కేసీఆర్ ఛానెల్‌కు ఆంధ్రా సీఈవో.. క్యా బాత్ హై!
posted on Nov 17, 2021 @ 5:25PM
నిధులు మనవి.. నీళ్లు మనవి.. నియామకాలు మనవే.. ఉద్యమ సమయంలో మంచి మంచి స్లోగన్స్ ఇచ్చారు. అందలమెక్కాక సంబంధం లేని పనులు చేస్తున్నారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులన్నీ దాదాపు ఆంధ్రా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు కేసీఆర్. ఇక నియామకాలు అసలే లేవు. నిధులు ఆయన జేబుల్లోనే వేసుకుంటున్నారనే ఆరోపణలు. ఇక ప్రభుత్వ వ్యవహారాల సంగతి పక్కనపెడితే.. తన సొంత వ్యాపారాల్లోనూ ఆంధ్రా వారికే పెద్దపీట వేస్తున్నారు గులాబీ బాస్. తాజాగా, తన అధికార ఛానెల్.. టీ న్యూస్ సీఈవోగా ఆంధ్రా వ్యక్తిని నియమించుకున్నారు.
మొదట్లో నమస్తే తెలంగాణను కట్టా శేఖర్‌రెడ్డి.. టీ న్యూస్‌ను నారాయణరెడ్డి.. చేతుల్లో పెట్టారు కేసీఆర్. చాలా ఏళ్లు వాళ్లే పింక్ మీడియాను నడిపించారు. అయితే, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాక.. రెడ్ల వర్గమంతా ఏకమవుతోందనే అనుమానంతో.. తన మీడియా హౌజ్ నుంచి రెడ్లను చాకచక్యంగా సైడ్ చేశారు. శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డిలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టి హుందాగా తప్పించారు. సంస్థలోని రెడ్డి ఉద్యోగులను తొలగించడమో, ప్రాధాన్యత తగ్గించడమో చేశారు. నమస్తే తెలంగాణ సీఈవోగా ఆంధ్రజ్యోతికి చెందిన తీగుళ్ల కృష్ణమూర్తికి గతంలోనే బాధ్యతలు అప్పగించారు. తాజాగా, తీగుళ్లకు సన్నిహితుడైన వి.సుందర రామ శాస్త్రి అలియాస్ వీఎస్ఆర్ శాస్త్రిని టీ న్యూస్ కొత్త సీఈవోగా నియమించడం ఆసక్తికర పరిణామం. ఎందుకంటే ఆయనది ఆంధ్రా నేపధ్యం కాబట్టి.
ఈనాడులో ఉన్నత స్థానంలో పని చేసిన శాస్త్రి ఆ తర్వాత ఎన్టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన టీ న్యూస్ సీఈవో అయ్యారు. మీడియాలో చాలా చాల సీనియర్ ఆయన. వయసుకు తగ్గట్టే.. చాదస్తమూ ఎక్కువే అంటారు. అలాంటి వెటరన్ జర్నలిస్ట్‌ను టీ న్యూస్ సీఈవో సీట్లో కూర్చోబెట్టడంలో కేసీఆర్ లెక్క ఏమై ఉంటుందో? ఆంధ్రపై అక్కసు వెళ్లగక్కే టీ న్యూస్ పగ్గాలను ఆంధ్రా లేబుల్ ఉన్న వ్యక్తి చేతిలో పెట్టడం అనూహ్యం. ఇక, నమస్తే తెలంగాణ, టీ న్యూస్.. ఇద్దరు సీఈవోలు బ్రహ్మణ వర్గమే కావడం ఆసక్తికరం. మరోవైపు టీ న్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్‌గా చానల్‌లో కీ రోల్ ప్లే చేస్తున్న పి.వి.శ్రీనివాస్ లేటెస్ట్‌గా రాజీనామా చేశారు. ఆయనను ఎమ్మెల్సీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.