అక్కడ అలా... ఇక్కడ ఇలా.. ఎందుకిలా?
posted on Nov 13, 2021 @ 3:39PM
అధికారం అందుకోనంత వరకు అన్నాచెల్లెళ్లు ఒక్కటే. పైసలు సంపాదించనంత వరకు అన్నాచెల్లెళ్లు ఒక్కటే.. అధికారం అందుకోన్న తర్వాత ? పైసలు సంపాదించిన తర్వాత? అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న బంధం బంద్ అవుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంల ఫ్యామిలీ వ్యవహారాన్నే వారు సోదాహరణగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత వరకు ఆయన తన సోదరి వైయస్ షర్మిలతో మంచి అనుబంధమే ఉంది. వైయస్ జగన్ .. 16 మాసాలు జైలులో ఉండగా.. జగనన్న వదిలిన బాణం అంటూ వైయస్ షర్మిల .. పాదయాత్ర చేపట్టి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేశారు. అంతేకాదు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమె సోదరుడు వైయస్ జగన్‌ను గెలిపించుకునేందుకు షర్మిల ఎంతగానో ప్రచారం చేయాలో అంతగా ప్రచారం చేశారు.
చంద్రబాబుకు బై బై.. అంటూ జగనన్న గెలుపు కోసం షర్మిల చేసిన ప్రచారం అంతా ఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత.. జగనన్న, వైయస్ షర్మిల మధ్య గాప్ బాగా పెరిగింది. దీంతో షర్మిల పక్క రాష్ట్రం తెలంగాణ వచ్చి వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే.. సోదరి షర్మిలకు పదవి ఇస్తానని చెప్పిన జగనన్న ఆ తర్వాత మాట తప్పి మడం తిప్పారని.. దీంతో షర్మిల అలక బూనారని.. ఆ తర్వాత ఆమె మెట్టినింట వైయస్ఆర్ టీపీ పేరిట పార్టీ పెట్టారనే ప్రచారం తాడేపల్లిలో అయితే జోరుగా సాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరో పక్క తెలంగాణలో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితమ్మ మధ్య కూడా చాలా గ్యాప్ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితమ్మ కూడా చాలా పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ అన్నా చెల్లెలు మధ్య అనుబంధం బతుకమ్మ పండగలా కళకళలాడింది.
అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ అన్నా చెల్లెల మధ్య గ్యాప్ చాలా బాగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ సీఎంగా ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలతోపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని తన కుమారుడు కేటీఆర్‌కు కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. ఆ క్రమంలోనే దాదాపు రెండు దశాబ్దాలు అనుబంధం ఉన్న ఈటలను సైతం తన కారులో నుంచి సీఎం కేసీఆర్ దింపేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇదే అంశంలో తన కుమార్తె కవితను సైతం కేసీఆర్ పక్కన పెట్టారనే టాక్ కారు పార్టీలో వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది కేటీఆర్‌తో కవిత ఎంతో అట్టహాసంగా జరుపుకునే రాఖీ పండగను ఈ ఏడాది కవితమ్మ చెక్ పెట్టిందనే వార్తలు గుప్పుమన్నాయి.
2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కవిత ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత ఆమెకు పదవి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్.. ఇంటి ఆడబడుచు అయిన కవితమ్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఈ పదవి కూడా వచ్చే జనవరి 4వ తేదీతో ముగియనుంది. దాంతో ఆమెకు మళ్లీ ఏ పదవి లేకుండా పోతుంది. తనకు మళ్లీ పదవి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ వద్ద కవితమ్మ తెగ పోరు పెడుతున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించింది. అయితే ఈ సభలో ఎక్కడ కవిత ఫోటో లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. కవితమ్మ హైదరాబాద్‌లో ఉండి మరీ ఈ ప్లీనరీకి డుమ్మా కొట్టిడంతో కేసీఆర్ ఫ్యామీలీలో గ్యాప్ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు దీనిపై సోషల్ మీడియా సాక్షిగా కల్వకుంట్ల తారకరాముడు, కవితమ్మ మధ్య గ్యాప్ మాములుగా లేదంటూ కారు పార్టీలో కూతలు మొదలైనాయి. ఏదీ ఏమైనా.. ఇటు ఆంధ్రలో అటు తెలంగాణలో గద్దెనెక్కిన పార్టీ అధినేత ఫ్యామిలీలలోని అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్‌లు బాగా పెరిగాయని దీనిని బట్టే అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.