వ్రతం చెడినా .. మోడీకి ఫలితం దక్కుతుందా?
వివాదాస్పద సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సంవత్సర కాలంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన సాగిస్తున్నా, వందల సంఖ్యలో ఆందోళన చేస్తున్న రైతులు మరణించినట్లు వార్తలు వచ్చినా, చివరకు ఉద్యమం ముసుగులో జాతీయ జెండాకు అవమానమేజరిగినా, చలించని ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు ఒక్క సారిగా ఎందుకు దిగి వచ్చారు? ఎందుకు, చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారు?ఈ ప్రశ్నలకు ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చును? కానీ, ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఒకటి మాత్రం నిజం. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మరో మూడు నాలుగు నెలల దూరంలో బారులు తీరిన ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే కానీ, మరొకటి కాదు. ఈ విషయంలో ఎవరికీ, రెండవ అభిప్రాయం అవసరం లేదు.
నిజానికి ప్రధాని ప్రకటనలోనే ఆ విషయం స్పష్టమైంది.సాగు చట్టాలు రైతు వ్యతిరేకం అంటూ ప్రతిపక్షాలు, రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణలను ప్రదాని అంగీకరించలేదు.ఆందోళన చేస్తున్న రైతు నేతలు ఎత్తి చూపుతున్న చట్టాల్లోని దోషాలాను ఒప్పుకోలేదు. ఆ కారణంగా చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పలేదు.చట్టాలు మంచివే, రైతులకు మేలు చేసేవే, అయినా కొందరికి ఆ చట్టాలు నచ్చలేదు. ప్రభుత్వం వారికి నచ్చచెప్పే ప్రయత్నంలో విఫలమైంది. అందుకే చట్టాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం, క్షమించాలి’ అని ప్రధాని రైతులను క్షమాపణ కోరారు.
అంటే ఇది మనస్పూర్తిగా తీసుకున్న నిర్ణయం కాదు, రాజకీయ అవసరాల కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పకనే చెప్పారు. ఒకప్పుడు రాజకీయ అవసారాలకోసం, నిర్ణయాలు మార్చుకోమని, దేశ హితంకోరి తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోమని చెప్పిన ప్రధాని, ఇపుడు అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ హితాన్ని పక్కన పెట్టారు. అందుకే కావచ్చు ఒక విధంగా, ఇది మోడీ రాజకీయ జీవితంలో చెరగని ముద్రగా/ మచ్చగా నిలిచి పోతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అయితే మోడీ నిర్ణయమే తప్పని అంటున్నారు.
అయితే, అదెలా ఉన్నా, వ్రతం చెడిన మోడీకి ఫలితం దక్కుతుందా? ముఖ్యంగా పంజాబ్’లో ఫలితం కలిపిస్తుందా? ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి, ప్రస్తుతానికి అయితే, ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నలుగు రాష్ట్రాల్లో బలం తగ్గినా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, సర్వేలు చెపుతున్నాయి. అయితే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపధ్యంలో పరిస్థితి ఎటు తిరిగి ఎక్కడ తేలుతుందో అనేభయం కమల దళంలో కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు జనాకర్షక నిర్ణయాలు, బీజేపీలో గూడుకట్టుకున్న ఎన్నికల భయాన్ని తెలియచేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయ సందర్భాలను బట్టి చూస్తే ముఖ్యంగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రధాన లక్ష్యంతో ప్రధాని గురునానక్ జయంతి రోజున ఈ ప్రకటన చేశారని అంటున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఏర్పటు చేసే కొత్త పార్టీ, అదే విధంగా సాగు చట్టాలను వ్యతిరేకించి ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన చిరకాల మిత్ర పక్షం అకాలీ దళ్’ను కలుపుకుని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే మోడీ ముహూర్తం చూసుకుని మరీ సాగు చట్టాల రద్దు నిర్ణయం ప్రకటించారని అంటున్నారు.
ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంలో బీజేపీ ఒక విధంగా విపక్షాలను నిరయుధాలను చేసే వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంగా పంజాబ్ ‘ లో పూర్తిగా కమిలి (వాడి) పోయిన కమలాన్నిబతికించుకోవడంతో పాటుగా, యూపీలో పార్టీ బలాన్ని పెంచుకుని, భవిష్యత్ (లోక్ సభ ఎన్నికల)కు పునాదులు వేసుకునేందుకే బీజేపీ సాగు చట్టాలకు చాప చుట్టిందని, విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇంతచేసి వ్రతం చెడినా బీజేపీకి ఆశించిన ఫలితంగా దక్కుతుందా అనేది ఒకటైతే రాజకీయ ప్రయోజనాల కోసం వెనకడుగు వేయడం బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి కొత్త కాదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
గతంలో మిత్ర పక్షాల మద్దతు అవసరం అయిన సమయంలో, బీజేపీ, వాజ్ పేయి ప్రభుత్వం రామజన్మ భూమి, ఉమ్మడి పౌర స్మ్రుతి, ఆర్టికల్ 370 వంటి పార్టీ మూల సూత్రాలను తాత్కాలికంగా పక్కన పెట్టింది. అలాగే. సంపూర్ణ మెజారిటీ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా, గత కాంగ్రెస్/ యూపీఏ ప్రభుత్వ హయాంలో చేసిన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం, భూసేకరణ పునరావాస చట్టం, పశు సంరక్షణ, గోసంరక్షణ, ఈపీఎఫ్ సవరణ చట్టాల విషయంలో వెనకడుగు వేసింది. ఒక విధంగా చూస్తే, రాజకీయ సంగీత స్వరాలాపనలో ఎక్కడ స్రుతి పెంచాలో, ఎక్కడ తగ్గించాలో బీజేపీకి తెలుసు. అందుకే, ఎదరు దెబ్బలు తిన్నా ఎదిగి వస్తోందని,రాజకీయాల్లో ఎక్కడా రైజ్ అవ్వల్లో మాత్రమే కాదు, ఎక్కడ తల వంచాలో, ఎక్కడా వంగలో కూడా తెలిసినప్పుడే ప్రస్థానం ముందుకు సాగుతుంది.. లేదంటే ఎకక్డ వేసియన్ గొంగళి అక్కడే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.