సోము వీర్రాజుకు ఉద్వాసన? కొత్త అధ్యక్షుడు ఎవరంటే ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ, బలమెంతో,మొన్నటి స్థానిక ఎన్నికల్లో మరో మారు రుజువైంది. కేంద్ర నాయకత్వం ఎంత బూస్ట్ ఇచ్చినా, ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి, పార్టీ వ్యూహ కర్త అమిత్ షా దిశా నిర్దేశం చేసినా, ఫలితం మాత్రం శూన్యం. మిత్ర పక్షం జనసేన కొన్ని జిల్లాల్లో అయినా కొంతవరకు ఉనికిని చాటుకుంది కానీ, కమల దళం మాత్రం ఏ జిల్లాలోనూ ఉన్నాను అనిపించుకోలేదు. ఇదలా ఉంటే, అమిత్ షా పర్యటన తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.
ఏపీ బీజేపీలో ఒక వర్గం పక్కాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్డంవుతుంటే, మొదటి నుంచి వైసీపీతో స్నేహ సంబంధాలను కొనసాగిస్త్నున్న మరో వర్గం మాత్రంప ఆద్రిలోనే నడుస్తోంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం వలన ప్రయోజనం లేదని రుజువైనా ఇంకా తెలుగు దేశం, చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని, ఫలితంలేని పంథాలో ముందుకు సాగుతోంది కాగా, అమిత్ షా ఆదేశాల మేరకు, ఈ రోజు (నవంబర్ 21) రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకువి జయవాడ నుంచి నెల్లూరుకి పార్టీ నేతలు, కార్యకర్తలు బయలు దేరారు.అయితే, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, మరో ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం లేదు. బీజేపీ రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్, పార్టీ మాజే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరి నెల్లూరులో పాదయాత్రలో పాల్గొంటున్నారు.
అమిత్ షా రాజధాని రైతుల మహా పాదయాత్ర పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటుగా, పార్టీ నాయకులు, కర్యకర్తలు పాదయాత్రలో తప్పక పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, సోము వీర్రాజు,ఇతర ముఖ్యనాయకులు, ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గంగా ముద్రపడిన నాయకుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఎందుకు, కొందరు నాయకులు, సాకులు చూపి తప్పించుకుంటున్నారు? అనేది ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది.
వరుస ఓటములతో పార్టీ క్షేత్ర స్థాయిలో పార్టీ కనుమరుగై పోయిన నేపధ్యంలో సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, నిజానికి పార్టీ అధిష్టానమే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఆలోచన చేస్తోందని, అందుకే అయన తనంతట తానుగా బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అదైన,ఇదైనా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ నాయకత్వంలో త్వరలోనే మార్పు తధ్యమని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి వీర్రాజు శక్తి సామర్ధ్యాలు సరిపోవదం లేదు. మరో వంక ఆయనలోనూ ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితంగా ఏపీలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.ఇక రాష్ట్రంలో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో సహా, అన్ని ఎన్నికల్లోనూ బిజెపి చావుదెబ్బ తినడం వంటి కారణాలు సోము వీర్రాజు స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు కారణమయ్యాయని సమాచారం.
మరోవంక సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నాయకులూ ఎవరూ సహకరించక పోవడం, మిత్రపక్షం జనసేన కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కాదని నేరుగా కేంద్ర నాయకత్వంతో సంప్రదింపు జరపడం, రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణకు కలిసి రాక పోవడం వంటి,అనేక అవమానకర సంఘటనలు ఎదురవుతున్న పరిస్థితిలో, పొమ్మనేదాకా చూరు పట్టుకుని వేళ్ళాడే కంటే ముందుగ గౌరవప్రదంగా తనంతటతానే పదవినుంచి తప్పుకోవడం ఉత్తమం అనే భావిస్తునట్లు తెలుస్తోంది.
అయితే, ఈసారి ఏపీలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సోము వీర్రాజుతో పాటుగా, మరో కొందరిపై కూడా వేటు పడడం ఖాయమని అంటున్నారు. అలాగే, ఈసారి, పార్టీ నాయకత్వ కూర్పులో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అధ్యక్ష పదవితో పాటుగా కీలక పదవువులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఇతర పార్టీల సీనియర్ నాయకులను ఆకర్శించక తప్పదని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. అదే డైరెక్షన్’లో పార్టీని ముందుకు తీసుకుపోయే నేతకే ఈ సారి పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంటున్నారు.