కేసీఆర్ పొలిటికల్ సూసైడ్?.. బీజేపీతో అంత ఈజీ కాదయా?
posted on Nov 17, 2021 @ 12:40PM
కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఇద్దరి మధ్య.. రెండు పార్టీల మధ్య.. వరిపై పొలిటికల్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. కీలకమైన వరి పోరులో రేవంత్‌రెడ్డికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇదంతా కాంగ్రెస్‌ను సైడ్‌వేస్‌లోకి పంపించే ఎత్తుగడలో భాగమేనని కూడా అంటున్నారు. కేసీఆర్-బీజేపీ కుమ్మక్కై.. ఇద్దరి ఉమ్మడి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్-రేవంత్‌ను అణగదొక్కే కుట్ర చేశారని చెబుతున్నారు. వరుస పరిణామాలూ అందుకు బలం చేకూర్చుతున్నాయి. మరి, కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు వర్కవుట్ అవుతుంది? తాత్కాలికంగా పొలిటికల్ అడ్వాంటేజ్ లభించినా.. లాంగ్‌రన్‌లో అది ఎవరికి లాభం? కాంగ్రెస్‌ను ఖతం చేయడం ఎంతవరకు సాధ్యం? బీజేపీని ఎంకరేజ్ చేస్తే.. పాముకు పాలు పోసి పెంచినట్టేనా? ఆ పార్టీ తిరిగి కేసీఆర్‌ను కాటేయకుండా ఉంటుందా? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు దాగున్నాయి ఇందులో.
ఎంతకాదన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అప్పుడూ ఇప్పుడూ బలంగానే ఉందనేది వాస్తవం. ఎమ్మెల్యేల సంఖ్య తక్కువే ఉన్నా.. హస్తం ఓటుబ్యాంకు మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. లీడర్లకూ కొదవేం లేదు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక.. కాంగ్రెస్ కేడర్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి అధికారం హస్తగతం కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదే కేసీఆర్‌లో కలవరానికి కారణం. అందుకే కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీని పైకి లేపుతున్నారని అంటున్నారు. వరి కొనుగోలుపై బీజేపీని విమర్శించడం.. పెట్రో ధరల పెంపుపై నిలదీయడం.. బండి సంజయ్ రోడ్డెక్కడం.. ఆయన్ను అడ్డుకోవడం.. కోడిగుడ్ల దాడి.. ధర్నాలు, మహాధర్నాలతో పొలిటికల్ హీట్ పెంచడం.. అంతా కేసీఆర్ స్కెచ్‌లో భాగమనే అనుమానం. ఇప్పటి వరకైతే కేసీఆర్ స్క్రిప్ట్ పక్కాగా వర్కవుట్ అవుతోంది. వారం రోజులుగా కాంగ్రెస్ వార్తల్లో లేదు. రాజకీయమంతా టీఆర్ఎస్-బీజేపీ మధ్యనే తిరుగుతోంది. మరి, ముందుముందు ఏం జరగనుంది? కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో ప్రమాదమా? లేక, బీజేపీతో అంతకన్నా ప్రమాదమా? అనేది ఆసక్తికరం.
ఒకసారి బెంగాల్‌లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే.. 40 ఏళ్ల పాటు బెంగాల్‌లో గంపగుత్తగా పాలించిన కామ్రేడ్లను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గట్టిగా ఎదుర్కొన్నాడు. కమ్యూనిస్టులపై పోరులో బిజీగా ఉండి బీజేపీని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే ఛాన్సుగా.. చాపకింద నీరులా.. కమలనాథులు బెంగాల్‌లో బాగా బలపడ్డారు. ఖతర్నాక్ కామ్రేడ్లనే ఢీకొట్టిన దీదీకి.. ఇప్పుడు కాషాయ దళం చుక్కలు చూపిస్తోంది. అధికారం అంచుల దాకా చేరుకున్నా.. తృటిలో పవర్ చేజారిపోయింది. నందిగ్రామ్‌లో మమతనే ఓడించి సత్తా చాటారు కమలనాథులు. తెలంగాణలోనూ బెంగాల్ పరిస్థితులు తప్పకపోవచ్చు అంటున్నారు.
కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు బీజేపీని ఎంకరేజ్ చేస్తున్న కేసీఆర్ వ్యూహం ఇప్పుడు బాగానే వర్కవుట్ అవుతున్నా.. భవిష్యత్తులో అది ఆయనకే ఎసరు తెస్తుందని అంటున్నారు. ఒక విధంగా కేసీఆర్ స్ట్రాటజీ.. పొలిటికల్ సూసైడ్ లాంటిదంటున్నారు. అందుకు బలమైన కారణాలే చూపిస్తున్నారు. కాంగ్రెస్ వేరు.. బీజేపీ వేరు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బాగా బలపడి వచ్చే ఎన్నికల్లో మెరుగైన సీట్లు సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నేరుగా అధికారంలోకి వస్తే సరే సరి. లేదంటే.. మ్యాజిక్ ఫిగర్ దాటలేదంటే.. కాంగ్రెస్‌ను ఖతం చేయడం కేసీఆర్‌కు చాలా సింపుల్. గతంలో మాదిరే ఆపరేషన్ ఆకర్ష్ అని ఓ పిలుపిస్తే చాలు.. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొలో మంటూ గులాబీ గూటికి వరుస కట్టేస్తారు. కాంగ్రెస్‌ను చీల్చడం చాలా ఈజీ. అది కేసీఆర్‌కు లాభమేగా? కాంగ్రెస్ ఎంత బలపడితే.. పరోక్షంగా కేసీఆర్ కూడా అంతే బలపడినట్టేగా? అయితే, కాంగ్రెస్ నేరుగా అధికారంలోకి వస్తుందనే భయమే కేసీఆర్‌తో ఇలా చేయిస్తోందని అంటున్నారు. అంటే, రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్‌ల గెలుపును కేసీఆర్ పరోక్షంగా కన్ఫామ్ చేసినట్టేనా?
కానీ, కాంగ్రెస్ కోసం బీజేపీని బలపడనిస్తే మాత్రం గులాబీ బాస్‌కు పెను ప్రమాదం తప్పదంటున్నారు. కాంగ్రెస్‌ను తొక్కేసి.. బీజేపీని ఎదగనిస్తే.. కాషాయపార్టీకి భారీగా ఎమ్మెల్యే సీట్లు వస్తే.. అధికారంలోకి రాకపోయినా.. కేసీఆర్ విసిరే వలకు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా చిక్కరు. పైగా చుక్కలు చూపిస్తారు. కమల దళాన్ని చీల్చడం అంత సులువు కానే కాదు. సైద్దాంతిక నిబద్దత, పార్టీపై మక్కువ ఎక్కువ ఉండే బీజేపీలో గోడమీద పిల్లులు దాదాపు ఉండరు. ఇక ఎలాగూ కేంద్రంలోనూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందంటున్నారు కాబట్టి.. కేసీఆర్ వేసే బిస్కెట్లకు కాంగ్రెస్ వారిలా బీజేపీ నేతలు ఆశ పడకపోవచ్చు. ఇలా చూస్తే.. కేసీఆర్‌కు కాంగ్రెస్ కంటే బీజేపీతోనే ఎక్కువ ప్రమాదం అంటున్నారు.
బెంగాల్‌లో మమత.. కామ్రేడ్ల మీద ఫోకస్ పెట్టి.. కమలనాథులను లైట్ తీసుకున్నందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నట్టే.. కేసీఆర్ సైతం కాంగ్రెస్‌ను అణిచేస్తూ.. బీజేపీని ఎగదోయడం.. పొలిటికల్ సూసైడ్ అని విశ్లేషిస్తున్నారు.