తెలంగాణ రైతుకు దిక్కులేదు.. దేశమంతా సాయమట! కేసీఆర్ ఢిల్లీ డ్రామా ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, అధికారులను, వెంటపెట్టుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ఓ వంక రాష్ట్రంలో అకాల వర్షాలు, ఇతర సమస్యలతో ప్రజలు, ధాన్యం కొనే నాధుడు లేక రైతులు ఇబ్బడులు పడుతున్నారు. రైతులు అయితే ఆర్తనాదాలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే తెరుస్తున్నారు. కానీ,తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని అన్నట్లుగా, కేంద్రాలు తెరిచి కాంటా మరుస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి నెల రోజులు అయినా, ఇంకా పది శాతం ధాన్యం అయినా కొనలేదు అంటే, పరిస్థితి ఏమ్తితో వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఏమి ఆశించి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారో, ఏమో ఎవరికీ అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఓ వంక ముందు వానా కాలం పంట కొనండి మహప్రభో, ఆ తర్వాత యాసంగి పంట సంగతి చూద్దామని ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలు. ప్రజసంఘాలు, మరీ ముఖ్యంగా నెలల తరబడి, కొనుగోలు కేంద్రాల వద్ద పడి గాపులు పడుతున్న రైతులు కోరుతున్నారు. మరో వంక మఖ్యమంత్రి, యాసంగి లెక్కల కోసం, ఢిల్లీకి పయనమై వెళుతున్నారు. ఇదేమిటని, ప్రతి ఒకరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్త పరుస్తున్నారు. అయినా, ‘అయినను పోయి రావలె హస్తినకు...’ తరహాలో ముఖ్యమంత్రి మందిమార్బలంతో ఢిల్లీ పయనమయ్యారు. చిత్రం ఏమంటే, చేతికొచ్చిన వానాకాలం పంట కొనేనాధుడు లేక వానకు తడసి ముద్దవుతోందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు లబో దిబో మంటున్నారు. అయినా, వానాకాలం పంటను వానకు వదిలేసి ఇంకా విత్తనం అయినా పడని యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటుందో లేదో తాడో పేడో తెలుచుకునేందుకు ముఖ్యమంత్రి యుద్ద సన్నద్ధమై హస్తినకు బయలుదేరారు. ఇంకా,ఇతర డిమాండ్స్ అవీ ఇవీ సిద్ధం చేసుకుని వెళుతున్నా, ప్రధాన లక్ష్యం మాత్రం, యాసంగి ధన్యం కొలుగోలు లెక్కలు తేల్చుకోవడమే అని ముఖ్యమంత్రే స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
నిజానికి, కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట విషయంలోనే తప్పో ఒప్పో ఏదైనా ఒక స్పష్టత అయితే ఇచ్చిందనే పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో బాయిల్డ్ రైస్ గింజ కూడా కొనేది లేదని స్పష్టం చేసింది . రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామర్ధ్యానికి అనుగుణంగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తే అభ్యంతరం లేదని, అదే విధంగా ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నదున ప్రత్యాన్మాయ పంటలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపింది. అలాగే, యాసంగిలో సాధారణ ధాన్యం గోనుగోలుకు సంబంధించి, అన్ని రాష్ట్రాలతో సంప్రదించి ఏ రాష్ట్రం నుంచి ఎంతధాన్యం సేకరించేది ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎఫ్ సీ ఐ) నిర్ణయం తీసుకుంటుందని, కేంద్ర ఆహార మత్రిత్వ శాఖ అరటి పండు వలచి చేతిలో పెట్టింది. ‘గులాబీ పత్రికలు సహా పత్రికలు అన్నీ కూడా, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర స్పష్టంచేసిందని తాటికాయంత అక్షరాలతో వార్తను ప్రచురించాయి. సో.. యాసంగి అనేది ఇష్యూనేకాదాని పరిశీలకులు భావిస్తున్నారు. అయినా,ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోళ్ళ పై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని ఢిల్లీపికి దండయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి, ఈ గోల మొదలు కావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వానికి యాసంగి పంట మీద పూర్తి క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది కాబట్టే హుజూరాబాద్ ఓటమికి ముందే అప్పటి సిద్దిపేట కలెక్టర్, ‘వరి వేస్తే ఉరే’ అని సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు అందుకో ఇంకేందుకో గానీ, ఆయన్ని పిలిచి ఏమ్మేల్సీని చేశారు. అది వేరే విషయం అనుకున్నా, కేంద్రం స్పష్టత ఇవ్వలేదని చెప్పడం మాత్రం, అయితే ఆత్మ వంచన అవుతుంది, కాదంటే అలవాడుగా చెప్పిన అబద్ధం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ప్రస్తుత వర్షాకాల పంటకు సంబంధించి, రెండు నెలల క్రితమే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్ర స్పష్టం చేసింది . అదనంగా కొనాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన విషయంలో కేంద్ర పరిసీలిస్తామని మాత్రమె చెప్పింది కానీ హమీ ఇవ్వలేదు. సో.. సమస్యలు ఉన్నా ఇప్పుదు ఢిల్లీ వెళ్లి సాధించేది మాత్రం శూన్యం అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.రాష్ట్రంలో ఎదురవ్తున్న సంశయాల నుంచి తప్పించుకుపోయే ఎత్తుగదగానూ భావిస్తున్నారు. ఓ వంక ధాన్యం కొనేందుకు పైసలు లేవు.. ఈ నెల 4 న ప్రారంభం కావలాసిన దలిత బంధు 24 వతున్నా ఇంకా మొదలు కాలేదు. సో... అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ.. అన్నట్లుగా హస్తిన యాత్ర పెట్టుకున్నారని అంటున్నారు.
అలాగే, కేసీఆర్ ఢిల్లీ టూర్’కు వ్యక్తిగత కారణం కూడా ఉందని వినవస్తోంది. ముఖ్యమంత్రి సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారని, ఆ కారణంగా కూడా కొంతకాలం ఢిల్లీలో ఉండేందుకువీలుగా ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గల్ నుంచి వినవస్తోంది.
ఇదలా ఉంటే డిల్లీలో సాగు చట్టాల రద్దుకోసం సంవత్సర కాలంగా ధర్నా చేస్తున్న రైతుల వంక ఇంతకాలంలో ఒక్క సారైనా కన్నెత్తి చూడని కేసీర్ ఇప్పుడు ఆ ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 3లక్షల వంతున తెలంగాణ ప్రజల సొమ్మును నష్ట పరిహారంగా ప్రకటించారు.నిజానికి, రాష్ట్ర్రంలో కనీసం నష్ట పరిహారానికి నోచుకోని, తెలంగాణ అమరుల కుటుంబాలే 800 పై చిలుకు ఉన్నాయి, ఒకటికి వందసార్లు, 1200 మంది తెలంగాణ బిడ్డలు అతమబలిదానం చేసారని చెప్పుకుని, వారి త్యాగాల ఫలంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయింది. అయినా ఈ ఏడేళ్ళ కాలంలో అధికార లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 750 మందికి పైగా రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు, ఇంకా ఎందరో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేస్కున్నారు... ఇందులో ఎవరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదు. అయిన ‘అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డాణం చేయిస్తా అన్నట్లుగా,ఉత్తరాది రైతులకు నష్ట పరిహారం ఇస్తాననడం మరింత విడ్డూరంగా ఉందని అంటున్నారు.