగేళ్ళ క్రితం అమరిందర్ సింగ్ మంత్రి వర్గం నుంచి సిద్ధూ తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి, ఇద్దరి మధ్య యుద్ధం సాగుతూనే ఉంది. ముఖ్యంగా సిద్దూ వర్గం ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ టార్గెట్’గా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం పై, పీసీసీ హోదాలో సిద్ధూ విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ,పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పలు సందర్భాలలో ఇద్దరి మధ్య సయోధ్యత కుదిర్చేందుకు, ప్రయత్నించారు. చివరకు ఉప్పు – నిప్పుల ఉన్న ఇద్దరినీ కలిపి ఉంచేందుకు, అమరిందర్ సింగ్ అభ్యంతరం చెప్పినా, పట్టించుకోకుండా సిద్దూని పీసీసీ అధ్యక్షునిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఆదిస్థానం ఏమి ఆశించి సిద్దూకు బాధ్యతలు అప్పగించిందో ఏమో, కానీ,ఇద్దరి ద్దరూ, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని నిరూపిస్తున్నారు.
సిద్దూ వర్గానికి చెందిన నలుగురు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్’ను తక్షణం తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరిందర్ సింగే, పార్టీ కెప్టెన్’ని సిద్దూ టీమ్’కి తేల్చి చెప్పింది. అంతే కాదు. పార్టీని ఐక్యంగా ఉంచవలసిన బాధ్యత పీసీసే చీఫ్’గా సిద్దూపై ఉంటుందని, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరిష్ రావత్ గుర్తు చేశారు. అయితే, సిద్దూ పీసీసీ బాధ్యతలు చేపట్టి తర్వాత , దూకుడు మరింతగా పెంచారని, ఎన్నికలకు ముందే ‘ముఖ్యమంత్రిని తొలిగించే వ్యూహంతో పావులు కదుపుతున్నారని, అమరిందర్ సింగ్ వర్గం ఆరోపిస్తోంది. సిద్దూ పీసేసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎందుకు ఉపందుకున్నాయో, అధిష్టానం ఆలోచించి, దిద్దుబాటు చర్యలు, తీసుకోవాలని, ముక్ష్యమంత్రి సతీమణి, కాంగ్ర్ఫెస్స్ పార్టీ ఎంపీ ప్రణీత్ కౌర్ సూచించారు.
దిద్దుబాటు చర్యలు అంటే సిద్దూను పీసీసీ పావి నుంచి తప్పించాలని, ఆమె చెప్పకనే చెప్పారు. ఇలా ముఖ్యమంత్రిని కుర్చీదించాలని సిద్దూ వర్గం, సిద్దూను కుర్చీదించాలని అమరిందర్ వర్గం డిమాండ్ చేస్తూండడంతో కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంటోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందేందుకు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అత్యవసరంగా భావిస్తున్న సమయంలో ఇద్దరు అగ్ర నేతల మధ్య తగవు పోరాటంగా మారడం ఆందోళన కలిగించే అంశంగానే చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ అంటున్నారు.