బిగ్ బ్రేకింగ్: టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా
posted on Nov 9, 2021 @ 4:02PM
అనుకున్నట్లే జరిగింది. రాజకీయ వర్గాలు అనుమానించినట్లే టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా పడింది. వరంగల్ శివారు దేవన్నపేటలో నవంబర 29న తలపెట్టిన విజయగర్జన సభకు వాయిదా వేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఉంది దీంతో ఎన్నికల కోడ్ కారణంగా విజయగర్జన సభకు వాయిదా వేశామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
విజయగర్జన సభే కాదు బుధవారం జరగాల్సిన కేసీఆర్ వరంగల్ నగర పర్యటన కూడా రద్దైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం కేసీఆర్ పర్యటన రద్దైందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.బుధవారం సీఎం పర్యటన కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి టీఆర్ఎస్ విజయగర్జన సభ మొదట నవంబర్15నే జరపాలని నిర్ణయించారు. తర్వాత దీక్షా దివస్ రోజున జరపాలని నిర్ణయించి నవంబర్ 29కి మార్చారు. అయితే సభ కోసం స్థలం దొరకకపోవడంతోనే 15 నుంచి 29కి మార్చారనే చర్చ వచ్చింది.
దేవనపేట సభకు స్థల సేకరణ కూడా అదికార పార్టీ నేతలకు తలనొప్పిగానే మారింది. టీఆర్ఎస్ సభ కోసం తమ భూములు ఇచ్చేది లేదని స్థానిక రైతులు తేల్చి చెప్పారు. సభ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన గులాబీ లీడర్లను అడ్డుకున్నారు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికి కూడా సభ కోసం స్థలాన్ని టీఆర్ఎస్ నేతలు సేకరించలేదని తెలుస్తోంది. ఇది కూడా విజయగర్జన సభ వాయిదా కారణం కావచ్చని భావిస్తున్నారు.