మల్లన్న మాటల్లో తప్పేముంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్
posted on Aug 27, 2021 @ 3:15PM
ఈటల రాజేందర్ రాజీనామా, తర్వాత పరిణామాలపై ఎక్కడా మాట్లాడలేదు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఉప ఎన్నికపైనా స్పందించలేదు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దళిత దండోరా సభలలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా కౌంటర్ ఇవ్వలేదు కేటీఆర్. కాని సడెన్ గా రూట్ మార్చారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారు కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని కేటీఆర్ అన్నారు. చెంపమీద కొడతా అన్నందుకే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిందని చెప్పారు. కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా జర్నలిజం ముసుగులో కేసీఆర్ ను ఇష్టమోచ్చినట్లు తిడుతున్నారంటూ పరోక్షంగా తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చేశారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని. ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కేటీఆర్. మంత్రి మల్లారెడ్డి కి జోష్ ఎక్కువ.. ఓ మాట అన్నారు తప్పేముంది అంటూ వెనకేసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేంటిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముందు మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి గజ్వేల్ సభ గురించి మాట్లాడితే మంచిదన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు కొడంగల్ నుంచి తరిమితే.. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు మల్కాజిగిరి లో గెలిచాడని చెప్పారు. కాంగ్రెస్ కు దిక్కు లేక చంద్రబాబు ఏజెంట్ ను పీసీసీ చీఫ్ గా చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చంద్రబాబు మాటలు నమ్మి ఓటుకు నోటు దొంగ ను కాంగ్రెస్ నేతలు పీసీసీ చేశారని చెప్పారు. టీ కాంగ్రెస్ ను చంద్రబాబు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నడని కేటీఆర్ అన్నారు. చిలక మనదే అయినా మాట్లాడిస్తున్నది చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు కేటీఆర్. ఇంకా ఏవైనా భూములు ఉంటే అమ్మడానికి చూస్తున్నారా అని సెటైర్ వేశారు. మేక్ ఇన్ ఇండియా అని సేల్ ఇండియా చేస్తున్నారని విమర్శించారు. మోడీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వీటి గురించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్రశ్నించారు. పాదయాత్రలో కేసీఆర్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు గురించి తెలుసుకుని.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెప్పాలని సంజయ్ కు సలహా ఇచ్చారు కేటీఆర్.