కొడాలి పెట్రో ఫైర్.. దొందు దొందేనన్న రేవంత్.. అనంత అలజడి.. టాప్‌న్యూస్ @1pm
posted on Nov 9, 2021 @ 11:51AM
1. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదే లేదని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ‘‘అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి’’ అని మంత్రి ప్రశ్నించారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్‌పోసి తగలబెట్టారని.. ఇలా ఓడిపోయింది కాబట్టే పెట్రో, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని కొడాలి నాని అన్నారు.
2. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ ధర్నాలు చేపట్టింది. తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్క రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పక్క రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో రేట్లు అధికంగా ఉండటంపై మండిపడుతున్నారు.
3. తెలంగాణను టీఆర్ఎస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని రేవంత్ చెప్పారు. ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.
4. ఏపీఈఆర్సీ చైర్మన్‌ను.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కలిసి విద్యుత్ కొనుగోళ్లపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆరా తీస్తున్నారు. సెకీ నుంచి యూనిట్ రూ.2.49లకు కొనుగోలు చేయడంపై వివరాలు సేకరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వివరణ అసమగ్రంగా ఉందని, ఏపీఈఆర్సీ అనుమతిపైనా సర్కార్ స్పష్టత లేదని, దీనిపై ఏపీఈఆర్సీ చైర్మన్‌కు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేయనున్నారు.
5. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం అనంతపురంలో పర్యటించనున్నారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి.. వారికి భరోసా కలిగించనున్నారు. లోకేష్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు పర్యటనలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తుగా కట్టడి చేస్తున్నారు.
6. ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో లాఠీ చార్జ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అనంత ఎస్పీ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
7. అనంతలో పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. ఆమె ఇంటి పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో స్పెషల్ పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. మరోవైపు, ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీ యాజమాన్యం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది.
8. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు చౌడపల్లికి చేరింది. అయితే, ప్రతీ మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహారదీక్షలో భాగంగా చౌడపల్లిలో దీక్షకు కూర్చున్నారు వైఎస్ షర్మిల.
9. గుంటూరు జిల్లాలోని దిశా పోలీసు స్టేషన్‌లో బాబు అనే నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ రేప్ కేసులో బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హజరుపరిచే సమయంలో బాబు బాత్ రూం క్లీనర్ తాగాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని జీజీహెచ్‌కు తరలించారు.
10. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. 4 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ముంబైకి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తుండగా సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అభిజిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.