ఏపీలో అమ్మఒడి ఆగమాగం.. పట్టాభిపై దాడితో వైసీపీ డైవర్షన్ గేమ్..
posted on Nov 9, 2021 @ 1:20PM
వైయస్ జగన్ ప్రభుత్వం నిధుల లేమితో సతమతమవుతోంది. అప్పు కోసం కేంద్రం వద్దకు వెళ్లినా.. ఆర్బీఐ వద్దకు వెళ్లిన అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నవరత్నాలాంటి పథకాలకు పుల్‌స్టాప్ పెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో మొదట అమ్మఒడికి ముఖ్యమంత్రి జగన్ చెక్ పెడదామనుకున్నారని.. అందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి అయిందని సమాచారం.
ఇప్పటికే ఈ పథకం కింద జగన్ ప్రభుత్వం రెండు విడతలుగా నిధులు విడుదల చేసింది. ముచ్చటగా మూడో విడత నిధులు విడుదలకు వచ్చే సరికి జగన్ ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఏర్పడింది. ఆ క్రమంలోనే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి నగదు.... జూన్‌లో ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మార్చి, ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. దాంతో జూన్‌లో నగదు ఎవరికి ఇస్తారని జగన్ ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అమ్మఒడికి నామం పెట్టే క్రమంలోనే ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఇటీవల అమ్మఒడి నగదు అందుకోవాలంటే .. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అమ్మ ఒడికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో విద్యార్థులు బయోమెట్రిక్ విధానంలోకి రావాలంటే.. చాలా సమయం పడుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పథకానికి గండి కట్టే క్రమంలోనే ఇలాంటివన్నీ తెరపైకీ తీసుకు వస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు.
ఇంకో వైపు అమ్మఒడికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక జగన్ ప్రభుత్వం అమ్మఒడిని అపేస్తుందంటూ బ్యానర్ ఐటమ్‌ను ప్రచురితం కావడంతో వైయస్ జగన్ ప్రభుత్వం ‘యుద్ధ’ ప్రాతిపదికన అప్రమత్తమైంది.
జగన్ అధికారంలోకి వచ్చారంటే.. అందుకు నవరాత్నాలే కారణం.. అందునా అమ్మఒడి పథకం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్షన్ చేయడానికి అప్పటికప్పుడు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదిపింది. అయితే ఆదే రోజు సాయంత్రం టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి ప్రెస్ మీట్ పెట్టడం.. బోసడికే అనే పదాన్ని వాడడం.. ఆ తర్వాత అధికార పార్టీ కార్యకర్తలు .. పట్టాభిపై ఆయన నివాసంపై దాడి చేయడం.. టీడీపీ కార్యాలయాలపై దాడి.. అంతా కన్ను తెరిచి మూసే లోపు జరిగిపోయాయి. దీంతో జగన్ ప్రభుత్వం అమ్మఒడికి పుల్ స్టాప్ అంశం మురుగునపడిపోయింది. అధికార పార్టీ కదిపిన పావులకు.. అటు టీడీపీ చిత్తు చిత్తు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రభుత్వాన్ని నడిపించే ఇం‘ధనం’ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ వద్ద లేదని... ఈ నేపథ్యంలో నవరత్నాల్లోని అన్ని పథకాలు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయే పరిస్థితి ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఆ క్రమంలోనే తొలుత అమ్మఒడి ఉందని.. అందుకోసం ప్రజల మైండ్ సెట్‌ను జగన్ ప్రభుత్వం ట్యూన్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు