కేంద్రంతో పోరాటం ఉత్తదేనా.. జగన్ తో వైరమా? కేసీఆర్ తిరుపతికి ఎందుకెళ్లరు?
posted on Nov 13, 2021 @ 12:58PM
ఈనెల 14న తిరుపతి దక్షిణాది రాష్ట్రాల సదరన్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ రాష్ట్రాల అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. సదరన్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రాలకు అత్యంత కీలకం. తమ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే వేదిక. అందుకే సదరన్ కౌన్సిల్ సమావేశాలకు అయా రాష్ట్రాల తరపున ముఖ్యమంత్రులే హాజరవుతుంటారు. కాని తిరుపతిలో జరగనున్న సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. పక్క రాష్ట్రంలోనే జరుగుతున్న కీలక భేటీకి కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదన్నది ఇప్పుడు చర్చగా మారింది.
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ల చుట్టే తిరుగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధమే సాగుతోంది. రైతులకు కేసీఆర్ సర్కార్ రోడ్డున పడేసిందని, ధాన్యం కొనకుండా మోసం చేస్తుందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ధాన్యం కొనలేమని కేంద్రం చెప్పిందని చెబుతున్నా గులాబీ బాస్.. పంజాబ్ ధాన్యం కొంటూ తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడుతున్నారు. అంతేకాదు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో నిరసనలకు పిలుపిచ్చారు. అధికార పార్టీగా ఉండిగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
కేంద్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు పోరాటం చేసేందుకు తిరుపతి సమావేశం మంచి వేదిక. అమిత్ షా సమావేశంలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవచ్చు. రాష్ట్ర రైతుల సమస్యలను తెలుపవచ్చు. కాని కేసీఆర్ మాత్రం కీలక సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ప్రెస్ మీట్లలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్... అమిత్ షా సమావేశానికి వెళ్లి ఎందుకు నిలదీయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నామని కేసీఆర్ చెప్పేదంతా ఉత్తదేనని, బీజేరీ-టీఆర్ఎస్ పార్టీలు పరస్పర సహకారంతోనే ముందుకు పోతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అన్నదాతలకు అన్యాయం చేస్తున్నామని మండిపడుతున్నారు.
మరోవైపు కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. తెలంగాణ మంత్రులు జగన్ ను టార్గెట్ చేస్తుండగా... ఏపీ మంత్రులు కేసీఆర్ కేంద్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ తిరుపతి వెళ్లడం లేదని కూడా కొందరు చెబుతున్నారు. మొత్తంగా అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకపోవడం రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చలకు కారణమైంది.