మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు హతం..
posted on Nov 13, 2021 @ 6:51PM
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు.ఓవైపు అగ్రనేతల మరణం.. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో కోలుకోలేకుండా ఉన్న మావోయిస్టులకు ఎన్ కౌంటర్ తో పెద్ద షాక్ తగిలినట్లైంది. గత నెలలోనే మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ చనిపోయారు.
గడ్చిరోలి జిల్లాకు ఈశాన్య ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో శనివారం ఉదయం నుండి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.పోలీసులు ఈ ఆపరేషన్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించారు. ఇది కొన్ని గంటల పాటు కొనసాగింది. ఈ భారీ ఆపరేషన్‌లో 26 మంది నక్సలైట్లను హతమార్చడమే కాకుండా ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు అనేక మావోయిస్ట్ శిబిరాలను ధ్వంసం చేశారు.
గడ్చిరోలి జిల్లా కోర్చి తాలూకాలోని కోట్‌గుల్ ప్రాంతంలోని ఎలెవెన్‌బట్టి అడవుల్లో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీని తర్వాత, సి-60 అనే పోలీసు బృందం మావోయిస్టులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత బృందం సెర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. వెంటనే పోలీసు బృందం మావోయిస్టు స్థావరాలకు చేరుకుంది. మావోయిస్టులు పోలీసుల రాకపై సమాచారం అందుకున్నారు. మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 26 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం.