చదువు కోసమా ‘బరువు’ కోసమా? స్కూల్స్ తెరుస్తోంది ఎందుకోసం..?

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఆన్లైన్ బోధనతో పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదని, అందుకే ప్రత్యక్ష బోధన అని వివరణ ఇచ్చారు. నిజమే, ఆన్లైన్ బోధనతో పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదనడంలో నిజముంది. సరైన సదుపాయాలు,గాడ్గేట్స్ లేక ఇతర సాకేతిక సదుపాయాలు అందుబాటులో లేక కొందరు, అన్నీ ఉన్నా సరైనా అజామాయిషి లేక ఇంకోదరు పిల్లలు చదువుకు కొంత దూరం అవుతున్న మాట నిజమే. అయితే, ఏ ప్రమాణాల మీద ఆధారపడి మంత్రిగారు, పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమనే  నిర్ణయానికి వచ్చారో మాత్రం అర్థం కావడం లేదని తల్లి తండ్రులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  ఓ వంక కరోనా థర్డ్ వేవ్ తప్పదన్న వార్తలొస్తున్నాయి, కేంద్ర  ప్రభుత్వం కూడా రాష్ట్రాలను హెచ్చరించింది. కొవిడ్ మార్గదర్శకాలను సెప్టెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ  చేసింది. రాష్ట్రంలోనూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పే పరిస్థితి లేదు. వాక్సినేషన్ కార్యక్రమం కూడా అంత జోరుగా ఏమీ సాగడం లేదు. అసలు పిల్లల వాక్సిన్ రానేలేదు. థర్డ్ వేవ్ వస్తే, పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చాలా వేగంగా విస్తరిస్తుందని అన్ని వైపులా నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.ఇలా ఏ కోణం నుంచి చూసినా రెడ్ మార్కే కనిపిస్తోంది. అయినా, విద్యాశాఖ మంత్రి  పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. అయితే, ప్రభుత్వం ఎందుకోసం, ఏమి ఆశించి విద్యాశాఖ  ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికే తెలియాలని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. చివరకు విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వం పెద్ద ప్రమాదాన్ని స్వాగతిస్తోందా, అనే  ఆందోళనలోనే ఉన్నారు.  అలాగే, ప్రైవేటు యాజమాన్యాలు చూపెట్టిన ‘బరువు’కు ప్రభుత్వం తలొగ్గిందనే  అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.  విద్యా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాత్రం ఇంట్లో మాదిరిగానే, విద్యా సంస్థలలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. హామీ ఇస్తున్నారు. అదే సమయంలో పిల్లలను స్కూల్స్’కు పంపి తీరాలనే, నియమం ఏదీ లేదని, తల్లి తండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అంటున్నారు. అంటే, పరోక్షంగా రేపు ఏదైనా జరగరానిది జరిగితే, బాధ్యతను తల్లి తండ్రుల మీద నెట్టి, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందా, అనే అనుమానం వ్యక్తమవుతోంది.   అయితే వాస్తవ పరిస్థితిని గమనిస్తే, చాలా వరకు పాఠశాలలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయి. టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేని పాఠశాలలో, కొవిడ్ నిబంధనలను పాటిస్తామని చెప్పడం అంటే, అది ఆత్మ వంచన అనిపించుకుంతుందే తప్ప మరొకటి కాదని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే అంటున్నారు.అన్ని క్లాసులు ఒకే సారి కాకుండా  అంచెల వారీగా ప్రారంభిస్తే కొంతవరకు బాగుండేదనే మాట కూడా ఉపాధ్యాయుల నుంచి వినవస్తోంది.  మరోవంక  మరి కొద్ది గంటల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నా, కొవిడ్ నిబంధనలు, శానిటేషన్’కు సంబంధించి ఆదేశాలు జరేచేసినా,   స్కూళ్ల నిర్వహణ గురించి మాత్రం సర్కారు ఇంకా ఆదేశాలివ్వలేదు. వారంలో ఎన్ని రోజులు స్కూల్ నడపాలి, క్లాస్‌‌కు ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, బెంచ్‌‌కు ఎంత మందిని కూర్చోబెట్టాలి, రోజు విడిచి రోజు క్లాసులా, రోజూ నడపాలా, ప్రైమరీ పిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి ప్రశ్నలు యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. సర్కారు గైడ్ లైన్స్ లేకపోవడంతో కొన్ని స్కూళ్లు పాత పద్ధతినే పాటించాలని భావిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  అయితే తల్లి తండ్రులు మాత్రం ఇంకా చాలావరకు డోలాయమాన స్థితిలోనే ఉన్నారు. రిస్క్ తీసుకోలేమని కొందరు అంటుంటే, స్కూల్స్’కు తెరిచినా, భౌతిక తరగతులకు సమాంతరంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మంచిదని, అలా చేయడం వలన తక్కువ మంది పిల్లలతో పాఠశాలల నిర్వహణ కొంత మేరకు మెరుగ్గా ఉంటుందని..కొందరు పేరెంట్స్ అంటున్నారు. అలాగే, ముందు కాలేజీ తరగతులు ప్రారంభించి పరిస్థితిని బట్టి కింది తరగతులు ప్రారంభించడం ఉత్తమం అని కూడా కొందరు సూచిస్తున్నారు. ఇదలా ఉంటే ప్రైవేటు స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్ధులకు భౌతిక తరగతులు నిర్వహించడం వలన ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందని, పేర్కొంటూ రాష్ట్ర హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ పై ఆగష్టు 31న రాష్ట్ర హై కోర్టు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామ చంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. ఈ నేపధ్యంలో, తల్లితండ్రులు, విద్యాశాఖ అధికారులు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొవిడ్ టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడికి అస్వస్థత! పిల్లలకు డేంజరేనా?

దేశంలో ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. కొవిడ్ కట్టడికి టీకాలు తీసుకోవడమే ప్రధానమని వైద్య నిపుణులు చెబుతుండటంతో ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కొవిడ్ టీకాలు వేస్తున్నారు. 18 ఏండ్ల లోపు వాళ్లకు టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దేశీయ టీకా సంస్థ కొవాగ్జిన్ కూడా పిల్లల టీకాకు సంబంధించి ట్రయల్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ లో వెలుగుచూసిన ఘటన ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.  మధ్యప్రదేశ్ లో కరోనా టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ  ఘటన మధ్యప్రదేశ్‌లోని మెరెనా జిల్లాలో చోటుచేసుకుంది. అంబా తాలూకాలోని బాగ్‌కాపూర్‌కు చెందిన కమలేశ్ కుష్వాహా కుమారుడు పిల్లూకు శనివారం ఓ కేంద్రంలో టీకా వేశారు. ఆ వెంటనే బాలుడికి తలతిరుగుతున్నట్టు అనిపించి నోటి నుంచి నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్ తరలించారు. కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.  మరోవైపు దేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు వేస్తుండగా, ఆ వయసు లోపు వారికి ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ బాలుడికి టీకా ఎలా వేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏడీ శర్మ తెలిపారు. 16 ఏండ్ల బాలుడు కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే అస్వస్థతకు గురి కావడంతో.. పిల్లల టీకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ టీకాలు పిల్లలకు సురక్షితమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.   

బీజేపీ, వైసీపీలు దగ్గరవుతున్నాయా? రాజధానిపై రాజీకొచ్చాయా? 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ దురాన్ని తగ్గించుకుని  దగ్గరవుతున్నాయా? ఇంతకాలం చాటు మాటుగా సాగిన స్నేహ బంధం తెరలు తొలిగిపోతున్నాయా? అంటే అనుననే సంకటాలే వస్తున్నాయి. ఓ వంక రాష్ట్ర  బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేస్తామని, చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. ఈ,\ మధ్య కాలంలో గోసంరక్షణ, ఆలయ పరిరక్షణ విషయంగా  ఉద్యమాలు కూడా చేశారు.  అదే సమయంలో, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన రెడ్డి వంటి కొందరు నాయకులూ వైసీపీ అనుకూల ధోరణి అవలంబిస్తున్నారని పార్టీనాయకులు, కార్యకర్తలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.  నిజానికి, ఏపీ బీజేపీ మొదటి నుంచి కూడా, రెండుగా చీలి పోయింది. ఒక వర్గం ఒక ప్రాంతీయ పార్టీకి కొమ్ముకాస్తే, మరో వర్గం మరో ప్రాతీయ పార్టీకి అనుకూల వర్గంగా చెలామణి అవుతోంది. ఒక విధంగా  ఏపీలో బీజేపీ ఎదుగుబొదుగు లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలి పోవడానికి, పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలి పోవడం కూడా ఒక ప్రధాన కారణంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వమే వైసేపీకి దగ్గర అవుతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నిజానికి, 2019 ఎన్నికలకు ముందు నుంచి రెండు పార్టీల మధ్య అప్రకటిత అనుబంధం కొనసాగుతోందనేది బహిరంగ రహస్యమే. రాజ్యసభలో బిల్లుల, రాష్ట్ర్ర పతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కానీ, వైసీపీ నాయకత్వం, ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్’ అన్న విధంగా కేంద్ర ప్రభుత్వానికి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తూనే ఉంది. అలాగే, అటు నుంచి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎక్కడ ఆదుకోవాలో అక్కడ ఆదుకుంటోంది. అయినా, ఇంతవరకు రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబందాలు సమయానుకూలంగా మారుతున్నాయి.   ఇక  ప్రస్తుతానికి వస్తే బీజీపీ కేంద్ర నాయకత్వం వైసీపీకి ఇంకా ఇంకా దగ్గరవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరు కావడం, ఆ తర్వాత కొద్ది రోజులకే గుంటూరులో ఒక మహిళ హత్య కేసులో విచారణ కోసం వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృదం, జగన్ రెడ్డి చేతుల మీదుగా శాలు కప్పించుకుని, సర్కార్ కు క్లీన్ చిట్ ఇచ్చి వెళ్ళిపోయింది. బీజేపీ రాష్ట్ర్ర పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చిన కమిషన్ సభ్యులు, కమల దళానికి జెల్ల కొట్టి, వైసీపీకి జై కొట్టి పోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వైసీపీకి దగ్గరవుతోందనే వాదనకు మరిత్న్ బలాన్ని చేకురుస్తోంది.  తాజగా ఏపీ రాజధాని విషయంలో  కేంద్రం ప్రభుత్వం మాట మాట మార్చింది. జగన్ రెడ్డి మాటలనే మరో భాషలో పలికింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ... ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా పేర్కొంది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని చెప్పిన కేంద్ర ఇలా నాలుక మడతేయడం  ఏమిటని, జనం ప్రశ్నిస్తున్నారు.  అయితే ఇది పొరపాటున దొర్లిన తప్పిదమా లేక  బీజేపీ, వైసీపీల  మధ్య పెరుగుతున్న స్నేహ బంధానికి మరో సంకేతమా.. అనేది తేలాల్సి వుంది. అయితే జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల  నేపధ్యంలో బీజేపీ, ప్రాంతీయ పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి అనేది మాత్రం నిజం. ఇది అందులో భాగమా .. మరో వ్యుహమా అనేది ప్రస్తుతానికి అయితే ప్రశ్న..

ఒకరి అవసరం.. ఇంకొకరి అదృష్టం! కొందరు లీడర్లకు అనుకోని పదవులు.

రాజకీయాలలో కొందరి అవసరాలు, ఇంకొందరికి  అదృష్టంగా మారతాయి. అవకాశాలకు తలుపులు తీస్తాయి. అలా, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియని మాజీలు అనేక మందికి హుజూరాబాద్ ఉప ఎన్నిక, మంచి రోజులు మోసుకొచ్చింది. మాజీలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది.  ఎల్. రమణ, పెద్ది రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇలా చాలామందికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కొద్దిగా ఎక్కువతక్కువగా అదృష్టాన్ని పంచిందనే చెప్ప వచ్చును. అయితే, ఇచ్చిన వరాలు నిజంగా నిజం అవుతాయా, దళిత ముఖ్యమంత్రి జాబితాలో చేరిపోతాయా, అనేది పక్కన పెడితే, ఇంతవరకు  ముట్ట వలసినవి ఏవో ముట్టే ఉంటాయి కాబట్టి, అంతవరకు అయినా వారు  అదృష్టవంతుతే అవుతారు.  ఆదివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సరుభి వాణీ దేవి, నిజంగా మహాజాతకురాలనే చెప్పవచ్చును. అలాగని, ఆమెకు ఎమ్మెల్సీ అయ్యేదుకు అర్హతలు లేవని కాదు. ఆమెకు ఎమ్మెల్సీ కావడానికి ఉండవలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు, ‘పీవీ గారమ్మాయి’ అనే ప్రత్యేక అర్హత కూడా ఉంది. అయితే, ఆమెకు ఈ అర్హతలు ఎప్పటినుంచో ఉన్నా, ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్’ ఆమెకు అవకాశం ఇచ్చింది మాత్రం ఆయన అవసరం కోసమే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ వరస దెబ్బల  తర్వాత, వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరవలసిన అగత్యం ఏర్పడింది కాబట్టే, పీవీ పేరు, కుల సమీకరణలు అనీ బెరేజు వేసుకునే కేసీఆర్ ఆమెను ఆఖరి క్షణంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. రాష్ట్ర మంత్రి వర్గం మొత్తంగా రంగంలోకి  దిగి ఆమెను గెలిపించుకున్నారు.  కేవలం రాజకీయ నాయకులకే కాదు, రాజకీయ పార్టీల అవసరాలు జనాలకు కూడా అనుకోని, ఆశించని మేళ్ళు చేస్తాయి, అందుకు, వేరే ఉదాహరణ అవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక్కటి చాలు. ఎంత మందికి ఇస్తారు, ఎంత కాలం అమలు చేస్తారు, అనే విషయన్ని పక్కన పెడితే, ఫ్యామిలీ’కి పదిలక్షల రూపాయలు ఇచ్చే దలిత బంధు పథకం వచ్చిందంటే, అందుకు ఆ నియోజక వర్గంలో గెలుపు, అధికార తెరాసకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి అత్యవసరం, కావడమే కారణం. దళిత బంధుతో పాటుగా ఇంకా చాలా చాలా పథకాలు పరుగులు పెడుతున్నాయి. దళితులకు దళిత బంధు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి, గెలలు శ్రీవాస యాడవ్’కు ఏకంగా పార్టీ టికెట్, ఇచ్చిన కేసీఆర్, అదే క్రమంలో 26 వేలకు పైగా ఓట్లున్న పద్మశాలీ వర్గానికి రేపో మాపో చేనేత బీమా పధకాన్ని ప్రకటిస్తారని సమాచారం. నిజానికి, హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటందో ఏమో కానీ, అధికార పార్టీ గెలుపు ఆరాటంలో అటు పేడవుట్ అయిన రాజకీయ నాయకులకు, ఇటు ప్రజలకు కూడా మేలు జరిగింది.   అదలా ఉంటె, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ వాణీ దేవీ,ప్రజాసేవ చేయడానికి పదవే అవసరం లేదన్న తలతిక్క తనకు ఉండేదని, కానీ కొన్ని పనులు చేయాలంటే పదవి ఉండాలని గ్రహించానని చెప్పారు. నిజమేల, అధికారం లేని ఆదర్శాల వలన ప్రయోజనం ఉండదు. మార్చిలో జరిగిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.

రేవంత్ కు పీసీసీ పదవి వచ్చింది ఆయన వల్లేనట! 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీనే సాగింది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరికొందరు రేసులో నిలిచారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య చివరి వరకు హోరాహోరీ నడిచింది. దాదాపు ఆరు నెలల పెండింగ్ తర్వాత చివరికి మల్కాజ్ గిరి ఎంపీ, ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ నియామకం తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెట్టి బహిరంగంగానే అసమ్మతి స్వరం వినిపించారు. కాని వెంటనే ఆయన సైలెంట్ కావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి షో నడుస్తోంది. పీసీసీ చీఫ్ గా పార్టీలో కొత్త జోష్ నింపారు రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో అధికార పార్టీకి చుక్కలు చూపించడంతో పాటు కేడర్ ను ఉత్తేజపరుస్తున్నారు. రేవంత్ ఎఫెక్టుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాడుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలతో  ప్రభుత్వంపై రేవంత్  రెడ్డి సమర శంఖం పూరిస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తూ.. సీనియర్లందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.  నిజామాబాద్‌లో చేపట్టిన రాజీవ్ రైతు దీక్ష వల్లే తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కిందన్నారు రేవంత్ రెడ్డి. ఆ సభ విజయవంతమైన విషయం ఢిల్లీ పెద్దలకు చేరిందన్నారు. టీపీసీసీ పదవి ఎంపికకు సంబంధించి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని రేవంత్ చెప్పారు. హైకమాండ్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటానని తెలిపారు రేవంత్ రెడ్డి. పార్టీలో గ్రూపులు లేవన్న రేవంత్ రెడ్డి.. అందరం కలిసే పోరాడుతామని చెప్పారు. తనకు పీసీసీ చీఫ్ రావడానికి రేవంత్ రెడ్డి చెప్పిన కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.  కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భయంతోనే తెలంగాణ,ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ సైతం ఒకసారి ఎమ్మెల్యేగా,సింగిల్ విండో ఛైర్మన్‌గా ఓడిపోయారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బహుజన భవన్‌గా మారుస్తామని ప్రకటించారు. దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. తనకు ఎలాంటి కోరికలేవని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునని... పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో దళిత, గిరిజన, ఆదివాసీల విద్యకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.  

ఏపీ రాజధాని విశాఖ ఎప్పుడైంది! ఆంధ్రులతో కేంద్రం ఆటలేందీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటీ? ఈ ప్రశ్నకు ప్రతి ఆంధ్రుడి నుంచి వెంటనే వచ్చే సమాధానం అమరావతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏపీకి రాజధానిగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఖరారు చేసింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పునాదులు కూడా పడ్డాయి. అమరావతి నిర్మాణ  శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని 2015లోనే కేంద్రం కూడా నోటి ఫై చేయడం జరిగింది. రాజధానిలో నిర్మాణ పనులు కూడా  మొదలయ్యాయి. సచివాలయంతో పాటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు చకచకా పూర్తి కావడంతో అక్కడి నుంచే పాలన సాగుతోంది. ఆంధ్రులంతా అమరావతిని తమ కలల రాజధానిగా భావించారు.  2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వచ్చిరాగానే అమరావతిపై పడింది. చంద్రబాబుకు పేరు వస్తుందన్న అసూయో మరోదే కాని కలల రాజధానిని ముక్కలు చేసే ప్రయత్నాలు చేసింది.  2019 నవంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది జగన్ రెడ్డి సర్కార్.  పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపింది.ఏపీ మూడు రాజధానులకు సంబంధించిన సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఆగస్టు, 2020లో గవర్నర్  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమరావతి  రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమరావతి తరలింపునకు సంబంధించి రైతులతో పాటు ఇతరులు ఏపీ హైకోర్టులో దాదాపు వంద వరకు కేసులు వేశారు. వీటిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు అమరావతి రాజధాని తరలింపు సాధ్యం కాదు. జగన్ కు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే. ఈ విషయం తెలుసు కాబట్టే.. కోర్టు కేసుల్లే తేలవరకు ఏం చేయలేమని క్లారిటీ ఉంది కాబట్టే రాజధాని విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ అయింది.. ఏపీ రాజధాని అంశం హైకోర్టులో ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలో ఆటలాడుతోంది. గడియకో మాట మాట్లాడుతూ జనాల్లో గందరగోళం స్పష్టిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ డాక్యుమెంట్ తీవ్ర వివాదస్పమవుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి సంబంధించి లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నలు అడిగారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎంత ట్యాక్స్ వసూల్ చేస్తుందన్నది వాళ్ల ప్రశ్న. కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నకు  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జూలై 26న లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు విధిస్తున్న పెట్రోల్, డీజిల్ పన్నులు.. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ధరలను పొందుపరిచారు. అయితే ఇందులో రాష్ట్రాల రాజధానుల దగ్గర ఏపీకి వచ్చేసరికి విశాఖ అని ఉంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ రాజధాని విశాఖ అని కేంద్రం లోక్ సభకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉండటంతో ... ఏపీకి రాజధానిగా విశాఖను కేంద్రం అంగీకరించిందా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతో వైసీపీలో సంతోషం వ్యక్తం అవుతుండగా.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. కేంద్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి అంశం హైకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులపై విచారణ కొనసాగుతోంది. ఆగస్టు 23న కూడా విచారణ జరిగింది. తదుపరి విచారణకు నవంబర్ కు వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు పరిధిలో ఉన్న అంశంలో కేంద్రం విశాఖను రాజధానిగా ఎలా పొందుపరిచిందని ప్రశ్నిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన విషయంలో కేంద్ర సర్కార్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ అమరావతి విషయంలో కేంద్రం ఇలాంటి తప్పే చేసింది. గత జూన్ లో చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేశారు. దీనికి ఆ శాఖ సీపీఐఓ డైరెక్టర్‌ రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇస్తూ.. అమరావతి ప్రస్తావన తీసుకురాకుండా.. ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020’ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలు ఉంటాయని, వీటిని రాజధానులు అంటారని వివరించారు. రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంపై అమరావతి జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ జీవీఆర్ శాస్త్రి.. కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. రేణు సరిన్ పేర్కొన్న చట్టం ఇంకా అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. శాస్త్రీ లేఖపై స్పందించిన సరిన్.. గతంలో తానిచ్చిన సమాధానాన్ని సవరించారు. ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేశారు. అమరావతి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మళ్లీ సరిదిద్దుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పే చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో  ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేసిన కేంద్రం... ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. నిజానికి కేంద్ర పెట్రోలియం శాఖ ఇచ్చిన వివరాల్లో విశాఖలోని పెట్రోల్, డీజిల్ రేట్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  అంతవరకు బాగానే ఉన్నా.. విశాఖను ఏపీ రాజధానిగా చూపడమే వివాదాస్పమవుతోంది. అమరావతి విషయంలో బీజేపీ మొదటి నుంచి డబుల్ గేమ్ ఆడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా... కేంద్రం మాత్రం 'రాష్ట్ర రాజధాని ఎక్కడ.? అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెబుతూ వస్తోంది. తాజాగా ఏపీ రాజధానిగా విశాఖను చూపుతూ పెట్రోలియం శాఖ ఇచ్చిన డాక్యుమెంట్ తో కేంద్రం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతోంది. ఇప్పటికైనా జరిగిన తప్పును కేంద్రం సరిద్దిది జనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.    

పాత కాపుల‌తో విజ‌య‌మ్మ‌ కొత్త వ్యూహ‌మా? జ‌గ‌న్ కోస‌మా? ష‌ర్మిల కోస‌మా?

జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. విజ‌య‌మ్మ ఫోన్ చేసి పిలుస్తున్నారు. జ‌గ‌న్ కాద‌నుకున్నారు. విజ‌య‌మ్మ కావాల‌నుకుంటున్నారు. వారంతా వైఎస్సార్ హ‌యాంలో హేమాహేమీలు. సెప్టెంబ‌ర్ 2న పావురాల గుట్ట‌లో ఆయ‌న మ‌ర‌ణంతో చాలామంది కీల‌క నేత‌లు తెర‌మ‌రుగు అయిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. లేన‌ట్టుగానే మిగిలిపోయారు. పార్టీకే క‌ట్టుబ‌డి ఉన్నారు. ప‌ద‌వుల‌కు క‌క్కుర్తిప‌డి జ‌గ‌న్ పంచ‌న చేర‌లేదు. అలాంటి వారంద‌రినీ 12 ఏళ్ల త‌ర్వాత విజ‌య‌మ్మ గుర్తుకుపెట్టుకొని మ‌రీ ఫోన్లు చేసి స్పెష‌ల్‌గా ఇన్వైట్ చేయ‌డాన్ని ఎలా చూడాలి? ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడే విజ‌య‌మ్మకు వారు ఎందుకు గుర్తుకు వ‌స్తున్న‌ట్టు? దీని వెనుక ఏదైనా మ‌ర్మం ఉందా? మ‌రేదైనా రాజ‌కీయ వ్యూహం దాగుందా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.   ఏపీలో కేవీపీ, ఉండ‌వ‌ల్లిలాంటి వాళ్లు ఒక‌ప్పుడు వైఎస్‌కు లెఫ్ట్‌, రైట్ అన్నట్టు ఉండేవారు. కేవీపీ మైండ్‌ను వైఎస్సార్ విచ్చ‌ల‌విడిగా వాడుకుంటే.. ఉండ‌వ‌ల్లి నోరును రామోజీరావుపై ఆయుధంగా ప్ర‌యోగించారు. ఇక తెలంగాణ‌లో డీఎస్‌, కోమ‌టిరెడ్డి, పొన్నం లాంటి వాళ్లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి న‌మ్మినబంట్ల‌లా ఉండేవారు. వైఎస్సార్ మ‌ర‌ణించాక వారంతా జ‌గ‌న్ వెంట పోలోమ‌ని పార్టీ ఫిరాయించ‌లేదు. వైఎస్సార్ బ‌లోపేతం చేసిన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. వైఎస్సార్ ఆత్మ‌లాంటి కేవీపీపై జ‌గ‌న్ చేసిన రాజ‌కీయ కుట్ర‌లు అన్నీఇన్నీ కావు. కాంగ్రెస్‌ను వీడిన తొలినాళ్ల‌లోనే కొండా సురేఖ‌తో కేవీపీ మీద అవినీతి విమ‌ర్శ‌లు చేయించిన చ‌రిత్ర జ‌గ‌న్‌ది. తండ్రికి అత్యంత ఆత్మీయుడైన కేవీపీని తొక్కేయాల‌ని చూసిన ప్ర‌బుద్ధుడు జ‌గ‌న్‌. ఉండ‌వ‌ల్లిని సైతం డోంట్‌కేర్ అన్నారు. అందుకే, వారిద్ద‌రు జ‌గ‌న్ ఇగోకు త‌ట్టుకోలేక.. కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. ఇక జ‌గ‌న్ ఏపీకే ప‌రిమిత‌మ‌య్యారు కాబ‌ట్టి తెలంగాణ కాంగ్రెస్ వాదుల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని చెప్పొచ్చు. జ‌గ‌న్ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. స‌డెన్‌గా విజ‌య‌మ్మ‌కు వాళ్లంతా ఎందుకు గుర్తొచ్చార‌నేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  మామూలుగా నైతే ఏడాదికో, ప‌దేళ్ల‌కో, 20, 25, 50, 75, 100 ఇలా కొన్ని మైలురాయి సంవ‌త్స‌రాల‌ను ప్ర‌త్యేకంగా జ‌రుపుతుంటారు. కానీ, వైఎస్సార్ చ‌నిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇదేమంత ప్ర‌త్యేక స‌మ‌య‌మూ కాదు. కానీ, ఎందుక‌నో కానీ విజ‌య‌మ్మ వైఎస్సార్ వ‌ర్థంతిని ఈసారి ప్ర‌త్యేకంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా అప్ప‌టి వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితులు, కేబినెట్ స‌హ‌చ‌రుల‌ను ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానిస్తున్నార‌ని స‌మాచారం. కేవీపీ, ఉండ‌వ‌ల్లి నుంచి డీఎస్ వ‌ర‌కు.. ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ మ‌నుషుల‌ను ఇన్వైట్ చేయ‌డంపై రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.   వారంతా వ‌స్తారా? రారా? అనేది ప‌క్క‌న పెడితే.. పిలిచారా.. లేదా.. అనేదే ఇక్క‌డ కీల‌కాంశం. ఇదంతా ఎందుకు? విజ‌య‌మ్మ మునుపెన్న‌డూ లేనిది ఈసారి ఇంత హంగామా ఎందుకు చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ కోస‌మా? ష‌ర్మిల కోస‌మా? అంటే ఇద్ద‌రి కోస‌మూ అనే వారూ ఉన్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌మ్మ జ‌గ‌న్‌కు దూరంగా ష‌ర్మిల చెంత ఉంటున్నా.. ఎంత‌కాద‌న్నా వారంతా ఒకే కుటుంబం.. వారంతా ఒక్క‌టే.. పైపైకి అలా చేస్తున్నార‌నే అనుమాన‌మూ ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. ప్ర‌జావ్య‌తిరేక‌త‌, సీబీఐ కేసు, బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం, జ‌గ‌న్ జైలుకెళితే పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని కాచుకు కూర్చున్న కీల‌క నేత‌ల ద్వ‌యం.. ఇలా జ‌గ‌న్ అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నార‌నేది విజ‌య‌మ్మ భావ‌న‌. ఇప్పుడున్న వైఎస్సార్‌సీపీలో ఎవ‌రినీ గుడ్డిగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఎవ‌రూ అంత‌టి స‌మ‌ర్థులూ కారు. అందుకే, త‌న భ‌ర్త వైఎస్సార్ న‌మ్మిన కేవీపీ, ఉండ‌వ‌ల్లి లాంటి వారినే ఇప్పుడు విజ‌య‌మ్మ సైతం న‌మ్ముతున్నారు. వైఎస్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ఆనాటి న‌మ్మ‌ద‌గిన నేత‌ల‌ను ఆహ్వానించి.. వారితో కీల‌క మంత‌నాలు జ‌ర‌పాల‌నేది విజ‌య‌మ్మ ఆలోచ‌న‌లా క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌ను సుర‌క్షితం చేసేందుకు వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఉంది. జ‌గ‌న్‌కు సంబంధం లేకుండా.. కొడుకు కోసం విజ‌య‌మ్మ చేస్తున్న సొంత ప్ర‌య‌త్నం అంటున్నారు. మ‌రి, అందుకు ఆనాటి నేత‌లు ఈనాడు ఆమెకు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారో చూడాలి.. ఇక‌, తెలంగాణ‌లోని వైఎస్సార్ ప్ర‌ధాన స‌హ‌చ‌రుల‌ను ఆహ్వానించ‌డం వెనుకున్న రీజ‌న్‌ను ఈజీగానే గెస్ చేయొచ్చు అంటున్నారు. ఇంకెందుకు ష‌ర్మిల కోస‌మే. వైఎస్సార్ పేరు మీదుగా పార్టీ పెట్టినా.. పాపం ష‌ర్మిల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక్క కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆల్ ది బెస్ట్ చెప్ప‌డం మిన‌హా పాత కాపులెవ‌రూ ఆమెకు కొత్త‌గా స‌పోర్ట్ చేయ‌డం లేదు. అందుకే, వైఎస్సార్ వ‌ర్థంతి పేరుతో.. పాత వైఎస్ సెంటిమెంట్‌ను కొత్త‌గా రాజేసేందుకు విజ‌య‌మ్మ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ఆనాటి వైఎస్సార్ కేబినేట్ స‌హ‌చ‌రులంద‌రినీ సెప్టెంబ‌ర్ 2న ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నార‌ట విజ‌య‌మ్మ‌. పాపం.. కూతురు కోసం విజ‌య‌మ్మ ఇంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి...  

సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ‌.. జ‌గ‌న్ వైఫల్యాల‌పై నిల‌దీత‌..

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ‌లో ఏపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై దుయ్య‌బ‌ట్టారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రం, కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆ మేర‌కు టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి లేఖ రాశారు.  ‘‘వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? కేంద్ర గెజిట్‌లో ప్రాజెక్టును చేర్చకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యమే. ఇది సర్కారు వైఫల్యమే తప్ప ప్రాజెక్టుకు అనుమతులు లేనట్టు కాదు. విభజన చట్టం ప్రకారం 6 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు సహా వెలిగొండ అనుమతిని గుర్తు చేస్తున్నాం. కేంద్ర గెజిట్‌లో వెలిగొండను చేర్చండి అని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినా నిర్లక్ష్యం వహించారు. కేంద్రమే వెలిగొండకు అనుమతులిచ్చి ఇప్పుడు గెజిట్‌లో స్థానం ఇవ్వలేదు. ఇది మా జిల్లా రైతుల తప్పా? ఏపీ ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపించి ఫిర్యాదులు చేయడం తగదు. కేంద్రం, కేఆర్‌ఎంబీకి తెలంగాణ చేసిన ఫిర్యాదు, రాసిన లేఖతో ప్రకాశం జిల్లా రైతుల్లో కలవరం మొదలైంది’’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ‌లో తెలిపారు.   

వైఎస్ అనుచరులకు విజయమ్మ ఆహ్వానం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం! 

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైస్ విజయమ్మ మరోసారి వార్తల్లో నిలిచారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న  హైదరాబాద్‌లో ఆమె ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు, రాజకీయ సహచరులను విజయమ్మ ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.  2009 సెప్టెంబరు 2 రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూల్ జిల్లా పావురాల గుట్టలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి పోవడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయారు. అయితే ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.  ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేనిది ఇప్పుడు విజయమ్మ  ఆహ్వానం పంపడం ఏంటనే చర్చ జరుగుతోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్సార్. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఆయన సంబంధాలున్నాయి. దీంతో గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన తెలంగాణ, ఏపీకి చెందిన నాయకులకు, ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా  విజయమ్మ ఆహ్వానాలు వెళుతున్నాయట. వైఎస్ మంత్రివర్గంతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా ఆహ్వానాలు వెళ్తున్నాయి. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కేఆర్ సురేష్ రెడ్డితో పాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులను విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా విజయమ్మ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణలో షర్మిల సొంత పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో విజయమ్మ ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వైఎస్ఆర్ చనిపోయిన 12 ఏళ్ల తర్వాత ఈ సమావేశాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడే ఎందుకు పెట్టాలనుకుంటున్నారనే సందేహం అందరిలోనూ వస్తోంది. ఈ సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా ఇది కూతురు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ కోసమే పెట్టినట్టుగా అందరూ అనుమానిస్తున్నారు. షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ని ప్రారంభించగా.. కూతురుకు తల్లి వైఎస్ విజయమ్మ మద్దతుగా నిలిచారు. షర్మిల పార్టీ సభల్లో పాల్గొన్నారు.  తెలంగాణలో షర్మిల పార్టీలోకి కీలక నేతలు ఎవరూ రావడం లేదు. పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ విజయమ్మ ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఆత్మీయ సమావేశం వెనుక రాజకీయం లేదని అనుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చర్చలు ఎలా ఉన్నా విజయమ్మ  ఆహ్వానాలపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. సమావేశం ముగిశాకే విజయమ్మ ఎజెండా ఏంటనేది తెలియనుంది.మొత్తానికి వైఎస్సార్ వర్ధింతి రోజున విజయమ్మ నిర్వహించబోతున్న సమావేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాత్రం ఆసక్తి రేపుతోంది. 

చంద్రబాబు పతనానికి కారణం చెప్పిన మోత్కుపల్లి..

తెలుగు దేశం పార్టీలో చాలా కాలం పని చేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి... ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2018లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు మోత్కుపల్లి. సీఎం కేసీఆర్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ ను ప్రశంసిస్తూ వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. దళిత బంధుపై ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతల తీరును తప్పుపడుతున్నారు నర్సింహులు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా, దళిత బంధుకు, సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఆదివారం తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు మోత్కుపల్లి నర్సింహులు. దీక్ష సందర్భంగా దళిత బంధు పథకంతో పాటు విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. తెలంగాణలో దళితబంధు పథకం.. వంద శాతం అమలు కాకపోతే యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకాన్ని వంద శాతం అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మాటల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు. సీఎం ప్రకటించినట్లే చేస్తారనే నమ్మకం తనకు ఉందని.. ఒకవేళ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.దళితుల సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్.. మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. తెలుగు దేశం పార్టీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబు నాశనమయ్యారని చెప్పారు. రేవంత్ జీవితమంతా మోసాలు, బ్లాక్ మెయిలింగే అని విమర్శించారు నర్సింహులు. ఆర్టీఐని వాడుకుని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. దళితులు కులవివక్షకు గురై మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. వారివి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులని చెప్పారు. గ్రామాల్లో దళితులు గతంలో రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోందన్నారు మోత్కుపల్లి. ఒక  పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకానికి మద్దతు ఇవ్వడం.. సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు నర్సింహులు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా పని చేసినా.. దళితుల కోసం ఎవరూ స్పందించలేదని చెప్పారు. దళితుల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అంతా అంటున్నారని తెలిపారు. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తామని మోత్కుపల్లి స్పష్టం చేశారు. 

తెలుగుకి సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ.. భాషను నాశనం చేసేందుకే కంకణం..

తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ పాలనలో గిడుగు రామ్మూర్తి ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుగా ప్ర‌భుత్వం వ్యవహరిస్తోంద‌ని మండిప‌డ్డారు. వైసీపీ పాల‌న‌ నుంచి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉందన్నారు. బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడే ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుందని.. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. తెలుగునాట వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న ప్రపంచంలోని తెలుగువారందరికీ చంద్రబాబు, నారా లోకేశ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం గిడుగు రామ్మూర్తేనని చంద్రబాబు అన్నారు. ప్రజలలో అక్షరాస్యత పెరగాలంటే మాతృభాషలోనే బోధన జరగాలని ఆయన విశ్వసించారని గుర్తుచేశారు.   గిడుగు రామ్మూర్తి కృషి వల్లే ఆ కాలంలో ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, రచన వాడుక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చాయని నారా లోకేశ్‌ అన్నారు.  తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం నుంచి.. పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్ర‌బాబు గుర్తు చేశారు.  

దేశ భాషలందు తెలుగు లెస్స.. తేనెకన్నా తీయనిది తెలుగు భాష

భాష అంటే ధ్వనుల గుంపు.  వర్ణం అంటే అక్షరం అక్షర అంటే నశించనిది. మాట గాలిలో కలిసి పోవచ్చు కానీ మాట సంకేతమైన అక్షరం మాత్రం చెరిగిపోదు. రంగులతో రాయటం వలన వర్ణం అని రంగులతో పూయటం వలన లిపి అని చెక్కటం గీకటం వలన లేఖం అని పేర్లు వచ్చాయని చరిత్ర చెబుతుంది. కాని మన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. అందుకే తెలుగు భాషను రక్షించుకోవడానికి వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.   నేడు దేశమంతటా వ్యాపించి ఉన్న అనేక లిపులకు మూలం బ్రాహ్మీలిపి అని కొందరు చిత్ర రూపం లోని మొహొంజొదారో లిపి అని మరికొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు ఆంధ్ర అనే పదాలు పర్యాయపదాలు అయినప్పటికీ క్రీ.శ. 10 వ శతాబ్దం ముందు ఆంధ్ర అనే పదమే పురాణేతిహాసాలలో కనిపించేది నుండి క్రీ.శ.14 శతాబ్ది నుండి తెలుగు తెనుగు అనే పదాలు వాడుకలోకి వచ్చాయి.  ఆంధ్రాలో ఆర్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన సంస్కృత పదజాలం ఎక్కువ!  తెలుగు భాషకు మాతృక  ఐదువేల సంవత్సరాల కిందటి ద్రవిడ శాఖ రెండో భాగానికి చెందిన శాసనాల ఆధారంగా తీసుకుంటే మొదటి తెలుగు శాసనం  క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది అని చరిత్ర చెబుతోంది! సాహిత్య సంపద ఉన్న నాగరిక భాషలలో తెలుగుది అగ్రస్థానం. ఆరవ శతాబ్దినుండి తెలుగులో సాహిత్య మొదలైనట్లు అంచనా.  లిపి ఉన్నవి లేనివి కలిపి భారతదేశంలో ఉన్న భాషలు 1652 గుర్తింపు పొందినవి 22 ద్రవిడ కుటుంబానికి చెందిన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో దక్షిణాది భాషలు కాగా ఇండో-ఆర్యన్ కుటుంబానికి చెందిన సంస్కృతం సహా పది భాషలు ఉత్తరాది భాషలు. ద్రావిడ భాషల్లో ప్రాచీనమైనది తమిళం అయినప్పటికీ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషను పద్య గద్య భాగాలుగా విభజించారు! నాటి ఆరవ శతాబ్ద గద్య రూపంలోని తెలుగు భాషకీ నేటి తెలుగు భాషకి వ్యత్యాసం చాలా ఉంది!  తొమ్మిదవ శతాబ్దంలో తెలుగు శాసనాలు రూపం మొదలైంది! ఉదా. అప్పట్లో పణ్డితుడు అనే వారు ఇప్పుడు పండితుడు అంటున్నారు.  తెలుగు కావ్య పరిమాణంలో కవిత్రయం నన్నయ తిక్కన ఎర్రన మహాభారతాన్ని రసరమ్యంగా హృదయానికి హత్తుకునేలా స్వేచ్ఛానువాదం తో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. భక్తుల గాధలను తత్వ బోధలు ఆరాధనా విధానాలు ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరిచి భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తి యోగాన్ని చాటే భాగవతాన్ని తెలుగులో రచించారు మహాకవి పోతన.  "దేశభాషలందు తెలుగు లెస్స" అని పలికి ఒక చేత ఖడ్గం మరో చేత కలం పట్టి తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలుగా (అల్లసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి మాదయ్యగారి మల్లన అయ్యలరాజు రామభద్రుడు పింగళి సూరన రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు)  పేరొందిన ఎనిమిది మంది తెలుగు కవులను పోషించారు- విజయనగర సామ్రాజ్య రాజులు శ్రీ కృష్ణదేవ రాయలు. వికటకవిగా పేరొందిన తెనాలి రామకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంగితం జ్ఞానం హాస్యం కలగలిపిన వారి భాష అద్భుతం.  వ్యాకరణానికి ప్రామాణిక గ్రంధంగా బాలవ్యాకరణం రచించిన మహాకవి చిన్నయసూరి. కంచర్ల గోపన్న శ్రీరామునిపై 17వ శతాబ్దంలో రచించిన భక్తి "దాశరధీ శతకం".  సూటిగా సుత్తి లేకుండా తేటగా చెప్పిన "వేమన శతకం" మంచి మాటలు నేర్పే "సుమతీ శతకం" మానవునికి సంబంధించిన వివిధ గుణాలను వివరిస్తూ రచనలు చేసిన భర్తృహరి సుభాషితాలు. తెలుగు భాషలోని కచిక ప్రత్యేకత. మొదటి నుంచి చివర వరకు చదివితే రామాయణం వస్తుంది చివరి నుంచి మొదటి వరకు చదివితే మహాభారతం వస్తుంది.  తెలుగు సాహిత్యాన్ని శాసించిన విప్లవ కవి శ్రీశ్రీ కవితల్లో ప్రాస శ్లేష శ్రీ శ్రీ సొంతం.అష్టావధానం తెలుగుకి మాత్రమే సొంతం. కోడిపిల్ల అనే పాట వింటే ఊపు వస్తుంది అదే పల్లెటూరి జానపదం .. మునెయ్య ప్రసిద్ధి. వింటుంటే వినాలి వినాలనిపించేది.. చదువుతుంటే చదవాలనిపించేది.. మన కమ్మనైన తెలుగు భాష.  కాని ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు. అమ్మతో కష్టసుఖాలు చెప్పుకునే భాష నోటికి బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్న భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు చేరదీసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వేడుకలు బాగానే ఉన్నాయి గానీ ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. వెన్న కన్నా మెత్తనైన తెలుగు భాష వర్తమానంలో పతనావస్థ అంచులపై వేలాడుతోంది. తెలుగు వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. 

హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడంటే?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? షెడ్యూలు విడుదలయ్యేది ఎప్పుడు? ఈ  ప్రశ్నలకు  ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ, ఇప్పుడు, విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఇంకా అట్టే కాలం, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటన కోసం ఎంతో కాలం నిరీక్షించ వలసిన అవసరమ లేదని తెలుస్తోంది. హుజూరాబాద్ కు డిసెంబర్ 12 వరకు సమయం ఉన్నా, పొరుగు రాష్ట్రం ఏపీలో  సిట్టింగ్  శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన బద్వేల్ స్థానానికి, సెప్టెంబర్ 28 లోగా ఉపఎన్నిక జరగవలసివుంది. ఈనేపధ్యంలో బద్వేల్ తో పాటుగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు కూడా, సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  వచ్చే సంవత్సరం (2022)  ప్రారంభ నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఐదు రాష్టాలు సహా, దేశంలో వివిధ కారణాల చేత ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలు నిర్వహించాడంపై వారి వారి  అభిప్రాయాలను తెలియచేయాలని  కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన రాజకీయ పార్టీలకు 15 రోజుల క్రితం  లేఖలు రాసింది.  ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఆగష్టు 30తో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2/3 తేదీలలో సమావేశమై ఒక నిర్ణయానికి రావచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగా ఆరు నెలల గడువు సమీపించిన లేదా ఒకే ఒక్క అసెంబ్లీ సీటు ఖాలేగా ఉన్న రాష్టాలలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా, ఉప ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టే ఆలోచనా, అవకాశం ఉన్నాయని అధికార వర్గాల సమాచారంగా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అదే జరిగితే, సెప్టెంబర్ 28తో గడువు ముగుస్తున్న  ఏపీలోని బుద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంతో పాటుగా, తెలంగాణలో ఖాళీగా ఉన ఏకైక స్థానం, హుజూరాబాద్ స్థానానికి  సెప్టెంబర్ 20 – 25 తేదీల మధ్య ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది అంటున్నారు.  అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల అభిప్రాయాలతో పాటుగా, కరోనా పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని, అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే క్షేత్ర స్థాయి నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.  అదలా ఉంటే, రానున్న రెండు నెలలు కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని  కేంద్ర ఆరోగ్య శాఖ చేఇసిన తాజా హెచ్చరికను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఎన్నికల సంఘం నిర్ణయం మరోలా ఉండే ఆకాశం లేక పోలేదని కూడా అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా, సెప్టెంబర్ మొదటి వారంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు అనే విషయంలో చాల వరకు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజకీయంగా చూసినా, ఉప ఎన్నిక ఎంతగా శీఘ్రంగా జరిగితే, బీజేపీ గెలుపు అవకాశాలు అంతగా మెరుగవుతాయి. కాబట్టి, ‘కేంద్ర’ ఎన్నికల సంఘం, గత మూడు నెలలుగా సాగుతున్నా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రహసనానికి  సెప్టెంబర్ లోనే చుక్క పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఎన్టీఆర్ సక్సెస్ సీక్రెట్స్ చెప్పిన సీజేఐ జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 

దివంగత నందమూరి తారకరామారావు. తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. అటు సినిమా రంగం ఇటు రాజకీయ రంగాన్ని ఉపేశారాయన. రెండు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలిన ఎన్టీవోడు రాజకీయ రంగ ప్రవేశం చేసి.. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంం చేపట్టారు. అంతేకాదు పాలనలో కొత్త ఒరవడి స్పష్టించి పేదల గుండెల్లో నిలిచిపోయారు. సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని అంటారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆయన సాగించిన పాలన పేద ప్రజలకు వరమని చెబుతారు. ఇప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచి ఉన్నారంటే.. ఆయన వాళ్లతో ఎంతగా మమమేకమయ్యారో తెలుసుకోవచ్చు.  దేశంలో కాంగ్రెస్ హవా సాగుతున్న రోజుల్లో, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టడమే సంచలనమైతే... 9 నెల్లల్లోనే అధికారంలోకి రావడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం..  దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సినీ నేప‌థ్య‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ మాత్రం అసలు విషయం చెప్పారు. ‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో  వర్చువల్ గా మాట్లాడిన జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ,ఆయన విజయ రహస్యానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి, ఆయ‌న తెలుగు భాషా ప్రావీణ్యానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు.  ‘నందమూరి తారక రామారావుగారు అగ్రశ్రేణి సినీనటుడు కావ‌డం వ‌ల్లే ఆయన సులువుగా అధికారంలోకి వ‌చ్చార‌ని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయి. అందులో సందేహం లేదు. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఊరారా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుత ఉచ్ఛారణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.  భాష గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పేందుకు జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఉదాహ‌ర‌ణ చెప్పారు. ప్ర‌జ‌ల్ని మాతృభాష ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుందో ఎన్టీఆర్ రాజ‌కీయ విజ‌యాన్ని ఆయ‌న ఉద‌హ‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇదే స‌మావేశంలో మాతృభాష విశిష్ట‌త గురించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని హెచ్చ‌రించారు. ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని పిలుపునిచ్చారు. ఇంగ్లీషు మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ హిత‌వు ప‌లికారు.  

కేసీఆర్ మ‌దిలో బ్ర‌హ్మాస్త్రం!.. ద‌ళితుడిని సీఎం చేసే వ్యూహం!

అవును, మీరు చ‌దివింది త్వ‌ర‌లోనే నిజం కావొచ్చు. తెలంగాణ ముఖ్య‌మంత్రి పీఠంపై ద‌ళితుడిని కూర్చోబెట్టినా ఆశ్చ‌ర్యం లేదు..అంటున్నారు. సీఎం కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల గురించి బాగా తెలిసిన వారెవ‌రూ ఈ న్యూస్ విని అవాక్క‌వ‌రు. తెలంగాణ చాణ‌క్యుడి వ్యూహాలు అలానే ఉంటాయి మ‌రి. ఇప్పుడు ఆ ప‌ని చేయ‌డం అత్యంత అవ‌స‌రం కూడా మ‌రి. సీఎం కేసీఆర్‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉప్పెన‌లా ఎగుస్తోంది. ద‌ళిత బంధుతో కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంచేందుకు సిద్ధ‌మైనా ఆయ‌న్ను ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు. కేసీఆర్ నిజంగా ఇస్తారా? అంద‌రికీ ఇస్తారా? హుజురాబాద్ ఎన్నిక‌లు ముగియ‌గానే బంధును బొంద‌పెట్టేస్తారా? ఇలా అనేక అనుమానాలు. అందుకు కార‌ణ‌మూ ఆయ‌నే. గ‌తంలో ద‌ళిత ముఖ్య‌మంత్రి, మూడెక‌రాల భూమి ఇలా ద‌ళితుల‌ను నిలువునా ద‌గా చేసిన ఘ‌న చ‌రిత్ర. అందుకే, ద‌ళితుల కోసం ర‌క్తం ధార‌బోస్తానంటున్నా కేసీఆర్‌ను ద‌ళితుల‌తో స‌హా ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు..అంటున్నారు.  మ‌రి ఎలా? తాను ద‌ళిత ప‌క్ష‌పాతిన‌ని నిరూపించుకునేదెలా? 10 ల‌క్షలు ఇస్తానంటున్నా న‌మ్మట్లేదంటే ఇంకెలా? ఇలా ఆలోచిస్తున్న కేసీఆర్‌కు అద్భుత‌మైన ఆలోచ‌న వ‌చ్చిందట‌. త‌న‌పై వినిపిస్తున్న విమ‌ర్శ‌లు.. త‌న‌ను అనుమానిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు.. తిరుగులేని, ఎదురులేని.. బ్ర‌హ్మాస్త్రం లాంటి ఆలోచ‌న‌ ఆయ‌న మ‌దికి త‌ట్టింద‌ట‌. ఆ ఆయుధాన్ని ప్ర‌యోగించేందుకు త‌న కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.  కేసీఆర్ మ‌దికి తట్టిన ఆ బ్ర‌హ్మాస్త్రంలాంటి ఆలోచ‌న‌.. ద‌ళిత ముఖ్య‌మంత్రి. అవును, సీఎం సీటు నుంచి తాను వైదొలిగి.. త‌న స్థానంలో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ద‌ళితుడిని సీఎం చేస్తే.. ఇక త‌న‌పై ఉన్న ముఖ్య‌మైన‌ మ‌చ్చ‌ చెరిగిపోతుంది. ఈ రెండున్న‌రేళ్లు ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చొబెట్టి.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు క‌డిగిన ముత్యంలా తాను మ‌రోసారి బ‌రిలో నిలవొచ్చ‌నేది ఆయ‌న ఆలోచ‌న‌తో కూడిన ఎత్తుగ‌డ వ్యూహం!  అయ్యో.. ముఖ్య‌మంత్రి పీఠం పోతే ఎలా? ప‌వ‌ర్ లేకుండా పెద్దాయ‌న ప్ర‌శాంతంగా ఉండ‌గ‌ల‌రా? అనే డౌట‌నుమానం అస్స‌లే అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. గ‌త యూపీఏ హ‌యాంలో ప్ర‌ధాని సీట్లో మ‌న్మోహ‌న్‌సింగ్ కూర్చున్నా.. ప‌వ‌ర్ అంతా యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ చేతిలోనే ఉన్న‌ట్టు.. ఆ ఫార్ములాను తెలంగాణ‌లోనూ ఈజీగా అప్లై చేసేయొచ్చ‌నేది ఆయ‌న ఐడియా. అలా అయితే ద‌ళితుడిని సీఎం చేసిన‌ట్టు ఉంటుంది.. అస‌లు ప‌వ‌ర్ ప‌దిలంగా త‌న ద‌గ్గ‌రే ఉంటుంది. త‌న‌పై ప‌డిన మ‌ర‌క వ‌దిలిపోతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఉన్న అసూయ తొల‌గిపోతుంది. తాను ఎంచ‌క్కా ఫాంహౌజ్‌లోనే ఉంటూ రాష్ట్రాన్ని ప‌రోక్షంగా పాలించొచ్చు. బ్ర‌హ్మాస్త్రంలాంటి ఈ ఆలోచ‌న కేసీఆర్‌కు బ్ర‌హ్మాండంగా న‌చ్చేసింద‌ని.. ఇదే విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి.. వారిని ఒప్పించే పనిలో ఉన్నార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. డ‌మ్మీ సీఎం అయ్యే ఆ ద‌ళిత అదృష్ట‌వంతుడు ఎవ‌ర‌వుతారో...?

జేబుల్లో తీసుకెళ్లేలా టీన్లలో బీరు.. తాగండి-ఊగండిలా ఏపీ మద్య విధానం!

మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది వైసీపీ నినాదం. జగన్మోహన్ రెడ్డి నినాదం.. ఇది చెబుతూనే 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు జగన్ సహా వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చాకా మాత్రం ఆ సంగతే మరిచిపోయారు. మాట తప్పడం.. మడమ తిప్పడమే జగన్మోహన్ రెడ్డి సిద్దాంతంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలన్నింటికి ఒక్కొక్కటిగా తూట్లు పొడుతుస్తున్నారు వైసీపీ అధినేత. మద్యపాన నిషేదం విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  రాష్ట్రంలోని పేద కుటుంబాల‌కు శాపంగా మారిన మ‌ద్యం అమ్మ‌కాల‌ను మేం అధికారంలోకి రాగానే విడ‌త‌ల వారీగా నియంత్రిస్తామని గతంలో జగన్ చెప్పారు. మ‌ద్యం ధ‌ర‌లు ముట్టుకుంటే.. షాక్ కొట్టే క‌రెంటు మాదిరిగా పెంచేస్తామన్నారు.  దీంతో సామాన్యుడు మ‌ద్యం జోలికిపోవాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకువ‌స్తామని ఎన్నిక‌ల‌కు ముందు ఊదరగొట్టారు జగన్ రెడ్డి. ఇప్పుడు మాత్రం ఆయ‌న వ్య‌వ‌హారం.. `ఇంకా తాగండి.. ఇంకా ఇంకా తాగండి`-అన్న‌ట్టుగానే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాది మ‌ద్యం దుకాణాల‌ను ప్ర‌భుత్వ ప‌రం చేసి.. కొన్ని దుకాణాలు త‌గ్గించారు. అయితే.. సంక్షేమ పేరిట ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతుండ‌డంతో ఆదాయం లేక ఖ‌జానా ఖాళీ అయింది. దీంతో మ‌ద్య‌మే ప్ర‌భుత్వాని ప్ర‌ధాన ఆదాయంగా మారిపోయింది. దీంతో వివిధ రూపాల్లో  మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తులు ఇస్తున్నారు. ఇప్ప‌టికే.. ప‌ర్యాట‌కం పేరిట మాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో.. కూడా మాల్స్ పేరిట ఏసీ.. దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి చాల‌వ‌న్న‌ట్టుగా.. ఇకపై క్యాన్‌ బీర్లు, 90 ఎంఎల్‌ బుడ్డీలలో మద్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  జగన్ రెడ్డి సర్కార్ కొత్త విధానం ప్రకారం ఇకపై బీర్లు టిన్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. 650 ఎంఎల్‌, 350 ఎంఎల్‌ సీసాల్లో బీరు దొరుకుతోంది. తాజా నిర్ణయంతో జేబులో పట్టే టిన్లలో బీర్లు రానున్నాయి.  330 ఎంఎల్‌, 500 ఎంఎల్‌… ఇలా రెండు రకాల క్యాన్లలో బీరును అందుబాటులోకి తెస్తున్నారు. సీసాల్లో ఉన్న బీరును కొని బయట తాగడమే కష్టం. బరువుగా, పొడవాటి సీసాలను తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది. టిన్‌ బీర్లు అలా కాదు. చేతిలో ఇమిడిపోతాయి. స్టైల్‌గా ఉంటాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లి, అంతే సులువుగా తాగేయవచ్చు. దీంతో ప్రయాణాల్లోనూ వీటితో బీర్లు లాగించవచ్చు. మద్యం అమ్మకాలు పెంచుకోవాడనికే ఇలా అమలు చేస్తున్నారనే అభిప్రాయం జనాల నుంచి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్ బీర్తో పాటు 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ అనుమతిచ్చింది.  అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ పేర్కొంది. ప్రస్తుతం ఒక క్వార్టర్‌… అంటే 180 ఎంఎల్‌ సీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 90ఎంఎల్‌ సీసాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఒక క్వార్టర్‌ సీసా కొనాలంటే వినియోగదారుడు కనీసం రూ.200 పెట్టాల్సి వస్తోంది. దీంతో తక్కువ రేట్లకు వస్తున్నాయని పక్క రాష్ట్రం మద్యం, నాటుసారాకు మొగ్గుచూపుతున్నారని… అందుకే, సుమారు రూ.వందకే దొరికేలా ఇక్కడే 90ఎంఎల్‌ సీసాలు తెస్తే అక్రమ మద్యం తగ్గిపోతుందని అధికారులు వాదిస్తున్నారు. ఇదంతా కూడా త‌మ వాగ్దానం మేర‌కు మద్యం వినియోగం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అసలు సంగతి మాత్రం ప‌రోక్షంగా మ‌ద్యం వినియోగాన్ని, అమ్మ‌కాలను పెంచుకోవడమే జగన్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. 

ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్! భారత్ సిరీస్ తీసుకొచ్చిన కేంద్రం

ఒకే దేశం ఒకే రేషన్, ఒకే దేశం ఒకే పన్ను ఇవి కేంద్ర సర్కార్ అవలంభిస్తున్న విధానాలు. ఇదే బాటలోనే మోడీ సర్కార్ కొత్తగా మరో పాలసీ తీసుకొచ్చింది. ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర రోడ్డు రవాణా-హైవేల మంత్రిత్వ శాఖ కొత్త రిజిస్ట్రేషన్ పాలసీని ప్రకటించింది. ఇందుకోసం కొత్తగా భారత్ సిరీస్ BH)ను తీసుకొచ్చింది.  దీని ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా-హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది.   ఇప్పటివరకు దేశంలో ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం మరో రాష్ట్రంలో 12 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక వేళ ఉండాల్సి వస్తే ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. అయితే కొత్తగా తీసుకొస్తున్న భారత్ సిరీస్ తో అలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి. భారత్ (BH) సిరీస్ లో రిజిస్టర్ చేసుకుంటే… దేశంలో ఎక్కడైనా వెహికిల్ ఉండొచ్చు.అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. రక్షణ శాఖలోని వివిధ డిపార్ట్ మెంట్స్ లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ చోట్ల ఆఫీస్ లు ఉన్న ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే ‘బీహెచ్’ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించనుంది. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే బీహెచ్ రిజిస్ట్రేషన్ ను చేసుకోవచ్చు.  రోడ్డు పన్నును మొదట రెండేళ్లకే కట్టొచ్చని లేదంటే వాహన గరిష్ట జీవితకాలమైన 15 ఏళ్లకుగానూ రెండేళ్ల చొప్పున మొత్తం ఒకేసారి చెల్లించే వెసులు బాటు ఇందులో ఉండనుంది. ఈ కొత్త విధానంతో ఉద్యోగ, వ్యాపార కారణాలతో వేరే రాష్ట్రానికి మారాల్సి వచ్చిన వారికి ఊరట లభించనున్నది. 

4వేల కోట్ల కుంభకోణం!.. కొడాలి నానిపై ఆరోప‌ణ‌లు.. జ‌గ‌న్ వాటా ఎంతంటే..!

ఏపీ మంత్రి కొడాలి నానిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు. ఏకంగా 4వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ విమ‌ర్శ‌లు. పేద‌ల క‌డుపు కొట్టి.. ప్ర‌భుత్వ ఖ‌జానాను కొల్ల‌గొట్టి.. వేల కోట్లు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ‌లు. ఇందులో సీఎం జ‌గ‌న్‌కూ భారీగానే ముడుపులు అందుతున్నాయ‌నే అనుమానాలు. ఇలా ఏపీలో 4వేల కోట్ల బియ్యం కుంభ‌కోణం జ‌రిగిందంటూ.. అయినా ద‌ర్యాప్తు జ‌ర‌గ‌డం లేదంటూ.. టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు ఎంఎస్ రాజు వైసీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి. సీఎం జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యం ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకిచ్చే బియ్యం నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు కాసులు పిండుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆ బియ్యంస్కాం ఎలా జ‌రుగుతోందో స‌వివ‌రంగా విడ‌మ‌రిచి చెప్పారు టీడీపీ నేత‌ ఎంఎస్ రాజు.  రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సి ఉంటుంది. కానీ, మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్‌రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని 4 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయమని మండిప‌డ్డారు ఎంఎస్‌ రాజు.  మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలోనే ఈ దారునం బయటపడిందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇందులో జగన్ వాటా ఎంతో బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్ చేశారు.  ధరల స్థిరీకరణ నిధి నుంచి 3 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ రూ.40కి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని రాజు డిమాండ్ చేశారు.   

జగన్ ను ఎదుర్కొనే బెస్ట్ ఆప్షన్ కిరణేనా? పీకే డెరైక్షన్ లో కాంగ్రెస్ బలపడేనా? 

ఏపీలో పాత పేర్లు కొత్తగా తెరమీదికొస్తున్నాయి. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని కలలు కన్న జగన్ ను ఇంటిదారి పట్టించేందుకు కాంగ్రెస్ అనూహ్యమైన ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఉమ్మడి ఏపీ ఆఖరు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. హైకమాండ్ అడ్డు చెప్పింది. అయినా.. జగన్ ప్రజల్లోకి వెళ్లారు. అప్పటికే జగన్ మనసులోని మర్మాన్ని అర్దం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.... ఢిల్లీకి పూర్తిగా విధేయుడైన కిరణ్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది. జగన్ ను ఓ చూపు చూడాలని పురమాయించింది. ఆ పాత రికార్డే ఇప్పుడు కిరణ్ కు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  జగన్ పార్టీని చీలుస్తారనే భయంతో రాయలసీమకే చెందిన కిరణ్ ను అప్పట్లో అధిష్టానం బాగా వాడుకుంది. కిరణ్ ను సీఎం చేసి జగన్ బాబాయ్ వివేకాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో.. తమ కుటుంబంలోనే విభేదాలు తీసుకురావటం జగన్ కు నచ్చలేదు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీగా జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసి గెలిచారు. ఆ టైంలో సీఎంగా ఉన్న కిరణ్ తో ఎలాగైనా జగన్ ను కంట్రోల్ చేయాలని.. పార్టీకి నష్టం జరగకుండా చూడాలని హైకమాండ్ ఆదేశించింది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో కిరణ్ అన్ని పావులూ సక్సెస్ ఫుల్ గా వాడేశారు. కిరణ్ హయాంలోనే జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ మొదలైంది. జగన్ అరెస్టు కూడా జరిగింది. అందువల్లే జగన్ పెట్టిన పార్టీకి భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ సహా.. కిరణ్ సైతం భావించారు. అయితే అనూహ్యంగా విజయమ్మ, షర్మిల కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ కూడా నిర్ణయించిన విషయం గమనించాలి. కిరణ్ సర్కారు గట్టెక్కి... బలం నిరూపించుకున్నాక 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పొందడం వేరే విషయం. హైకమాండ్ ఆదేశాలను అడుగడుగునా తు.చ. తప్పకుండా అమలు చేసిన వ్యక్తిగా కిరణ్ ఢిల్లీలో గుడ్ బుక్స్ లో ఉన్నారు.   రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-పవన్-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ను వీడిన కిరణ్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో తాజా రాజకీయాలపై, సామాజికవర్గాల సమీకరణలపై కూలంకషంగా చర్చించారు. జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంకును వెనక్కి రప్పించే అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కిరణ్ రాహుల్ కు ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లినవారిని తిరిగి తీసుకొస్తానంటూ కిరణ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ వైఫల్యాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువ ఉన్నాయని, తనకున్న క్లీన్ ఇమేజ్ తో పాత కేడర్ ను కచ్చితంగా పార్టీవైపు మళ్లిస్తానని కిరణ్ హామీ ఇచ్చినట్టు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి.  తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలో కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాంటి క్వాలిటీస్ గానీ, ఇమేజ్ గానీ కిరణ్ కే ఉన్నాయని హైకమాడ్ డిసైడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ పేరు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా ఉన్న కిరణ్ కు.... జగన్ కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉందని, జగన్ లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా సరైన నిర్ణయాలు తీసుకోగలడని అంటున్నారు. నాడు పరిటాల రవి హత్య కేసులో జగన్ మీద టీడీపీ నేతలు పెద్దఎత్తులో విమర్శలు చేసినప్పుడు... జగన్ ను వెనకేసుకొచ్చింది కిరణే కావడం విశేషం. ఇలా కీలకమైన అన్ని అంశాల్లోనూ జగన్ లోతులు తెలిసిన వ్యక్తి కిరణేనని అధిష్టానం భావిస్తోంది. ఆ నమ్మకంతోనే కిరణ్ ను కీలకమైన పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్టు చెబుతున్నారు.