ఏపీలో ఆట మొదలైంది.. కమల దళంలోకి RRR?
posted on Nov 17, 2021 @ 4:17PM
కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఏపీ పై సంధించిన ఆకర్షణ అస్త్రం పని చేయడం మొదలైంది... వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, బీజేపీలో చేరేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. రఘురామ ఈ సంవత్సరం చివర్లో వైసీపీకి, పార్లమెంట్ సభ్యత్వాని రాజీనామా చేసి, డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి రోజున బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆ తర్వాత నెస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగే ఉపఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారాతెలుస్తోంది. నిజానికి, అమిత్ షా ఏపీ పర్యటనకు ముందే, ఆయన అభిమానులు ‘ట్రిపుల్ ఆర్’గా పిలుచుకుంటున్న రఘురామ కృష్ణంరాజు, పార్టీ ఎంట్రీకి సంబందించిన స్కెచ్ సిద్దమైందని తెలుస్తోంది. గతంలో చాలా కాలం క్రితమే ఆయన బీజేపీలో చేరేందుకు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా వద్ద సంసిద్ధతను వ్యక్త పరిచారు. అయితే, అప్పట్లో ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు అడ్డుపుల్లలు వేయడంతో ఆ ప్రయత్నం అప్పట్లో ఆగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం.
నిజానికి, రఘురామ కృష్ణం రాజు వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిననాటి నుంచి కమల దళంతో,కాషాయ కూటమి,సంఘ్ పరివార్’తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు.బీజేపీ నాయకులనే కాకుండా ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో అనేక సందర్భాలలతో సమావేసమయ్యారు అలాగే,అనేక సందర్భాలలో బీజేపీ హిందుత్వ ఎజెండాను తమనోటితో వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మత వివక్షకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి వెంకన్న స్వామి ఆస్తుల విక్రయానికి టీటీడీ చేసిన తీర్మానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతోనే రెబెల్ ఎంపీ రాజు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగతున్న మత ప్రచారం, మత మార్పిడులకు సంబంధించి, ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందజేశారు.
అదలా ఉంటే ఇంచుమించుగా ఒక సంవత్సరానికి పైగానే, ఆయన ప్రతి రోజు రచ్చబండలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. చురకలు అంటిస్తున్నారు. వాతలు పెడుతున్నారు. చివరకు దమ్ముంటే, తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించాలని, జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ కూడా, ఆయన్ని అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్’కు విజ్ఞప్తి చేసింది. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం రఘురామ పై కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. బైలు రాకుండా అడ్డుకుంది. అంతే కాదు, జైలులో చిత్ర హింసలకు గురిచేసిందని ఆయన కోర్టులో కేసు వేశారు.ఇలా జగన్ రెడ్డిపై ఓ వంక రాజకీయ పోరాటం, మరో వంక న్యాయపోరాటం చేస్తున్నారు.మొత్తానికి వార్తల్లో ఎంపీ గా అందరి నోళ్ళలో నలుగుతున్నారు. జగన్ రెడ్డికి పంతికిండి రాయిలా, కంట్లో నలుసులా ఇబ్బంది పెడుతున్నారు.
ఇక ఇప్పుడు, స్వయంగా అమిత్ షా ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళను పార్టీలోకి తెచ్చుకుని వారికి సముచిత స్థానం కలిపించాలని, ఆ విధంగా రాష్ట్రంలో బీజేపీని, 2024 ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బలోపేతంచేయాలని రాష్ట్ర నాయకులకు క్లాసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో.. అందుకు తొలి అడుగుగా ‘ట్రిపుల్ ఆర్’తో అమిత్ షానే శ్రీకారం చుట్టారని అంటున్నారు.
అయితే, రఘురామ రాకతోనే, రాష్ట్రంలో బీజేపీ రెండు బలమైన ప్రాతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలను ఎదిరించి అధికారం అందుకోగలుగుతుందా, అంటే అది అంత ఈజీ వ్యవహారం కాదని అంటున్నారు పరిశీలకులు.
అదెలాగున్నప్పటికీ, బీజేపీ, ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల ముందుగానే ఏపీ మీద దృష్టి పెట్టింది. అలాగే, పొరుగు తెలుగు రాష్రం తెలంగాణలోనూ కమల దళం కదులుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో బెంగాల్ ఫార్ములా అమలు చేసేందుకు బీజేపీ సిద్ధమైందని అంటున్నారు. మొతానికి ఏపీలో షా ఆట మొదలైంది.. కొత్త రాజకీయం మొదలైంది. ఇక ఇది ఏ మలుపు తిరుగుతుంది. ఎక్కడకు పోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.