దొంగ మల్లారెడ్డి.. బండారం బయటపెట్టిన రేవంత్‌రెడ్డి..
posted on Aug 27, 2021 @ 5:42PM
మంత్రి మల్లారెడ్డి నోటికొచ్చినట్టు తిట్టారు. ఆ మర్నాడే మల్లారెడ్డిని కాంగ్రెస్‌వాదులు, రేవంత్ అభిమానులు కుమ్మేశారు. సోషల్ మీడియాలో చీల్చిచెండాడారు. తాజాగా, రేవంత్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. అంతా అటెన్షన్. తనను తిట్టిన మల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి కూడా తిట్లతో చెలరేగిపోతారని అంతా అనుకున్నారు. రేవంత్ ఏమంటారా.. అని అంతా చెవులు రిక్కరించి విన్నారు. మల్లారెడ్డి మాటలకు మా కాంగ్రెస్ నేతలు బదులిచ్చేశారుగా అంటూ సింపుల్‌గా చెప్పేశారు. కావాలనే అసలు విషయం పక్కదారి పట్టించడానికే.. ఇలా తిట్లదండకం అందుకున్నారని ఆ ట్రాప్‌లో తాను పడబోనంటూ తేల్చేశారు. మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలకు ఆధారాలు ఇవిగో అంటూ అసలు మేటర్‌లోకి వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. తిట్లకు తిట్లతోనే బదులివ్వకుండా పరిణతి కలిగిన నాయకుడిగా రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరును అంతా అభినందిస్తున్నారు. రేవంత్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇక, మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై ఆధారాలతో సహా ఏకరువు పెట్టారు పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ చుట్టు పక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్‌డీడ్ చేయాల్సిందేనని.. కానీ, 16 ఎకరాలకు మల్లారెడ్డి బావమరిది ఎలా యజమాని అయ్యారో వివరాలు లేవన్నారు. ఆ భూముల గిఫ్ట్ డీడ్ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని ఆరోపించారు.
‘‘గుండ్ల పోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబరులో ఉన్న భూమి 22 ఎకరాల 20గుంటలు. తాజాగా ధరణి వివరాల ప్రకారం.. 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇది ఏమైనా కేసీఆర్ నాటి మొక్క పెరిగి పెద్దది అవడానికి? ఇందులో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ పేరు మీద ఉంది. ఈ భూమిలోనే మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపై గిఫ్ట్ డీడ్ పెట్టి, యూనివర్సిటీ అనుమతి తీసుకున్నారు. 2004లో ఇదే భూమిని గ్రామ పంచాయతీ లేఅవుట్‌లుగా అమ్మారు. ఆ తర్వాత మళ్లీ హెచ్‌ఎండీఏ పేరుతో ఇదే భూమిని లేఅవుట్‌లు వేసి విక్రయించారు. 650 సర్వే నెంబర్‌లో లేఔట్‌లు చేసి, రెండుసార్లు ప్లాట్లు అమ్మారు. అమాయక ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత 22 ఎకరాలు కాస్తా.. 33 ఎకరాలు ఎలా అయింది? అందులో 16 ఎకరాలు శ్రీనివాస్‌రెడ్డికి ఎలా వచ్చింది? మీ మంత్రి వర్గంలో నీతి, నిజాయతీ కలిగిన వాళ్లుగా చెబుతున్న వీరు ఈ అక్రమాలు ఎలా చేశారో చెప్పాలి. అంతేకాదు, జవహర్‌నగర్‌లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ నిషేధించిన తర్వాత ఎలా భూమి బదిలీ అయ్యింది? గజ దొంగలను పక్కన పెట్టుకుని... కేటీఆర్ నీతులు చెబుతున్నారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌లో వందల కోట్ల దుర్వినియోగం చేసిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక బయట పెట్టాలి. మల్లారెడ్డి విద్యా సంస్థలు... ఫోర్జరీ సర్టిఫికెట్‌లు పెట్టిన దొంగ మల్లారెడ్డి’’ అంటూ ఘాటుగా విమర్శించారు రేవంత్‌రెడ్డి. తాను బయటపెట్టిన ఆధారాల ఆధారంగా మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.