బిగ్ బ్రేకింగ్.. అర్థరాత్రి తీన్మార్ మల్లన్న అరెస్ట్.. ప్రశ్నిస్తే మూసేస్తారా?
posted on Aug 27, 2021 @ 11:54PM
బిగ్ బ్రేకింగ్ న్యూస్. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం బెదిరిస్తున్నారని మల్లన్నపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
గురువారం క్యూ న్యూస్ ఆఫీసు, మల్లన్న ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు. పలు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శుక్రవారం అర్థరాత్రి మల్లన్నను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు పోలీసులు.
తీన్మార్ మల్లన్న అరెస్ట్‌పై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. క్యూ న్యూస్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఆయన్ను అరెస్ట్ చేశారంటూ విమర్శిస్తున్నారు. మీడియాకు సంకెళ్లు వేయడం సరికాదంటూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.
తీన్మార్ మల్లన్నపై రివేంజ్ తీర్చుకోవాలని కేసీఆర్ సర్కారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ యువతి ఫిర్యాదు మేరకు క్యూ న్యూస్‌పై దాడి చేసి నానా హంగామా సృష్టించారు పోలీసులు. తాజాగా ఓ వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో మల్లన్నను అరెస్ట్ చేయడం కక్ష్య సాధింపు చర్యనే అంటున్నారు.
తనపై నమోదవుతున్న వరుస పోలీస్ కేసులపై ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు చింతపండు నవీన్. జాతీయ బీసీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి,, పోలీసుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. క్యూ న్యూస్‌లో సర్కారుపై విమర్శలు మాత్రం ఆపలేదు మల్లన్న. ధైర్యంగా ప్రభుత్వ దుర్నీతిని నిత్యం ఎండగడుతూనే ఉన్నారు. అందుకు ప్రతీకారంగానే అన్నట్టు.. తీన్మార్ మల్లన్నను ఓ కేసులో అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దొంగల్లా అర్థరాత్రి మల్లన్నను అరెస్టు చేయడంపై ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు మండిపడుతున్నారు. సర్కారు కక్ష్యసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.