ప్రైవేట్ చేతుల్లోకి పీఎస్ఎల్వీ తయారీ! ఇస్రోపైనా కార్పొరేట్ల కన్ను?
posted on Aug 28, 2021 @ 10:35AM
దేశంలో ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశమే కీలకలంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ కొన్ని రోజులుగా ప్రైవేట్ జపం చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తోంది. బ్యాంకులను విలీనం చేసింది. దేశానికే తలమానికమైన ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ లోనూ ప్రైవేట్ సంస్థలు ప్రవేశించాయి. ప్రపంచలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్లోలోకి వ్యాపార సంస్థలు ఎంటర్యయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి దిగ్గజ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. వచ్చే నాలుగేండ్లలో ప్రైవేటీకరించనున్న సంస్థల జాబితాను ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ప్రైవేటీకరణ జాబితాలో ఉందని తెలుస్తోంది.
ఇస్రో తలపెట్టిన అంతరిక్ష ప్రయోగాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మొట్టమొదట వినిపించే పేరు .. పీఎస్ఎల్వీ . తిరుగులేని అంతరిక్ష వాహకనౌక . ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన శాటిలైట్లను తీసుకుని నింగి వైపు దూసుకెళ్లే వాహక నౌక ఇది . ఇన్ని సంవత్సరాల పాటు ఇస్రో సొంతంగా దీన్ని తయారు చేస్తూ వచ్చింది . ఇప్పుడు ఆ అధికారం ఇస్రో చేతుల్లో నుంచి జారిపోనుంది. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలతో.. పీఎస్ఎల్వీ తయారీ పనులు ఇక కార్పొరేట్ పరం కానుంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పీఎస్ఎల్వీల తయారీ కాంట్రాక్ట్ ను పొందడానికి బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతోన్నాయి . పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ ను పొందడానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ , ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియాలు రేసులో నిల్చాయి, ఈ రెండు కన్సార్టియాలతో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( బీహెచ్ఈఎల్ ) సింగిల్ కంపెనీగా బిజ్ను దాఖలు చేశాయి.
గుజరాత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన కంపెనీ అదాని గ్రూప్. దీని సారథ్యంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది . ఈ రెండింటితో పాటు బీహెచ్ఈఎల్ సింగిల్ కంపెనీగా బిడ్స్ దాఖలు చేసింది. గత నెల 30 వ తేదీ వరకు అదాని గ్రూప్ , ఎల్ అండ్ టీ , బీహెచ్ఈఎల్ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలయ్యాయి. ఎవాల్యూషన్ పూర్తయిన తరువాత .. అర్హత సాధించిన కన్సార్టియాన్ని ఎంపిక చేస్తామని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ డీ తెలిపారు. పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ పనులను దానికి అప్పగిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్వీ తయారీ ప్రక్రియ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రైవేటు పరం కాబోతోండటం ఇదే తొలిసారి.
అదాని వంటి బడా పారిశ్రామికవేత్త ఇక అంతరిక్ష పరిశోధనల సెక్టార్ లో కూడా అడుగు పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు సర్వాత్రా వినిపిస్తోన్నాయి . కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పెట్టుబడుల ఉపసంహరణ విధానం పరిధిలోకి ఇస్రోను కూడా చేర్చడానికి దీన్ని తొలి అడుగుగా భావించే వారు కూడా ఉన్నారు. క్రమంగా ఇస్రో సైతం ప్రైవేటీకరణ దిశగా సాగుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్టు ఆహ్వానించడంతో తొలిదశలో కీలకమైన పీఎస్ఎల్వీ ప్రైవేటీకరణ పూర్తి అయినట్టేనని అంటున్నారు.