మీడియా చర్చలతో మరింత కాలుష్యం.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
posted on Nov 17, 2021 @ 8:02PM
దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం కోరలు చాచింది. ఇది ఈ సంవత్సరమేవచ్చిన సమస్య కాదు, దశాబ్దాలుగా రాజధాని ప్రజలను వేదిస్తున్న సమస్య. ప్రతి సంవత్సరం చలికాలం రాగానే, కాలుష్యం కోరలు చాచి విరుచుకు పడడం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తల అవే డైలాగులు రీప్లే చేయడం అలవాటుగా మారిపోయింది. అలాగే, బాధితులు కోర్టులను ఆశ్రయించడం రోటీన్’గ జరిగి పోతున్నాయి. అయితే, ఈరోజు ఢిల్లీ కాలుష్యంపై సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, మీడియా చర్చల ద్వారా విడులయ్యే కాలుష్యమే ఢిల్లీ కాలుష్యం కంటే ఎక్కువగా, ఎక్కువ ప్రమాద కారిగా మారిందని తీఫ్ర వ్యాఖ్యలు చేసింది.కోర్టు ముందుకు వచ్చిన అంశాలను డిబేట్లలో పరిగణనలోకి తీసుకోకపోవటమే అందుకు కారణంగా పేర్కొంది. ప్రతి ఒక్కరికి సొంత అజెండా ఉందని, ఆయా చర్చల్లో నిజమైన కారణాలు పక్కకు వెళ్లిపోతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
చిన్న, సన్నకారు రైతులకు పంటవ్యర్థాలను తొలగించే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయాలని పర్యావరణ కార్యకర్త ఆదిత్య దుబే, న్యాయవిద్యార్థి అమన్ బంకా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మీడియా చర్చల్లో ప్రతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చాలనుకుంటున్నారు. అలా జరిగితే నిందలు మాత్రమే మిగులుతాయి. ఇతరుల కంటే టీవీ ఛానళ్లలోని చర్చలే ఎక్కువగా కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఏం జరుగుతోంది, సమస్య ఏమిటి? అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కోర్టులోని అంశాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంత అజెండా ఉంది. అలాంటి వాటివల్ల ఉపయోగం లేదు. మేము ఎలాంటి సాయం చేయలేం. నియంత్రించలేమని ధర్మాసనం పేర్కొంది.
పంట వ్యర్థాలను తగలబెట్టటం కాలుష్య కారకాల్లో ఒకటని, దానికి పరిష్కారం కనుగొనాలని డిల్లీ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిశేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను చూపించారు. సింఘ్వీ వాదనలపై ఈ మేరకు స్పందించింది ధర్మాసనం.మరోవైపు.. టీవీ డిబేట్లను ప్రస్తావిస్తూ.. పంట వ్యర్థాలను తగలబెట్టే అంశంపై న్యాయస్థానాన్ని తాను తప్పుదోవపట్టిస్తున్నట్లు పేర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ' కొన్ని ఛానళ్లలో నాపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం నేను చూశాను. పంట వ్యర్థాలను కాల్చటం వల్ల కేవలం 4-7 శాతం మేర మాత్రమే ఉందని చూపించటం ద్వారా నేను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు. దానిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా.' అని పేర్కొన్నారు. అయితే.. తాము ఎప్పుడూ తప్పుదోవ పట్టలేదని, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు అలాంటి విమర్శలు వస్తాయని ధర్మాసనం పేర్కొంది.