రాజు లేని రాజధానా? హైకోర్టు లేకుండా న్యాయ రాజధానా? హైకోర్టు సీజే సంచలనం..
posted on Nov 18, 2021 @ 11:07AM
జ్యుడీషియల్ క్యాపిటల్ అంటే ఏమిటి? ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా వ్యాఖ్యలు ఇవి. చీఫ్ జస్టిస్‌కే జ్యూడీషియల్ క్యాపిటల్‌పై క్లారిటీ రావట్లేదంటే సీఎం జగన్‌రెడ్డి మూడు ముక్కలాట ఎంత న్యాయ విరుద్ధంగా ఉందో అర్థమైపోతోంది. ఇటీవల ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా.. ఏపీ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇటీవల అమరావతి రైతులది మాత్రమే కాదు ఏపీ ప్రజలందరి రాజధాని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీజే.. తాజాగా కర్నూలులో న్యాయ రాజధానిపై సర్కారును ప్రశ్నలతో కడిగేయడం సంచలనంగా మారింది.
రాజధాని వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు విషయంలో చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు జ్యుడీషియల్ క్యాపిటల్ అంటే ఏమిటంటూ పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనా వికేంద్రీకరణ చట్టంలో హైకోర్టు కర్నూలులో ఉండాలని స్పష్టత ఇవ్వలేదన్నారు. హైకోర్టు ప్రధాన బెంచ్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు అమరావతి నుంచి హైకోర్టును తరలించడానికి వీలుకాదన్నారు. అలాంటప్పుడు హైకోర్టు లేకుండా జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజు లేకుండా రాజధాని ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు.
హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని వికేంద్రీకరణ చట్టంలో హామీ ఇచ్చినట్లు ఉందని, అలాంటి హామీని వికేంద్రీకరణ చట్టంలో పొందుపర్చవచ్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫై చేశారని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వాలనీ, పునర్విభజన చట్టానికి సవరణ చేయాలన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటికే ప్రిన్సిపల్ బెంచ్‌ని అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చినందున మరోసారి ఈ విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని వాదించారు. అమరావతి విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీల్లేదన్నారు. అదే సూత్రం హైకోర్టుకు వర్తిస్తుందన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సమ్మతితో బెంచ్‌లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కర్నూలులో లోకాయిక్త, హెచ్‌ఆర్సీ ఏర్పాటు చేశారని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవిభాగాలన్నీ ఒకచోట ఉంటేనే రాజధాని అవుతుందని వాదించారు.