చంద్రబాబు బాటలోనే కేసీఆర్.. ఢిల్లీతో పోరులో ఏం జరుగునో?
posted on Nov 13, 2021 @ 2:18PM
సినిమా వాళ్లు హిట్ మూవీని మాత్రమే రీమేక్ చేస్తారు. ఫ్లాప్ షో జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతారు. రాజకీయాలకు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ, సెంటిమెంట్లను బాగా ఫాలా అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం గతంలో ఫ్లాప్ అయిన స్ట్రాటజీనే ఫాలో అవుతుండటం ఆసక్తికరం. తాను మోనార్క్‌ననే ఫీలింగో.. లేక, తాను తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే కాన్ఫిడెన్సో.. కారణం ఏదోగానీ.. ఢిల్లీలో అగ్గి పెడతానంటూ.. గతంలో చంద్రబాబు తరహాలోనే కేంద్రంపై పోరాటానికి దిగడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గతంలో చంద్రబాబు ఇదే తరహాలో కేంద్రంపై ధర్మపోరాటం చేసి.. ఫ్లాప్ అయ్యారు. మరి, ఈసారి కేసీఆర్ అయినా ఢిల్లీతో యుద్ధంలో గెలుస్తారా? బీజేపీతో రాజకీయ కురుక్షేత్రంలో పోరాడి నిలుస్తారా?
యాసంగిలో వరి కొనాలంటూ, పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు విత్‌డ్రా చేసుకోవాలంటూ.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ మినహా.. మిగతా వారంతా ధర్నాలతో అదరగొట్టారు. కానీ, కేంద్రం ఏమాత్రం బెదరలేదు. త్వరలోనే ఢిల్లీలో ధర్నాకు రెడీ అవుతున్నారు కేసీఆర్. రాష్ట్రం నుంచి మందీమార్బలాన్ని వెంటేసుకొని.. హస్తినలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. అచ్చం.. గతంలో చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షల మాదిరే.. ప్రస్తుతం కేసీఆర్ సైతం ఢిల్లీలో ధర్నాలకు సిద్ధమవడం ఆసక్తికరం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి.. విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి.. అప్పుడు చంద్రబాబు కేంద్రంపై ధర్మ పోరాట దీక్షలు చేశారంటే ఓ అర్థం ఉంది. కాకపోతే.. దాదాపు నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. పదవులు అనుభవించి.. చివరి ఏడాది కేంద్రాన్ని దోషిగా చూపించడాన్ని ప్రజలు ఆమోదించనట్టున్నారు. అయితే, చంద్రబాబు దీక్షలకు బలమైన కారణమైతే ఉంది. కేసీఆర్ విషయంలో అది కూడా లేదు.
గడిచిన ఏడేళ్లుగా కేంద్రానికి అన్ని విధాలుగా, అన్ని అంశాల్లో మద్దతు ఇస్తూనే ఉంది టీఆర్ఎస్. పార్లమెంట్‌లో అనేక బిల్లులకు సపోర్ట్ చేసింది. పెద్ద నోట్ల రద్దును అందరికంటే ముందు స్వాగతించింది కేసీఆరే. కొవిడ్ టైమ్‌లోనూ మోదీని కీర్తిస్తూ.. చప్పట్లు కొట్టారు. కారు-కమలం దొందుదొందేనని అంతా అనుకుంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు హుజురాబాద్‌లో బీజేపీ గెలవగానే కేసీఆర్‌లో భయం జొచ్చినట్టుంది. అటు, రేవంత్‌రెడ్డితోనూ కలవరం పెరిగిపోయింది. దీంతో.. పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికో.. లేక వరి వివాదాన్ని కేంద్రం మీదకు నెట్టివేయడానికో గానీ.. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ కేసీఆర్ దబాయించి చెబుతున్నా.. జనాలు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు. అందుకే బీజేపీ సైతం కేసీఆర్‌ను మరింత రెచ్చగొడుతున్నట్టుంది.
ఇక ఫెడరల్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ గతంలో అనేక కబుర్లు చెప్పారు కేసీఆర్. అది ఏమాత్రం ముందడుగు పడలేదు. కేసీఆర్‌ను మిగతా పార్టీలు నమ్మే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు అంతటి నాయకుడే.. మోదీపై ధర్మ పోరాటం ప్రకటించి సక్సెస్ కాలేకపోయారు. మరి, కేసీఆర్ వల్ల అవుతుందా? ఢిల్లీలో ధర్నాతో హిస్టరీ రిపీట్ అవుతుందా? లేక, హిస్టరీ క్రియేట్ చేస్తారా? చూడాలి..