తీన్మార్ మల్లన్న కేసులో సంచలనం.. డీజీపీకి ఢిల్లీ నుంచి సమన్లు!
posted on Aug 27, 2021 @ 5:13PM
కేసీఆర్ సర్కారు మెయిన్ టార్గెట్స్ ముగ్గురే ముగ్గురు. ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్-రేవంత్‌రెడ్డి. సెంకడ్ టార్గెట్ బీజేపీ-ఈటల. థర్డ్ టార్గెట్ క్యూన్యూస్- తీన్మార్ మల్లన్న. కేసీఆర్ లాంటి నేతకే ఇంత పెద్ద టార్గెట్ అయ్యారంటే తీన్మార్ మల్లన్న- క్యూ న్యూస్ ఆయన్ను ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఛాన్స్ దొరికితే మల్లన్నను, ఆయన యూట్యూబ్ ఛానెల్‌ను మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని అంటారు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో క్యూ న్యూస్ ఆఫీసుపై పోలీసులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లకు పదే పదే రప్పించారు. తాజాగా, టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కంప్లైంట్‌తో మరోసారి మల్లన్నపై అటాక్ చేశారు కాప్స్. క్యూ న్యూస్ ఆఫీసుతో పాటు, తీన్మార్ మల్లన్న ఇంటిపై కూడా దాడి చేసి సోదాలు చేశారు. వరుస దాడులతో విసిగిపోయిన మల్లన్న.. ఇప్పుడు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ వేయగా.. లేటెస్ట్‌గా జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
తనపై వరుస కేసులను నమోదు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆరోపిస్తున్నారు చింతపండు నవీన్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఈ మేరకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లకు సమన్లు పంపారు. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 29 ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మల్లన్నను తెలంగాణ పోలీసులు అనవసర వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు అందిందని.. దీనిపై వివరణ ఇవ్వాలని.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సమన్లలో కోరినట్లు తల్లోజు ఆచారి తెలిపారు. కమిషన్‌లో విచారణ కోసం డీజీపీ, సీపీలు స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదికను ఈమెయిల్లో సమర్పించాలని ఆదేశించారు. సంబంధిత ఫైల్స్, కేస్ డైరీ మొదలైన డాక్యుమెంట్లతో పాటు తాజా నివేదికతో రావాలని ఆచారి కోరినట్టు సమాచారం.
ఒకవేళ డీజీపీ పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరు కాకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బి నిబంధన (8) ప్రకారం సివిల్ కోర్టు ఇచ్చిన అధికారాలను కమిషన్ ఉపయోగించవచ్చని.. హాజరు కోసం సమన్లు జారీ చేయవచ్చనని ఆచారి హెచ్చరించారు. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరు కావాలని స్పష్టం చేశారని అంటున్నారు.
బీసీ కమిషన్ జోక్యంతో తీన్మార్ మల్లన్నకు జాతీయ స్థాయిలో మద్దతు లభించినట్టు అయింది. తనపై పోలీసులను ఉసిగొల్పి భయపెట్టాలని చూస్తున్న కేసీఆర్ సర్కారు బెదిరింపులకు బెదిరేది లేదన్నారు తీన్మార్ మల్లన్న. ఎలాంటి కుట్రలనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని.. గోడకు కొట్టిన బంతిలా ఎదురుదాడి చేస్తానంటూ సవాల్ విసురుతున్నారు చింతపండు నవీన్.