వైఎస్ ఫ్యామిలీలో జగన్ రెడ్డి ఏక్ నిరంజన్?
సెప్టెంబర్ 2 దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన వైఎస్సార్, 2009 సెప్టెంబర్ 2 న హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు. అంటే ఆయన చనిపోయి పుష్కర కాలం పూర్తయింది. ఈ 12 ఏళ్ల కాలంలో రాష్ట్ర రాజకీయాలోనే కాదు, దేశ రాజకీయాలలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రాజకీయ స్థితిగతులు మారిపోయాయి.ఈ మార్పులు చేర్పులలో వైఎస్సార్ ఫ్యామిలీ రాజకీయంగా, ఇతరత్రా అనేక సమస్యలు ఎదుర్కుంది. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా వైఎస్ కుటుంబం మొత్తం ఒకటిగానే ఉంది. కష్ట నష్టాలను ఉమ్మడిగానే అనుభవించింది.
వైఎస్ కుమారడు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు, సిబిఐ విచారణ కార్యాలయం (దిల్ కుష్ గెస్ట్ హౌస్) వద్ద జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల,భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఫుట్ పాత్ మీద కూర్చుని అర్థరాత్రి వరకు ధర్నా చేసిన దృశ్యాలు ఇంకా కాళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ కూడా చేశారు. అయినా లోటస్ పాండ్ వద్ద ధర్నాను కొనసాగించి, వైఎస్ కుటుంబం అంతా ఒకటిగా పోరాటం కొనసాగించింది. ఇక జగన్ రెడ్డి అరెస్ట్ కారణంగా ఆగిపోయిన పాదయాత్రను, అన్న వదిలిన బాణం నేనేంటూ షర్మిల కొనసాగించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి కుటుంబ రాజకీయ వారసత్వాన్ని సజీవంగా ఉంచడమే కాకుండా, అన్న జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేశారు.
అలాంటిది ఇప్పుడు వైఎస్ ఫామిలీ రెండుగా చీలిపోయిందా అంటే అవుననే అనవలసి వస్తోంది. కుటుంబాన్ని నిచ్చెనగా చేసుకుని, ముఖ్యమంత్రి పీఠమెక్కి కూర్చున్న జగన్ రెడ్డి, మెల్ల మెల్లగా తల్లీ చెల్లిని దూరం పెడుతూ వచ్చారు. ఆస్తుల తగువులో, రాజకీయ విభేదాలు, వివాదాలు. కారణం ఏదైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అటు తల్లితోనూ,ఇటు చేల్లితోనూ కూడా దూరం పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వైఎస్ ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి మధ్య అగాధం ఏర్పడింది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో, ఎవరు, ఎందుకు చేయించారో గానీ, ఆ ఉదంతంతో వివేకా కుటుంబానికి జగన్ రెడ్డి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ‘ఆ ఇద్దరే’ హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక జగన్ సోదరి షర్మిల పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారు. తెలంగాణ కోడలినంటూ తెలంగాణలో వైఎస్సార్ టీపీ పేరిట సొంత రాజకీయ వేదిక ఏర్పరచుకున్నారు. ‘రాజన్న రాజ్యం’ నినాదంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో రాజీలేని పోరాటమ చేస్తామని ప్రకటించుకున్నారు. షర్మిల రాజకీయలను కాసేపు పక్కన పెడితే వైఎస్ కుటుంబ కలహాలు రోజురోజుకు మరింతగా ముదురు పాకాన పడుతున్నాయి. జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఆనవాయితీకి భిన్నంగా, అమ్మా, కొడుకు, అక్కా,చెల్లి ఎవరికి వారుగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఒకరికి ఒకరు తారసపడకుండా చాలా జగ్రత్తగా టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇలా కన్న తండ్రికి నివాళులు అర్పించడంలోనూ ఎవరిదారి వారిది అన్నట్లుగా వ్యవహరించారు. ఇది ఇద్దరి మధ్య తగవు ఎంత దూరం వెళ్లిందో చెప్పకనే చెప్పింది. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా వైరం ఎందుకు పెరిగింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని చిక్కు ప్రశ్నగానే మిగిలింది.
సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇటుపుల పాయలో అదే సీన్ రిపీట్ అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. వైఎస్ సతీమణి విజయమ్మ, ఇన్నేళ్ళలో తొలిసారిగా, హైదరాబాద్ (నోవాటెల్ హోటల్) లో వైఎస్ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. అంతే కాదు, కాంగ్రెస్’లో మిగిలిన వైఎస్ మంత్రి వర్గ సహచరులు, అనుచరులతో పాటుగా తెరాస, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన వైఎస్ సహచర,మిత్రులు అందరినీ, వర్దంది సభకు రండని స్వయంగా ఆహ్వానించారు. అయితే, ఈ సభకు ఎవరొస్తారు, ఎవరురారు అనే విషయాన్ని పక్కన పెడితే,వర్ధంతి సభ ఉద్దేశం ఏమిటి, ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు,ప్రస్తుతానికి వెయ్యి డాలర్ల ప్రశ్న.
అయితే వర్ధంతి సభ ద్వారా జగన్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా, షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గం సుగమమం చేసేందుకే విజయమ్మ సభను ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించి,వైసీపీ సంబంధాలను తెన్చుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో కొందరు పరిశీలకులు ఆమె అడుగులు మళ్ళీ కాంగ్రెస్ వైపు పడుతున్నాయా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డితో దూరం పెరగడంతో పాటుగా షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఎదురవుతున్న వడిదుడుకులకు సమాధానంగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్డమయ్యారనే సందేహాలు వ్యక్తమమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా విజయమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ జరగవచ్చని, అందుకు అటు నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ఫామిలీలో జగన్ రెడ్డి ఒంటరి అయ్యారనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.