మల్లన్న అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం! తీన్మార్ చరిత్ర ఏం చెబుతోంది?
posted on Nov 9, 2021 @ 11:45AM
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. తెలంగాణలో ఈ పేరు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని వెనుక ఎవరున్నారు..? ఏం చేశారు..? ఎంత నొక్కేశారు..? ఫుల్ డేటేల్స్ తో ప్రజల ముందు పేట్టేస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా వార్తలు రాయడానికి ప్రధాన మీడియా జంకుతున్న సమయంలో... ధైర్యంగా గులాబీ బాస్ ను టార్గెట్ చేశారు. గులాబీ లీడర్లను ముప్పుతిప్పలు పెట్టించి.. మూడు చెరువుల నీళ్లు తాగించాడు మల్లన్న. అందుకే ఆయన తెలంగాణ ప్రజలు గొంతుకగా మారిపోయారు.
తీన్మార్ మల్లన్న 1982, జనవరి 17న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎన్ టీవీ ద్వారా జర్నలిస్టుగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ కుమార్... తర్వాత కొంత కాలం ఐ న్యూస్ ఛానెల్స్ లో పని చేశారు. 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా స్క్రీన్ మీద కనిపించారు. ఆ ప్రోగ్రామ్ హిట్ కావడంతో ఆయన పేరు కూడా తీన్మార్ మల్లన్నగా మారిపోయింది. తర్వాత 10 టీవీలో కొంతకాలం పని చేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం క్యూ న్యూస్ ద్వారానే టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న.
ప్రజా సమస్యలపై పోరాడటంతో మొదటి నుంచి ముందున్న తీన్మార్ మల్లన్న.. రాజకీయంగా అడుగులు వేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. దాదాపు గెలిచినంత పని చేసిన తీన్మార్ మల్లన్న.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని ప్రకటించాడు. ఆ తర్వాతే కొత్త కథ మొదలైంది. తీన్మార్ మల్లన్న తనకు కంట్లో నలుసుగా మారారని భావించిన కారు పార్టీ.. అతన్ని టార్గెట్ చేసింది. అప్పుడే లక్ష్మికాంతశర్మ అనే జ్యోతిష్యుడి కేసు తెరపైకొచ్చింది. డబ్బుల కోసం బెదిరించాడంటూ మల్లన్నపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్న జైలులో ఉండగా ఒకదాని తర్వాత మరో కేసు తెరపైకి వచ్చాయి. మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన జైలులో ఉండగానే అతని అనుచరులు ప్రకటించారు.
73 రోజుల జైలు జీవితం తర్వాత బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఎప్పటిలానే కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బాతాల పోశెట్టి భరతం పడతానని హెచ్చరించి.. తాను ఏ మాత్రం తగ్గేది లేదని తేెల్చి చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూశారని ఆరోపించారు. ఆఖరికి బయటకొస్తున్న చివరి నిమిషం వరకు అడ్డుకునే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా.. 73 రోజులు ఉన్నోడికి ఇంకో పది రోజులు లెక్కనా..? 33 కేసులు ఉన్నోడికి ఇంకో మూడు లెక్కనా..? అంటూ కేసీఆర్ కు దీటైన సమాధానం ఇచ్చారు. తప్పు చేసినోడే భయపడతాడన్న ఆయన.. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకొచ్చానని వివరించారు.
న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందన్న మల్లన్న.. కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ వ్యవహారంపై డిఫమేషన్ సూట్ వేస్తున్నట్లు తెలిపారు. ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్లు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. దీంతో తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బీజేపీలో చేరుతారని ఆయన జైలులో ఉండగా ప్రచారం జరిగింది. మరీ ఆయన బీజేపీలో చేరి కేసీఆర్ ను ఎదుర్కొంటారా లేక ఇప్పటిలానే సొంతంగానే ముందుకు వెళతారా అన్నది చూడాలి మరీ..