బుగ్గనకు షాక్.. యనుమల సెటైర్లు.. రేవంత్ కు ఝలక్.. టాప్ న్యూస్@1PM
posted on Nov 17, 2021 @ 11:41AM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముందు విజయవాడలోని ఓ ఆస్పత్రిని సంప్రదించగా ఆయనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే గవర్నర్ వ్యక్తిగత వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.
---
అసెంబ్లీ నిర్వహించాలని రాజ్యాంగం గుర్తు చేసిందని... ఆరునెలలకు ఒసారైనా అసెంబ్లీ పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో లేకపోతే అది కూడా పెట్టేవారు కాదేమో అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్లమెంట్‌కు మరే ఇతర రాష్ట్రాలకు లేని కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వానికే వర్తిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఒక్కరోజు అసెంబ్లీతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. 14 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదింపచేసుకోవటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని నిలదీశారు
---
కొవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ తిరుపతిలో రోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రంలో నిరసన చేపట్టారు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయని బాధితులు ఆవేదన చెందారు. అల్పాహారం, భోజనం నాణ్యతగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్నారు. ---
తమకు కంచుకోటగా చెప్పుకునే ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దర్శీ నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీ 13, వైసీపీ 7 వార్డులు గెలుచుకున్నాయి. దర్శిలో గెలవడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. భారీగా డబ్బు వెదజల్లింది. అయినా టీడీపీ చేతిలో పరాజయం తప్పలేదు.
---
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలం మున్సిపాలిటీ కౌంటింగ్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి.8వ వార్డులో మొదట ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. తర్వాత వైసీపీ అభ్యర్థి కోరడంతో రీకౌంటింగ్ జరిపారు. అయితే రీకౌంటింగ్ తర్వాత వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ హాల్ దగ్గర ఆందోళనకు దిగాడు.
---
బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి.
---
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పాత్రలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ వెంకట్ రాం రెడ్డికి సహకారం అందిస్తోందని ఆరోపించారు.
----
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్‌రాంరెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే క్రమంలో ఎల్పీ ముందు మీడియాకు అనుమతించేందుకు అసెంబ్లీ సిబ్బంది నిరాకరించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయంలోనే సమావేశమయ్యారు
--------
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులపై 15 కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన, శాంతి భద్రతలకు విఘాతం, రైతులు, పోలీసులపై దాడుల చేయడంపై కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఇరుపార్టీ నాయకులపై నల్గొండ రూరల్, మిర్యాలగూడ వన్ టౌన్, మాడ్గుల పల్లి, వేముల పల్లి పోలీస్ స్టేషన్లలో పోలీసులు పది కేసులు నమోదు చేశారు.
-------
ముఖ్యమంత్రి స్టాలిన్ మినహాయించి మిగతా డీఎంకే నేతలు సక్రమంగా పని చేయడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, నటి ఖుష్బూ విమర్శించారు. స్థానిక పట్టణంబాక్కం బీచ్ రోడ్డులో నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు బీజేపీ తరఫున రొట్టెలు, పాలు తదితరాలను ఖుష్బూ పంపిణీ చేశారు. కొళత్తూర్ నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ నియోజకవర్గంలో భారీస్థాయిలో చేరిన వరద నీటిని తొలగించడంలో విఫలమయ్యారని అన్నారు.
---