వైసీపీ గెలిచింది.. ప్రజాస్వామ్యం ఓడింది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కు తున్నాయి.అరచాకమే రాజకీయం అనే స్థాయికి దిగజారుతున్నాయి. రాష్ట్రంలో సాగుతున్నఅరాచక పాలన వికృత రూపం అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తోంది. అయినా, అధికార వైసీపే ఎన్నికల విజయాలను చూసి మురిసిపోతోంది.అదే తమ ప్రభుత్వ పరమార్ధం అన్నట్లుగా,ఎన్నికలలో గెలుపు కోసం రాష్ట్ర భవిష్యత్’ను పణంగా పెట్టిన నిజాన్ని, మరుగు పరిచేందుకు అధికార పార్టీ వికారాలు ప్రదర్శిస్తోంది.
గ్రామా స్థాయినుంచి మున్సిపల్, కార్పొరేషన్ వరకు అంచెలవారీగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ‘చక్క’ గా జరిగాయో, పులివెందుల రాజకీయం ఎన్ని కొత్త పుంతలు తొక్కిందో ప్రపంచ మంతా చూసింది. ఛీ ..అంది అసహ్యించుకుంది. అయినా, ఈ అరాచక, అప్రజాస్వామ్య ఎన్నికల్లో అధికార వైసీపీ ‘గొప్ప’ విజయం సాధించిందని, అద్భుతాలు సృష్టించిందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొదలు మంత్రులు, వైసీపీ నాయకులు సంతోష పడుతున్నారు, సంబురాలు చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే, ‘దేవుడి’ దయతో వందకు 97 మార్కులు సాధించామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా, ‘పనిచేస్తున్న’ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారని అన్నారు.
అయితే ఎన్నికలు జరిగిన తీరుతెన్నులను దగ్గర నుంచి చూసిన ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం స్థానిక ఎన్నికల్లో ‘వైసీపీ గెలిచి ప్రజాస్వామ్యం ఓడి పోయింది’ని అంటున్నారు.ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలే కాదు, తిరుపతి, బద్వేల్ ఉపఎన్నికలు మొదలు రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాలలో జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నిట్లోనూ ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, విశ్లేషకులు అంటున్నారు. ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
అదలా ఉంటే, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నిజంగా అంత గొప్ప విజయాన్ని సాధించిందా. ప్రజలు నిజంగానే అధికార పార్టీకి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారా, అంటే, లేదు. గెలుపు ఘనంగా కనిపించినా ఓట్ల పరంగా చూస్తే, ఎన్నిక ఎన్నికకు వైసీపీ ఓటు దిగివస్తోంది. టీడీపీ ఓటు గ్రాఫ్ పైకి పాకుతోంది.
తాజాగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలనే తీసుకుంటే, మొత్తం 353 స్థానాలకు ఎన్నికలు జరిగితే, 28 బలవంతపు ఏకాగ్రీవాలు కలిపి వైసీపీ 261 స్థానాలు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం 82 స్థానాలు, జనసేన ఐదు స్థానాలు, స్వతంత్ర అభ్యర్ధులు మరో ఐదు స్థానాలు గెలుచుకున్నారు. నెల్లూరు నగరపాలిక తో పాటుగా నాలుగు పురపాలికలు,ఎనిమిది నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పది మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్పసప్ష్టమైన ఆధిక్యతను సాదించింది. ఇది పైకి కొంత ఘనంగా కనిపించినా, అధికార వైసీపీ, తెలుగు దేశం పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసాని పరిగణలోకి తీసుకుంటే, వైసీపే గెలుపులోని డొల్లతనం బయట పడుటిందని విశ్లేషకులు అంటున్నారు. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం రెండు శాతమే ఉందని, ఎన్నికల గణాంకాలు సూచిస్తున్నాయని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అధికార పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయితే ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీకి ప్రమాదకరమైన సంకేతాలని హెచ్చరించారు. నిజమే, గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ, టీడీపీల మధ్య ఇంచుమించుగా పది శాతం వరకు ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అది, రెండు శాతానికి పడిపోయింది అంటే, మున్సిపోల్స్ లో వైసీపీ గ్రాఫ్ ఎంత వేగంగా పడిపోతోందో అర్ధం చేసుకోవచ్చును. నిజానికి, వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలే అయింది. మరో రెండున్నర సంవత్సరాలు మిగిలే వుంది. ఇంతలోనే గ్రాఫ్ ఇలా గల్లంతు అయితే, అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఎక్కడికి దిగజారుతుందని, అధికార పార్టీ ఏమ్మేల్య్యేలే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అంతే కాదు, ఈ గెలుపు, గెలుపు కాదు, రేపటికి ఓటమికి ముందస్తు హెచ్చరిక మాత్రమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
స్థానిక సంస్థలు,అసెంబ్లీ,ఉపఎన్నికల్లో సహజంగానే ప్రజలు అధికారా పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఆ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అదికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకు తోడు,అధికార పార్టీ, గత రికార్డులు అన్నిటినీ బద్దలు చేస్తూ, ఎన్నికల అక్రమాల చరిత్రను కొత్త మలుపు తిప్పింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసింది. టీడీపీ అభ్యర్థులను పోటీ చేయకుండా ఉండేందుకు సామదానదండోపాయలను ప్రయోగించింది కుప్పం, నెల్లూరు సహా అనేక చోట్ల అభ్యర్ధులు నామినేషన్లను విత్ డ్రా చేసుకునేలా భయాందోళనలు సృష్టించారు.చివరికి పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తెచ్చిన జనాలతో దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలున్నాయి.అయినా, అవేవీ ఆశించిన విధంగా పనిచేయలేదు. అందుకే, ఈ ఎన్నికల ఫలితాలు అధికార ప్రతి కంటే ప్రతిపక్షాలకే అనుకూలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.