గవర్నర్ కు కొవిడ్.. దిగొచ్చిన జగన్.. కేసీఆర్ లేఖాస్త్రం.. టాప్ న్యూస్@7PM
posted on Nov 17, 2021 @ 6:22PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలోచేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం గవర్నర్ కు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.------హైదరాబాద్ లాల్ బంగ్లాలో యోధ లైఫ్‌లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని చిరంజీవి కొనియాడారు.
-------
రాష్ట్రంలోని ఎయిడెడ్ సంస్థలు యథావిధిగా నడుపుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. విద్యారంగంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో జాతీయ విద్యా విధానం, అమలుపై చర్చించారు. రాష్ట్రంలో 2,663 ప్రాధమికోన్నత పాఠశాలలను హైస్కూళ్ళలో విలీనం చేశామని అధికారులు తెలిపారు. విలీనం చేసినా దాతల పేర్లు కొనసాగిస్తామని సీఎం పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల దెబ్బకు సర్కార్ దిగివచ్చింది.
---------
వైసీపీ గెలుపుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కుప్పంలో వైసీపీ గెలిచిన గెలుపు ఒక గెలుపా? అని ప్రశ్నించారు. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బొకేలు ఇచ్చు కోవడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. ఈ రోజు వైసీపీ విజయాలను డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఇవ్వాలన్నారు. డీజీపీ లేకపోతే వైసీపీ గెలిచేది కాదన్నారు
-------
వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం దేవిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు వారెంట్ ఇచ్చారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.
--------
పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని సేకరించాలని కోరుతూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రబీ ధాన్యాన్ని కొనేలా ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ నుంచి ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని కేసీఆర్ కోరారు. ఖరీఫ్‌లో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. వచ్చే రబీలో ఎంత ధాన్యం సేకరిస్తారో ముందే ప్రకటించాలన్నారు కేసీఆర్.
--------
గతంలో కేంద్రానికి అనేక బిల్లుల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు సహకరించారని బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రాన్ని బ్లేమ్ చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ధాన్యం అంశాన్ని వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో టూరిజం అభివృద్ధిలో సహకరిస్తామని ఆయన తెలిపారు.
------
మెదక్ జిల్లా అచ్చంపేటలో జమునా హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈటల కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హామీతో దళితులు ఆందోళనలు విరమించారు.
-----
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ న్యాయస్థానం ఉద్యోగులు, తదితరులకు సంచలన సందేశం ఇచ్చారు. ఈ న్యాయస్థానంలో ఫ్యూడల్ సంస్కృతిని ధ్వంసం చేయలేకపోయినందుకు తాను తీవ్రంగా విచారిస్తున్నానని చెప్పారు. తనకు సంపూర్ణ సహకారం అందించిన హైకోర్టు ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ న్యాయస్థానంలో ఫ్యూడల్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినందుకు విచారిస్తున్నానని చెప్పారు.
--------
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.