కర్ణాటక సీఎంను మళ్లీ మారుస్తున్నారా? బిట్ కాయిన్ స్కాం బొమ్మె కొంప ముంచుతుందా?
posted on Nov 13, 2021 @ 2:21PM
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పీఠం కదులుతోందా? కోట్ల రూపాయల ‘బిట్ కాయిన్’ కుంభకోణం, ముఖ్యమంత్రి మెడకు చుట్టు కుంటోందా? బీజేపీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ ను ఢిల్లీకి పిలిచింది అందుకేనా? అంటే కర్ణాటక రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.
అయితే ఇటు ముఖ్యమంత్రి బొమ్మై, అటు మాజీ ముఖ్యమంత్రి శెట్టార్ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి మార్పు, ఉహాగానాలలో నిజం లేదని తేల్చేశారు. మరో వంక, బిట్ కాయిన్’ కుంభకోణం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పందించిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్త పరిచారు. ప్రధాని నరేంద్ర మోడీ బిట్ కాయిన్ వ్యవహారంలో విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారని, ఇది సమంజసమా? అంటూ సిద్ద రామయ్య మండి పడుతున్నారు. అదేమైనా చిన్న చితకా కుంభకోణమా, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా పట్టించుకోరా అంటూ సిద్దరామయ్య భగ్గుమన్నారు.
“ఈ కుంభ కోణంలో ముఖ్యమంత్రి పాత్ర ప్రమేయం ఉందోలేదో నాకు తెలియదు. కేంద్ర, రాష్ట్ర విచారణ సంస్థలు ఈ కేసును విచారిస్తున్నాయి.. అలాంటి కేసు విషయంలో ముఖ్యమంత్రి కాకపోతే ఎవరు సమాధానం చెపుతారు” అంటూ సిద్హరామయ్య వరస ట్వీట్లు వదులు తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాన్నికూడా సిద్దరామయ్య వ్యక్త పరిచారు.
అదలా ఉంటే ముఖ్యమంత్రి బొమ్మై, తమ మంత్రి వర్గంలో ఎవరికీ ఈ కుంభకోణంతో సంబంధం లేదని,ఎవరినో కాపాడవలసిన అవసరం తమకు లేదని అన్నారు. అలాగే, తన కుర్చీకి వచ్చిన ముప్పు కూడా లేదని బొమ్మై ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇది చాలా భారీ కుంభకోణమని, రూ. 2,600 కోట్ల నుంచి రూ.8,000 వరకు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. అయితే, అసలు కుంభకోణం ఏమిటి, అందులో ఎవరి పాత్ర ఏమిటో మాత్రం ఎవరూ చెప్పడం లేదని, ముఖ్యమంత్రి బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, నిరాధారంగా ఆరోపణలు చేయడం కాకుండా తమ వద్ద ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని ఎదురు దాడి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినంత వరకు ఎనిమిది తొమ్మిది నెలల క్రిందటే, కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి అప్పగించడం జరిగింది. సిబిఐకి కూడా రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి, ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలను విచారణ సంస్థలకు ఇవ్వాలని, బొమ్మె అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి శెట్టార్, వ్యక్తిగత పని మీద ఢిల్లీవచ్చానే కానీ, కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో మీడియా,రాజకీయ వర్గాల్లో ముఖ్యమంత్రి బొమ్మై మెడకు బిట్ కాయిన్ ఉచ్చు బిగుస్తోందని, ఆయనకు ఉద్వాసన ఖాయమని అంటున్నాయి. అయితే అంతిమంగా ఏమి జరుగుతుందో ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే అదొక చిక్క ప్రశ్నగానే ఉందని రాజకీయ్ విశ్లేషకులు అంటున్నారు. నిజంగానే, నాలుగు నెలలు అయినా కాకుండానే, బీజేపీ ముఖ్యమంత్రిని మారుస్తుందా లేదా బిట్ కాయిన్ కుంభకోణం టీ కప్పులో తుపానులా కనుమరుగై పోతుందా ? చూడవలసి వుందని అంటున్నారు.