దొంగ ఓట్లతో గెలిచి సంబరమా!
posted on Nov 17, 2021 @ 3:45PM
ఏపీలో జరిగిన నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ముగిసింది. టీడీపీ అదినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో అనూహ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో జగన్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
కుప్పం ఫలితంపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తొలిరోజు నుంచి కుప్పంలో వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చేతకాని ఎన్నికల సంఘం టీడీపీ ఓటమికి కారణమని విమర్శించారు. పోలీసు వ్యవస్థ వైసీపీకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో నైతిక గెలుపు టీడీపీదే అన్నారు అచ్చెన్నాయుడు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పెద్దిరెడ్డి దొంగ ఓట్ల మంత్రి అని దుయ్యబట్టారు. పక్కనున్న నియోజకవర్గాల నుంచి పెద్దిరెడ్డి దొంగ ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజాదరణను కోల్పోయిందని... ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగితే వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అచ్చెన్నాయుడు చెప్పారు.