జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అప్పుల వసూలుకు రాష్ట్రానికి కేంద్ర అధికారులు..
posted on Nov 17, 2021 @ 2:10PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఇంతలా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి నవరత్నాలు, సంక్షేమ ఉచిత తాయిలాలు ప్లస్ వైసీపే ట్రేడ్ మార్క్ అవినీతి కారణమా, లేక ఇంకైదైనా కారణమా, అంటే, అది వేరే చర్చ. ఈ అన్నిటితో పాటు, ఇంకొన్ని కలుపుకుని మొత్తంగా కర్ణుడి చావుకు ఉన్నని కారణాలే ఉండవచ్చును. అయితే, ఇప్పుడు విషయం అది కాదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి సర్కార్ తలుపులు తట్టే పరిస్థితికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారి పోయింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్థలు, గ్రామీణ విద్యుత్ సంస్థ, విద్యుత్ ఆర్ధిక సహాయ సంస్థల నుంచి అందిన కాడికి అప్పులు తెచ్చుకుంది. అలా తెచ్చిన రుణాలను ఇంకేందుకో వాడుకుంది. ఇప్పుడు అ అప్పులు తడిసి మోపెడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గడువులోగా అప్పులు తిరిగి చెల్లించలేదు. పొడిగింపులు ఇచ్చినా ఫలితం లేక పోయింది. చివరకు అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదనే విషయం కేంద్ర సంస్థలు కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తిచాయి కావచ్చును, మరోదారి లేక అప్పు వసూలుకోసం ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా కేంద్ర సంస్థల సీఈఓలు రాష్ట్రానికి వచ్చారు. నిన్న(మంగళవారం) సాయంత్రమే కేంద్ర విద్యుత్ సంస్థల అధికారులు అప్పుల వసూలుకు విజయవాడ చేరుకున్నారని, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు.
నిజానికి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి, అన్ని రంగాలలోనూ అనాలోచిత నిర్ణయాలనే తీసుకుంటోంది. ఆర్థిక క్రమశిక్షణ అనే పదాన్ని ప్రభుత్వ నిఘంటువు నుంచి చెరిపేసింది. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. రాష్ట్ర విభజన అనంతరం గత తెలుగు దేశం ప్రభుత్వం,అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాలికాబద్ధంగా ఒక్కొక వ్యవస్థను పటిష్ట ప్రచుకుంటూ వస్తే, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఒక్కొక్క వ్యవస్థను అప్పుల ఊబిలోకి తీసుకుపోతున్నారు. ఇందుకు, ఒక సజీవ ఉదాహరణ విధ్యత్ రంగం. కమిషన్లకు కక్కుర్తి పడి,రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను వదులుకుని, ప్రైవేటు సంస్థల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తోందని కేశవ్ గతంలోనూ పలు సంధర్భాలలో హెచ్చరించారు.అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా ఆపుల మీద అప్పులు చేసుకుంటూ పోయింది.చివరకు, అప్పుల వసూలుకు కేంద్ర సంస్థలు రాష్ట్రానికి రావడం కలకలం రేపుతోంది.
గత కొన్నేళ్ళుగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్ధలు ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగుజాడల్లో అప్పులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, ఎప్పటినుంచో వినవస్తోంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఆర్ధిక సంస్ధలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఎప్పుడైతే ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో పెట్టారని తెలిసిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి పరుగులు తీశారు. కొంత గడువు ఇస్తే అప్పులు తిరిగి చెల్లిస్తామన్నారు. కానీ అప్పటికే అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలోనే కేంద్ర విధ్యత్ సంస్థల అధికారులు రాష్ట్రానికి వచ్చారని పయ్యావుల కేశవ్ అన్నారు. అయితే, కేంద్ర విద్యుత్ సంస్థల అధికారులు, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని సమీక్షించేందుకే రాష్ట్రానికి వచ్చారని, అప్పుల వసూలూకు కాదని అధికార వర్గాలు నిజాలను దాచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనే విషయంలో ఎవరికీ, ఎలాంటి సందేహం లేదు. రిజర్వు బ్యాంక్ నుంచి వారం వారం తెచ్చుకునే ఋణ సదుపాయం కూడా నిన్నటితో బంద్ అయిపోయిందని సమాచారం. అదలా ఉంటే విద్యుత్ శాఖ పరిధిలో ఉన్న ఐదు ఎనర్జీ కార్పోరేషన్ల అప్పులే దాదాపు రూ.87 వేల కోట్లు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఇందులో ఆర్ఈసీ, పీఎఫ్సీ ఇచ్చిన అప్పులే రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల వరకూ ఉంటాయని అంచనా. వీటిలోనూ తక్షణం చెల్లించాల్సిన రూ.2 వేల కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు. ఈ రూ.2 వేల కోట్ల అయినా చెల్లించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే, లేదని వేరే చెప్పనక్కర లేదు.అలాంటి పరిస్థితి లేదు కాబట్టే కేంద్ర అధికారులు అప్పు వసూలు కోసం అమరావతి రావాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి ఇదో తీరని అవమానంగా మిగులుతోంది. ఇప్పటివరకూ ఇలా అప్పుల వసూలు కోసం కేంద్రం నుంచి అధికారులు వచ్చిన ఘటనలు ఎప్పుడూ లేవని డిస్కంలే చెప్పడం కొస మెరుపు.