జగన్ సర్కారుపై పెట్రోల్ బాంబ్.. మహాధర్నాతో ప్రజాగ్రహం..
posted on Aug 28, 2021 @ 12:32PM
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీనేనని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే లీటర్‌కు 30 రూపాయలు ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడ ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే పెట్రోల్ ధర సెంచరీ దాటిందని బొండా ఉమ, గద్దె రామ్మోహన్ తదితరులు విమర్శించారు. జగన్ సర్కారు పన్నులు, రోడ్డు సెస్సులు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు పెట్రోల్ పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీకి పిలుపిచ్చిన బీటెక్ రవిని పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు కోటబొమ్మాళి రైతు బజార్ వరకు కాలి నడకన ర్యాలీ నిర్వహించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో క్లాక్ టవర్ దగ్గర టీడీపీ నాయకులు ధర్నా చేశారు. నరసరావుపేటలో ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ముందు పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.