షర్మిలతో కోమటిరెడ్డి బ్రదర్ మీటింగ్.. ఏంటి సంగతి?
posted on Nov 9, 2021 @ 2:10PM
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా పేరున్న కోమటిరెడ్డి బ్రదర్ కలవడం సంచలనంగా మారింది. ప్రజా ప్రస్థానంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో షర్మిల నడుస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంతూరు బ్రహ్మణ వెల్లెంలకు ఆమె చేరుకోగానే ఆసక్తికర ఘటన జరిగింది.
తమ గ్రామానికి వచ్చిన షర్మిలను కలిశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు ను పరిశీలించాలని కోరారు. చాలా సేపు షర్మిలతో మాట్లాడారు మోహన్ రెడ్డి. అంతేకాదు బ్రహ్మణ వెల్లంలలో తన అనుచరులతో ఆయన షర్మిలకు మద్దతు తెలిపారు. మోహన్ రెడ్డి సూచనతో ఉదయ సముద్రం ప్రాజెక్టును పరిశీలించారు షర్మిల.
షర్మిలను కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కలవరం ఆసక్తిగా మారింది. గతంలో కొత్త పార్టీ పెట్టిన షర్మిలకు ఓపెన్ గానే ఆల్ ది బెస్ట్ చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. షర్మిల పార్టీని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి సహా కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నా.. వెంకట్ రెడ్డి ఆమెకు అభినందనలు చెప్పడం అప్పట్లో కాంగ్రెస్ లో కాక రేపింది. అంతేకాదు విజయమ్మ-షర్మిల కలిసి హైదరాబాద్ లో నిర్వహించిన వైఎస్సార్ ఆత్మీయ సమావేశానికి పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా హాజరయ్యారు వెంకట్ రెడ్డి. ఇక మునుగోడు నియోజకవర్గం పుల్లెంలో షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టగా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి ఆమెకు మద్దతు తెలిపారు. తమ నియోజకవర్గానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను కాదని షర్మిలకు వెంకట్ రెడ్డి అభినందనలు చెప్పడం.. రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలపగా.. తాజాగా కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న షర్మిల కలవరం రాజకీయంగా చర్చగా మారింది. తన సోదరుల డైరెక్షన్ లోనే మోహన్ రెడ్డి.. షర్మిలను కలిసి ఉండవచ్చని భావిస్తున్నారు. కొంత కాలంగా మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నల్గొండ జడ్పీ చైర్మెన్ పీఠం కోసం పోటీ పడ్డారు. తాజాగా షర్మిలను కలవడంతో మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాలో భాగంగానే ఇది జరిగిందని తెలుస్తోంది.