భట్టి.. కేసీఆర్ కోవర్టా? ఈటల కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నారా?
posted on Nov 13, 2021 @ 3:21PM
ఈటల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ అంతటి స్థాయి ఉన్న ఉద్యమ నేత. టీఆర్ఎస్‌లో, ప్రభుత్వంలో ఓ వెలుగువెలిగి.. కేసీఆర్ కుట్రలతో గెంటివేయపడిన లీడర్. అలాంటి ఈటల.. పొలిటికల్ జంక్షన్‌లో నిలబడితే.. ఏ పార్టీ అయినా ఇట్టే లాగేసుకుంటుంది. మరి, కేసీఆర్‌ను పడగొట్టాలని కాపు కాసి కూర్చున్న కాంగ్రెస్ ఏం చేసింది? ఈటల రాజేందర్‌ను ఎందుకు అక్కున చేర్చుకోపోయింది? అంటే తెరవెనుక చాలా పరిణామాలే జరిగాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈటల కాంగ్రెస్‌లోకి తీసుకోకుండా బలమైన శక్తులు అడ్డుపడ్డాయని బయటపడింది. కొందరు కీలక నేతలు కేసీఆర్‌కు కోవర్టులుగా పని చేసి.. ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ కండువా కప్పకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ, 10 జన్‌పథ్‌లో జరిగిన వార్ రూమ్ మీటింగ్‌లో ఈ విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే....
శనివారం హస్తినలో కాంగ్రెస్ వార్‌రూమ్ మీటింగ్ హాట్‌హాట్‌గా జరిగింది. అందులో, హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ పోస్ట్‌మార్టం జరిపింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమికి మీరంటే మీరు కారణమంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటి కుమ్ములాటలు కామనే అనుకోండి. ఈ సందర్భంగా ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఈటలపై ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన కుట్ర బట్టబయలైంది. "ఈటలను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేది. కాంగ్రెస్‌లోకి ఈటలను రానివ్వకుండా కొందరు అడ్డుకున్నారు" అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అయితే, పక్కనే ఉన్న కేసీ వేణుగోపాల్.. భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డారు. అదేంటి.. ఈటలను పార్టీలోకి తీసుకోవద్దని మీరే కదా చెప్పింది.. మళ్లీ ఇప్పుడు మీరే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేంటంటూ భట్టిని నిలదీశారట వేణుగోపాల్. కంగుతిన్న భట్టి.. దెబ్బకు నోరు మూశారని అంటున్నారు.
భట్టి విక్రమార్క.. మొదటి నుంచీ సీఎం కేసీఆర్‌తో కాస్త సఖ్యతగానే మొదులుతున్నారు. సీఎల్పీ లీడర్‌గా ఉన్నా.. కేసీఆర్ సర్కారును ఇరుకునపెట్టేలా వ్యవహరించింది ఏమీ లేదంటారు. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై దూకుడుగా దాడి చేస్తున్నా.. దళితబంధుపై గట్టిగా నిలదీస్తున్నా.. భట్టి మాత్రం ప్రభుత్వానికి సహకరించేలా ప్రగతి భవన్‌కు వెళ్లి మరీ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతగా సహకరిస్తున్నారు కాబట్టే.. భట్టి నియోజకవర్గంలోనూ దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది సర్కారు. ఇక, ఇటీవల భువనగిరి జిల్లాలో దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ విషయంలోనూ ప్రభుత్వాన్ని నిలదీయకుండా.. కేసీఆర్ పెట్టిన సమావేశానికి హాజరై హ్యాండ్సప్ అనేశారు. ఇలా, అనేక విషయాల్లో భట్టి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్‌తోనే వ్యవహరిస్తున్నారని అంటారు.
ఇక ఈటల విషయంలోనూ భట్టి విక్రమార్క కావాలనే అడ్డుపుల్ల చేశారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లోనే.. బలమైన నేత ఈటల రాజేందర్, బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో చేరకుండా.. భట్టి అడ్డుకున్నారని అనుమానిస్తున్నారు. అందుకే, ఏఐసీసీతో ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని భట్టి చెప్పారని అంటున్నారు. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఏఐసీసీ మీటింగ్‌లో ఈటల కాంగ్రెస్‌లో చేరకుండా కొందరు అడ్డుకున్నారంటూ అపవాదు మరొకరిపై తోసేసే ప్రయత్నం చేసి అబాసు పాలయ్యారు. అందరి ముందు భట్టి దోషిగా నిలబడ్డారు.