టీడీపీకి భారీగా పెరిగిన ఓటింగ్.. వైసీపీలో గుబుల్..
posted on Nov 17, 2021 @ 4:18PM
"వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి బేతంచర్లలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి టీడీపీ తరఫున ఒక్క నాయకుడు లేడు. ఇన్‌ఛార్జిని నియమించి అభ్యర్థులను పోటీలో పెడితే ఆరు స్థానాలు గెలిచాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత వార్డులో వైసీపీ ఓడిపోయింది. ప్రజల్లో మార్పు మొదలైంది. 7 నెలల్లో టీడీపీకి 13శాతం ఓటింగ్ పెరిగింది. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.. మళ్లీ మీరు గెలిస్తే పార్టీ మూసేస్తాం" అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
డబ్బు, అధికారం, పోలీసులు, వాలంటీర్లను ఉపయోగించి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కుప్పంలో వైసీపీ గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, మంత్రులు, ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దొంగ ఓట్లు వేయించి గెలిచారని.. కుప్పంలో వైసీపీ గెలిచినట్టు కాదన్నారు అచ్చెన్న.
"విశాఖపట్నంలో మోసం చేసి గెలిచారు. దాచేపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరని ప్రగల్భాలు పలికారు. దాచేపల్లిలో అనేక ఇబ్బందులు పెట్టారు ఏమైంది? 11 వార్డుల్లో వైసీపీ గెలిస్తే, తొమ్మిది వార్డుల్లో టీడీపీ గెలిచింది. జగ్గయ్యపేటలో రీకౌంటింగ్ కోసం దౌర్జన్యం చేశారు. రెండు.. మూడు స్థానాల్లో ఫలితాలు తారుమారు చేశారు. ప్రజలు వైసీపీ వైపు ఉంటే ఎందుకు భయపడుతున్నారు?" అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.