కుప్పంను వైసీపీ కొల్లగొట్టిందిలా.. అరాచకం పీక్స్...
posted on Nov 18, 2021 @ 10:31AM
పది రోజులుగా ఒకటే పంతం. కుప్పం. చంద్రబాబు ఆయువుపట్టుపై దెబ్బకొట్టాలనేదే వైసీపీ వ్యూహం. నోటిఫికేషన్ రాకముందు నుంచే పక్కాగా ప్లాన్ చేసింది. కుప్పం టీడీపీ నేతలకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించింది. అధికార పార్టీకి అగెనెస్ట్‌గా ఉంటే టార్గెట్ అవుతామనేలా భయంకర వాతావరణం క్రియేట్ చేసింది. ఇక నోటిఫికేషన్ వచ్చాక.. అధికార పక్షం మరింత రెచ్చిపోయింది. బలం, బలగం, డబ్బు, దబాయింపు.. కుప్పంలో కుంపటి రాజేశారు. ఏం చేసైనా సరే.. ఈ సారి కుప్పం మున్సిపాలిటీని టీడీపీ నుంచి లాక్కోవాలని కుట్ర చేశారు. గట్టి పోటీ ఇచ్చానా.. వైసీపీ అరాచకాల ముందు పసుపు దళం నిలవలేకపోయింది. కుప్పం ఫలితం అధికార పక్షానికి అనుకూలంగా వచ్చినా.. ఆ ఫలితం ఎన్ని దౌర్జన్యాల ఫలమో అందరికీ తెలిసిందే.
కుప్పంలో గెలిచామని విర్రవీగుతోంది వైసీపీ. ఇదంతా దొంగ ఓట్ల గెలుపేనని టీడీపీ అంటోంది. నామినేషన్ల నుంచే భయోత్పాతం మొదలుపెట్టింది అధికార పార్టీ. 25 వార్డులున్న పట్టణంలో ఒక స్థానాన్ని వైసీపీ ఏకగ్రీవం చేయించుకుంది. 24 వార్డులకు పోలింగ్ జరగ్గా.. 19 వైసీపీ, 6 టీడీపీ ఖాతాలో చేరాయి. కుప్పంలో గెలుపు కోసం అధికార, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని, ప్రచారం నుంచి పోలింగ్ వరకూ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ ముఖ్యనేతలు అక్కడే మోహరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, మండల పార్టీ నేతలు మకాం వేశారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి తాయిలాలు, బెదిరింపులకు దిగారు. వైసీపీకి ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లు, మెప్మా, వెలుగు సంఘాల ద్వారా ఓటర్లను భయపెట్టారు.
టీడీపీ నాయకులను అరెస్టు చేసి రెండు రోజుల పాటు ప్రచారానికి ఆటంకం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్‌కు ముందురోజు కొందరు నాయకులను అదుపులోకి తీసుకొని, తర్వాత వదిలేశారు. ఇలా భయాభ్రాంతులకు గురి చేయడంతో టీడీపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి మొదట అభ్యర్థులుగా ఎంచుకున్న కొందరు నాయకులు.. తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి పోటీకి ముందుకు రాకపోవడం, అప్పటికప్పుడు కొత్తవారిని బరిలో నిలపాల్సి రావడం, బూత్ ఏజెంట్లు బలహీనంగా ఉండటం వైసీపీకి కలిసొచ్చినట్టు చెబుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులపై ఉన్న వ్యతిరేకత కూడా ప్రభావం చూపిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
ఏమి చేసైనా.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసైనా.. కుప్పంలో వైసీపీ గెలిచిన తీరు ఆ పార్టీకి గొప్పేమో కానీ.. ప్రజలు మాత్రం అధికార పార్టీ తీరును అసహ్యించుకుంటున్నారు.