వరదల్లోనూ కక్ష రాజకీయాలా..! అర్ధరాత్రి కూన రవికుమార్ అరెస్ట్..
posted on Nov 21, 2021 8:15AM
ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి లక్షలాది మంది జల దిగ్బంధంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వరద సహాయక చర్యలపై దృష్టి సారించాల్సిన జగన్ సర్కార్... అది చేయకుండా టీడీపీ నేతలను టార్గెట్ చేయడంపైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించించారు..అర్థరాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ సోదరి ఇంట్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి, ఓ హై డ్రామా మధ్య అరెస్టు చేశారు.
శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై దురుసుగా వ్యవహరించారని.. కూన రవికుమార్ పై టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు సమాచారం. కూర రవికుమార్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట పోలీసులు దౌర్జన్యం చేశారని, దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. వరదలతో జనాలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్ముళ్లు.