బీ కాషియస్.. హైదరాబాద్ బిర్యానీలో మార్పొస్తోంది
posted on Aug 27, 2021 @ 11:26AM
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చే ఏ జాతీయ నాయకుడైనా తెలంగాణకో, హైదరాబాద్ కో వచ్చాడంటే తప్పనిసరిగా హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేసి తీరతాడు. శాకాహార నేతల సంగతి పక్కన పెడితే మాంసాహారప్రియులకు మాత్రం ఇకపై వర్రీ తప్పదంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీలో మార్పు మొదలవుతుందంటున్నారు. ఇప్పటివరకూ మన హైదరాబాద్ బిర్యానీ మేకర్స్ మెయింటెయిన్ చేసిన క్వాలిటీ క్రమంగా సన్నగిల్లే రోజులు వచ్చేశాయంటున్నారు. మరికొద్ది రోజులు పోతే హైదరాబాద్ బిర్యానీ అసలు టేస్ట్ దొరకడం కష్టమంటున్నారు. దీనిక్కారణం.... ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించాక కేవలం, ఉద్యోగ, ఉపాధి, టూరిజం రంగాల్లోనే కాక మిగతా రంగాల్లో కూడా దాని ప్రభావం నేరుగా పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
మన హైదరాబాద్ బిర్యానీలో వాడే పదార్ధాలేంటో తెలిస్తే బిర్యానీ క్వాలిటీ ఎందుకు మారుతుందో అర్థమవుతుంది. బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్‌లే ప్రధానమైన పదార్థాలు. అయితే ఆ వంటకు అద్భుతమైన రుచి రావడంలో మాత్రం డ్రై ఫ్రూట్స్‌దే కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని ఎలా ఉపయోగిస్తారనేదే బిర్యానీ రుచికి కీలకం. హైదరాబాద్ బిర్యానీకి ఆ రుచి రావడానికి కారణం ఈ డ్రైఫ్రూట్స్. మనకు బిర్యానీలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ లో చాలా వరకూ ఆఫ్ఘన్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఈ తాలిబన్ రాక్షస పాలనతో అవి మనకు దొరికే పరిస్థితి లేదు. దొరికినా విపరీతమైన ఖరీదుగా మారిపోయాయి. హైదరాబాద్ బిర్యానీలో వాడే ఈ డ్రైఫ్రూట్స్ కి ఉన్న డిమాండ్ కారణంగా కొందరు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన పౌరులు నగరంలో డ్రైఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు. వారు అక్కడ నుంచి వీటిని తీసుకు వచ్చి ఇక్కడ హోటళ్లకు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ భయానక పరిస్థితిలో వారు అక్కడికి వెళ్లడం లేదా అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకురావడం జరిగేపని కాదు.ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో అన్నీ స్తంభించిపోయాయి. రవాణా సౌకర్యాలు పూర్తిగా లేకుండా పోయాయి. ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ తో దౌత్య సంబంధాలు బాగా ఉండేవి. ఇప్పుడు తాలిబన్ రాకతో ఇది మారిపోయింది. భారత్ కు తాలిబన్ కు మధ్య చాలా అంతరం ఉంది. ఉగ్రవాద ముద్ర ఉన్న తాలిబన్లతో చేతులు కలిపే పరిస్థితి భారత్ కు లేదు. దీంతో ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఆ ఎఫెక్ట్ మన బిర్యానీపై నేరుగా పడబోతోంది.
డ్రైఫ్రూట్స్ దొరక్కపోతే చేసేదేమీ లేదని నగరంలోని హోటల్ వ్యాపారులు అంటున్నారు. అసలే కరోనా దెబ్బకు వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది అనుకుంటే.. ఇదే సమయంలో తాలిబాన్ దెబ్బ పడింది అని హోటల్ నిర్వాహకులు ముఖ్యంగా బిర్యానీ హోటల్స్ వారు వాపోతున్నారు. పరిస్థితులు చక్కబడే సూచనలు కనబడటం లేదనీ.. చాలా కాలం ఈ సంక్షోభం కొనసాగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. బిర్యానీ తయారీలో రుచికి వాడే డ్రై ఫ్రూట్స్ కు ప్రత్యామ్నాయం లేదని అందువల్ల అవి లేకుండానే బిర్యానీ తయారు చేసే పరిస్థితి వచ్చిందనీ వారంటున్నారు. దీంతో బిర్యానీ రుచి తగ్గుతుందని చెబుతున్నారు. అందువల్ల హైదరాబాద్ బిర్యానీ ప్రియులందరూ... ఆ వంట అసలు టేస్ట్ మారకముందే ఆఖరుసారిగా ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడున్న డ్రైఫ్రూట్స్ నిల్వలు ఉన్నంతవరకే అసలు టేస్ట్ కొనసాగుతుంది. ఆ సరుకులు అయిపోయాక... క్వాలిటీ పడిపోక తప్పదన్న ఆదుర్దా బిర్యానీ ప్రియుల్లో వ్యక్తమవుతోంది.