జగనన్న స్పెషల్.. అసెంబ్లీ మళ్లీ ఒకరోజే!
posted on Nov 13, 2021 @ 10:47AM
ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రత్యేకతలే. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో జరుగుతున్న పరిణామాలన్ని స్పెషల్ గానే ఉంటున్నాయి. రివర్స్ టెండరింగ్ మొదలు అప్పులు, విలీనాలు.. ఇలా అన్నిఏపీలో మాత్రమే కనిపిస్తున్నాయి. పాలనే కాదు అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ జగన్ సర్కార్ స్పెషల్ గా నిలుస్తోంది. కేవలం ఒక్కటంటే ఒక్క రోజే అసెంబ్లీ నిర్వహిస్తూ తన స్పెషల్ మార్క్ గా నిరూపించుకుంటోంది.
ఈనెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. వారం రోజుల వరకూ నిర్వహిస్తామన్న సంకేతాలను పంపింది. అయితే అది ఉత్తుత్తినే అనే తేలిపోయింది. అసెంబ్లీ ఒక్క రోజు మాత్రమే. ఈ నెల పద్దెనిమిదో తేదీన అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ఒక్క రోజు మాత్రమే నిర్వహించి వాయిదా వేస్తారు. మళ్లీ వచ్చే నెలలో వారం, పది రోజుల పాటు నిర్వహిస్తామన్న లీక్‌ను మాత్రం మీడియాకు ఇస్తోంది. 17వ తేదీన కేబినెట్ భేటీ ఉంది. ఆ రోజున ఒక్క రోజులో ఏం చేయాలో ఖరారు చేస్తారు.
ఒక్క రోజు సమావేశం పెట్టడానికి బలమైన కారణం ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఒక సారి అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. లేకపోతే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. చివరి సారిగా మే 20వ తేదీన ఒక్కటంటే ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించి బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకుని వాయిదా వేశారు. ఆ ఒక్క రోజు సమావేశానికి టీడీపీ హాజరు కాలేదు. నవంబర్ 20వ తేదీకి ఆరు నెలలు పూర్తయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20వ తేదీ కంటే ముందే అసెంబ్లీని సమావేశపర్చాలి. అందుకే ఈ ఒక్కరోజు సమావేశం అన్నమాట.
ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ వర్షా కాల సమావేశాలను నిర్వహించలేదు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించేశారు. ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఒక్కటంటే ఒక్క రోజు నిర్వహించిన ఘనత ప్రభుత్వానిది. గత మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. మొత్తానికి పాలనలో దేశంలో అన్ని రాష్ట్రాలకు భిన్నంగా వెళుతున్న జగన్ సర్కార్.. ఒక్క రోజు అసెంబ్లీ నిర్వహణతోనూ తన స్పెషాలిటీ చూపిస్తుందనే సెటైర్లు వస్తున్నాయి.