వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ ముఖ్య అనుచరుడు అరెస్ట్!
posted on Nov 17, 2021 @ 1:50PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పులివెందులకు చెందిన శంకర్ రెడ్డి అనారోగ్య కారణం వల్ల రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్పటల్‌లో ఆయనను సీబీఐ బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి శంకర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఆయన పేరు ఉంది. దీంతో టీడీపీ కూడా శంకర్ రెడ్డిని టార్గెట్ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్రా గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి తన స్టేట్ మెంట్ లో చెప్పాడని టీడీపీ అదికార ప్రతినిధి పట్టాభి చెప్పారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత దస్తగిరి సహా పలువురు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని, అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని హామీనిచ్చిట్టు శంకర్ రెడ్డి భరోసా ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నట్టు తెలిపారు. ఆ తర్వాత కూడా దస్తగిరి మరో కీలక విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లు రాజా రెడ్డి హాస్పిటల్‌లో రక్తపు మరకలను కడిగినట్టు వాంగ్మూలంలో చెప్పారని అన్నారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత పేరుతో ఉన్న రాజారెడ్డి హాస్పిటల్‌కే ఎందుకు వెళ్లారో చెప్పాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అక్కడైతే అందరూ తమ వారే ఉంటారు కాబట్టి.. భయపడాల్సిన పని ఉండదని అక్కడి వెళ్లినట్టే కదా అని పట్టాభి ఆరోపించారు.
శంకర్ రెడ్డి మరెవరో కాదని, కడప ఎంపీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆప్తుడైన వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడని టీడీపీ నేత పట్టాభి అన్నారు. అంతేకాదు, వివేకా హత్య జరిగిన రోజు సంఘనా స్థలికి చేరుకుని సాక్ష్యాలను వీరిద్దరే అంటే అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలే తారుమారు చేశారని ఆరోపించారు.వివేకా హత్య జరిగినప్పుడు సాక్షి మీడియా దాన్ని గుండెపోటుగా చిత్రించిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేర్కొన్నారు. సాక్షి మీడియాకు వివేకా గుండె పోటుతో మరణించాడని చెప్పింది కూడా శంకర్ రెడ్డే అని తెలిపారు. ఈ విషయాన్ని సునీత పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జగన్ మీడియా చేసిందని ఆరోపించారు.