ప్రజలకు పవర్ ఫుల్ షాక్.. ఇకపై నెలనెలా కరెంట్ ఛార్జీల హైక్?
posted on Nov 13, 2021 @ 4:12PM
జనం నెత్తి మీద మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోతోంది. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రో ధరల పెంపునకు కొనసాగింపుగా నిత్యావసర వస్తువుల ధరలూ జనాన్ని బాదేస్తున్నాయి. సందట్లో సడేమియా అన్న చందంగా ఇప్పుడు మళ్లీ కరెంట్ ఛార్జీలు నెల నెలా పెంచాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది.
ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే విద్యుత్ ఛార్జీలు సవరించుకునే విధానం అమల్లో ఉంది. అయితే.. ఇంధన సర్దుబాటు ఛార్జీల ఫార్ములా ఆధారంగా టారిఫ్ లను సంవత్సరంలో ఒకసారికి మించి సవరించుకోవచ్చని విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62(4) అవకాశం కల్పిస్తోంది.ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని తరచూ మార్పు చేస్తున్న తీరులోనే ఇకపై కరెంట్ బిల్లులు కూడా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలు, ఈఆర్సీలను కేంద్రం ఆదేశించింది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 22న కేంద్ర విద్యుత్ మంత్రత్వశాఖ విద్యుత్ నిబంధనలు-2021ను ప్రకటించింది. రాష్ట్రాల ఈఆర్సీలు సొంత ఫార్ములా రూపొందించే వరకు కేంద్రం ఫార్ములానే అనుసరించాలని చెప్పింది. పెరుగుతున్న బొగ్గు, గ్యాస్ ధరల ఖర్చును డిస్కంల నుంచి విద్యుదుత్పత్తి సంస్థలు, డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది.
నిజానికి ఆరేళ్ల క్రితమే నెలనెలా విద్యుత్ ఛార్జిల పెంపు విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు గగ్గోలు పెట్టడంతో కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో ఛార్జీల పెంపునకు బ్రేక్ పడింది. మళ్లీ ఇన్నేళ్లకు నెలనెలా విద్యుత్ ఛార్జీల పెంపును కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారుల నెత్తిన పెనుబాంబు పడక తప్పని పరిస్థితి ఏర్పడనున్నది.
పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించిన కేంద్ర ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రెడీ అవడాన్ని ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాగేసుకోవడం అంటే ఇదే అన్నమాట.