ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి..

ముఖ్యమంత్రి కాన్వాయ్.. అత్యంత భారీ భద్రత మధ్య ముందుకు సాగుతోంది. సీఎం కాన్వాయ్ వస్తుందంటే రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేస్తారు. సీఎం కాన్వాయ్ దగ్గరకు వెళ్లడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాని భారీ భద్రత ఉండే ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. అతి దగ్గరగా వెళ్లి కోడిగుడ్లు విసిరారు. సీఎం కాన్వాయ్ పై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ శాఖను షేక్ చేస్తోంది.  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్‌ వద్ద ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్‌ మమతా మెహర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్‌ మిశ్రా సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి. సీఎం కాన్యాయ్‌పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్‌ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్‌ను కేబినెట్‌ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.   గ్రేటర్ లో బీజేపీ బిగ్ ఫైట్.. సీపీకీ కేటీఆర్..  

జగన్ ఉపసంహరణ వెనక పీకే వ్యూహం?

మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉప సంహరించుకున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే చర్చ జోరుజి సాగుతోంది. ఇటు రాజకీయ మీడియా వర్గాల్లో, అటు మేథావి, న్యాయనిపుణులు, న్యాయవాదులలో ఇదే విషయంపై అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చలలో విభిన్న  వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ఉపసంహరణ నిర్ణయంలో రాజధాని  సమస్య జటిలమవుతుంది అనే విషయంలో ఇంచుమించుగా ఏకాభిప్రాయమే వినవస్తోంది. సమీప భవిష్యత్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదన్నవాదన బలంగా వినిపిస్తోంది.   నిజానికి, మూడు రాజధానుల చట్టం, ఉప సహరణ ప్రకటనతో, ముఖ్యమంత్రి రాజధాని కథను మళ్ళీ మొదటికి తెచ్చారు. మరింత జటిలం చేశారు. అయోమయం, గందరగోళం సృష్టించారు. రాష్ట్రన్ని మరింత నవ్వులపాలు చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజధాని కలను కొన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టేశారు., ఈ ‘ఉత్తుత్తి’ ఉపసంహరణతో ఏపీ నిర్దిష్ట రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మిగిలి పోతుంది ... మీడియా చర్చల్లో,సోషల్ మీడియా ఇలా ఎవరికి వారు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.అలాగే, సమీప భవిష్యత్’లో రాజధాని కల సాకారం అయ్యే అవకాశమే లేదని న్యాయనిపుణులు అంటున్నారు. పాత కొత్త చిక్కుముళ్ళన్నీ విప్పుకుని రాజధాని, (అది ఎక్కడైనా కానీ,) మళ్ళీ ముడి పడి పట్టాల మీదకు రావడం  ఇప్పట్లో కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న, ఉప సంహరణ నిర్ణయం ఉద్దేశం ఉప సంహరణ కాదు. ఇదొక ఎత్తుగడ. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించిన కుట్ర పూరిత ఎత్తుగడగానే చూడవలసి ఉంటుదని ఇటు ప్రతిపక్షాలు, అటు న్యాయ, రాజ్యాంగ నిపుణులు  అంటున్నారు. వివాద చట్టాల మీద కోర్టులో దాఖలైన కేసుల విచారణ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంల తీసుకున్న,ఇలాంటి నిర్ణయం కుట్రపూరిత నేరంగా భావించినా తప్పు లేదని న్యాయపోరాటంలో ప్రత్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయవాదులు అభిప్రాయ పడుతున్నారు. ఉపసంహరణ నిర్ణయం పై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే’ విధించే అవకాశంతో పాటుగా, విస్తృత ధర్మాసనానికి నివేదించే అవకాశాలను కూడా కొట్టి వేయలేమని అంటున్నారు.   నిజానికి జగన్ రెడ్డి కూడా అదే కోరుకుంటున్నారా, మూడు రాజధానుల వివాదంతో ముడిపడిన వికేంద్రీకరణ, ‘మహా మత్రం’ తోనే 2024 ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారా? అందుకేనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టారా? వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయంగా జనంలోకి తీసుకువెళ్లేందుకే, తేనే తుట్టెను కదిల్చారా? అందుకే రద్దు బిల్లు సభలో ప్రవేశ పెట్టిన సమయంలో చేసిన ప్రకటనలో రాజకీయ మంత్రాలను జోడించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంత్రి సభలో చేసిన ప్రకటనలో “వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానుల బిల్లు లోని ప్రభుత్వ సదుద్దేశాలను విపులంగా వివరించేందుకు, అన్ని ప్రాంతాల ప్రజలకు విస్తృతంగా వివరించేందుకు, ఇంతకు ముందు తెచ్చిన చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందిని, ఈ అన్నిటితో కొత్త బిల్లును తీసుకొస్తుందని,  చెప్పు కొచ్చారు.  అంటే, ఎన్నికలకు ముందుగానే మూడు రాజధానులకు అన్నిప్రాంతాల ప్రజల ఆమోదం పొందేందుకు, మరో మారు జనంలోకి వెళ్ళే ఆలోచన ముఖ్య మంత్రి  చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే, అందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ సలహా మేరకు ముఖ్యమంత్రి మరో ప్రజాయాత్రకు సిద్దమవుతున్నారంటూ వస్తున్న వార్తలు సమాధానంగా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని వివాదాన్ని ఎన్నికల అంశం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.  ముఖ్యమంత్రి,మొదటి నుంచి మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికలతో  ముడిపెట్టే చూస్తున్నారు. ప్రస్తుత సందర్భంలో  మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాం, అంటూ 2019లో ఎన్నిక‌ల‌లో కూడా తమ పార్టీది  అదే స్టాండ్ అని పచ్చి అబద్ధాన్ని పబ్లిక్’గా అది కూడా శాసన సభలో చెప్పారు. 2019 ఎన్నికల్లోనే మూడు రాజ‌ధానుల‌కు ప్రజలు ఆమోద ముద్ర వేశారని ముఖ్యమంత్రి హౌస్’లో అబద్ధం చెప్పారు. సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక విధంగా బ్రీచ్ అఫ్ ప్రివిలేజ్’ కు పాల్పడ్డారు.   2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా, జగన్ రెడ్డి అమ‌రావ‌తికి జై కొట్టారనేది జగమెరిగిన సత్యం.  అసలు అప్పటికి మూడు రాజధానుల ముచ్చట ఎక్కడా రాలేదు. జగన్ రెడ్డి సహ ఎవరూ ప్రస్తావించ లేదు. శాసనసభలో కూడా ప్రతిపక్ష  నేత హోదాలో జగన్ రెడ్డి అమ‌రావ‌తికి మ‌ద్ద‌తిస్తున్నామ‌ని చెప్పారు. 33వేల ఎక‌రాలు చాల‌వ‌ని.. ఇంకా భూసేక‌ర‌ణ చేయాలంటూ అమరావతికి అనుకూలంగా మాట్లడారు. ఇది అసెంబ్లీ రికార్డుల సాక్షిగా నిజం. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధాని అని కుండ బద్దలు కొట్టారు. ఈ నేపధ్యంలో అసలు సమస్యలు అన్నీ పక్కకు పోయి ... మూడు రాజధానులు, వికేంద్రీకరణ ప్రధాన ఎన్నికల అస్త్రంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, అనేది ఇప్పుడు తెరపైకొచ్చిన తాజా ప్రశ్న. ఇందుకు సంబందించి, ప్రశాంత్ కిశోర్ బృందం ఇప్పటికే సర్వే కూడా చేసిందని, అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి మూడు రాజదానుల చట్టం  ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వారెవా.. స్మార్ట్‌సిటీలో స్మార్ట్ లైబ్ర‌రీ అదుర్స్‌..

లైబ్ర‌రీ. గ్రంథాల‌యం అంటే ఎట్టా ఉంటాదో తెలుసుగా. ఏవో కొన్ని ప్ర‌ముఖ ప్రాంతాల్లో, ప్ర‌ముఖ గ్రంధాల‌యాలు మిన‌హా మిగ‌తా అన్నిటి దుస్థితి చెప్ప‌త‌రం కావు. పాత భ‌వ‌నాలు.. చీక‌టి గ‌దులు.. రంగులు వెల‌సిన గోడ‌లు.. విరిగిన కుర్చీలు.. అవిఇవి కొన్ని పుస్త‌కాలు. చాలాచోట్ల‌ లైబ్ర‌రీ అంటే చాలా మామూలుగా ఉంటుంది. పేరుకే గ్రంథాల‌యం.. గ్రంధాల మాటే ఉండ‌దు. కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ బుక్స్‌.. కొన్ని మ్యాగ్జిన్స్‌.. అన్నిర‌కాల‌ న్యూస్ పేప‌ర్స్‌. లైబ్ర‌రీ అంటే ఇంతే. అస‌లు సిటీలో లైబ్ర‌రీ ఎక్క‌డుందో కూడా చాలా మందికి తెలీదు. లైబ్ర‌రీకి వెళ్లేవారు.. బుక్స్ చ‌దివే వారు త‌క్కువే ఉంటారు. అయితే, అన్ని గ్రంథాల‌యాలు అలా కాదు. కొన్ని స‌ర‌స్వ‌తీ నిల‌యాలు అయితే.. మ‌రికొన్ని సంథింగ్ స్పెష‌ల్‌. ఆ కోవ‌లో చేరింది వరంగ‌ల్ రీజ‌న‌ల్ లైబ్ర‌రీ.  వ‌రంగ‌ల్ న‌గ‌రం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేయ‌బ‌డింది. కేంద్రం భారీగానే నిధులు కుమ్మ‌రించింది. కొన్నేళ్లుగా వ‌రంగ‌ల్ సుంద‌రీక‌ర‌ణ‌, వ‌స‌తులు, సౌక‌ర్యాల క‌ల్ప‌న జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే.. వ‌రంగ‌ల్‌లో ఉన్న రీజ‌న‌ల్ లైబ్ర‌రీని ఇలా అందంగా తీర్చి దిద్దారు. అదిరిపోయేలా పెయింటింగ్ వేశారు. చూస్తే.. ఎవ‌రైనా అవాక్క‌వ్వాల్సిందే.  లైబ్ర‌రీ బిల్డింగ్ బ‌య‌టి గోడ‌ల‌కు ఇలా పుస్త‌కాల బొమ్మ‌లు వేశారు. ఓ చిన్నారి కూర్చొని.. చేతిలో పుస్త‌కం ప‌ట్టుకొని చ‌దువుతున్న‌ట్టు పెయింటింగ్ వేశారు. ఆ పుస్త‌కాల చిత్రాలు సైతం చాలా ప‌క్కాగా గీశారు. నిజ‌మైన బుక్‌లో అక్ష‌రాలు, టైటిల్స్ ఎలా ఉంటాయో.. పెయింటింగ్‌లోనూ అచ్చం రియ‌ల్ బుక్ త‌ర‌హాలోనే డీటైల్డ్‌గా రంగులు వేశారు. లైబ్ర‌రీ బిల్డింగ్ గోడ‌ల చుట్టూ.. పుస్త‌కాల అర‌లు, అందులో బుక్స్ ఉన్న‌ట్టు చాలా చ‌క్క‌గా గీశారు. రాత్రి వేళ సైతం ఆ లైబ్ర‌రీ బిల్డింగ్‌, బుక్స్ పెయింటింగ్ అందంగా క‌నిపించేలా స్మార్ట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు.  వ‌రంగ‌ల్‌-హ‌న్మ‌కొండ మెయిన్‌రోడ్డుపై ఉండే ఈ లైబ్ర‌రీ బిల్డింగ్‌.. ఇప్పుడు అటువైపుగా వెళుతున్న వారంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తోంది. దాదాపు అర శ‌తాబ్దంగా లైబ్ర‌రీ ఉన్నా.. ఈనాటికి ఇక్క‌డో లైబ్ర‌రీ ఉన్న‌ట్టు అంద‌రికీ తెలిసొస్తోంది. సిటీలో ఇంత మంచి గ్రంథాల‌యం ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. లైబ్ర‌రీ బిల్డింగ్ ముందు సెల్ఫీలు దిగుతున్నారు. స్మార్ట్‌సిటీలో స్మార్ట్ లైబ్ర‌రీ.. ప‌బ్లిక్‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.  NOTE : తెలుగువ‌న్ వెబ్‌సైట్‌లో గ్రంథాల‌యం ఆప్ష‌న్ ఉంది. ఇందులో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ల ర‌చ‌న‌లు చాలా ఉన్నాయి. పుస్త‌క ప్రియులు, సాహిత్య అభిలాషులకు ఉప‌యుక్తంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న‌వారు ఒక‌సారి చెక్ చేయండి.  https://www.teluguone.com/grandalayam/

ఉత్త మాటలేనా.. పోరాటం లేదా! ఢిల్లీలో కేసీఆర్ హ్యాండ్సప్.. 

అంతన్నారు.. ఇంతన్నారు.. తాడేపేడో తేల్చుకుంటానన్నారు.. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తానన్నారు... తెలంగాణ ఉద్యమ గర్జన చూపిస్తానంటూ ఢిల్లీ ఫ్లైటెక్కారు.. సీన్ కట్ చేస్తే నాలుగు రోజులు మకాం వేసి.. ఎవరినీ కలవకుండానే ఉత్త చేపులతో ఊపుకుంటా తిరిగి హైదరాబాద్ ఫ్లైటెక్కేశారు.. ఇంతకూ ఆయన హస్తన వెళ్లిందేందుకు.. పోరాటం ఎక్కడ పోయింది..నాలుగు రోజులు సైలెంటుగాన్ ఎందుకు ఉన్నట్లు.. ఇదో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇంతవరకు పైన చెప్పిదంతా ఎవరి గురించో అర్ధమైందంనుకుంటాను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, జల వివాదం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీతో తాడో పేడో తెల్చుకుంటానంటూ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్. తనతో కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలను తీసుకెళ్లారు. కాని  ఢిల్లీ పర్యటనలో నాలుగు రోజులూ  ఇంట్లోనే ఉన్నారు కేసీఆర్. ఆదివారం సాయంత్రం  ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి .. బుధవారం తిరిగి బయలుదేరే వరకు ఢిల్లిలోని తన నివాసమైన 23 తుగ్లక్ రోడ్ లోనే ఉన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్న కేసీఆర్ ఎవరినీ కలవలేదు.   మంగెళవారం సాయంత్రం కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి తోమర్ తో కేవలం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. అయితే తెలంగాణ బృందానికి కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. అయినా  కేసీఆర్ కేంద్ర మంత్రితో సమావేశం కాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం లేదు. బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీని కలిశారు. మంగళవారం మోడీ అపాయింట్ మెంట్ కోరడంతో పీఎంవో ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చింది.  కానీ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఎందుకు రాలేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.  రాష్ట్రంలో పండిన మొత్తం వడ్లను కేంద్రమే కొనుగోలు చేయలని, కృష్ణా, గోదావరి జలాల పునః పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునళ్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రాజెక్టులకు పర్మిషన్‌‌ పై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికే ఢిల్లీకి వెళ్తున్నానని కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ అంశాల్లో ప్రధానిపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ను కేసీఆర్‌‌ కలవాలని షెడ్యూల్‌‌ రూపొందించుకున్నారు. షెకావత్‌‌ జోధ్‌‌పూర్‌‌లో ఉండటంతో ఆయన్ను కలవడం సాధ్యం కాలేదు. ప్రధాని ఢిల్లీలోనే ఉన్నా కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నది తేలడం లేదు.  అయితే ప్రధాని మోడీని కేసీఆర్ కలవకపోవడంపై మరో చర్చ కూడా సాగుతోంది.  అసలు  కేసీఆర్ మోడీ అపాయింట్ మెంట్ అడగలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ఆరోగ్యం బాగాలేక  ఢిల్లిలోని ఎయిమ్స్ లో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు తప్ప.. రాష్ట్ర సమస్యలపై కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానని వెళ్లిన కేసీఆర్.. ఎవరినీ కలవకుండా తిరిగి రావడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులపై కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గొప్ప గొపప్ ప్రకటనలు చేశారని మండిపడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలని,యాసంగిలో వరి ధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  జగన్ ఉపసంహరణ వెనక పీకే వ్యూహం?

జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ పోరుబాట.. విశాఖ జిల్లాలో తీవ్ర‌ ఉద్రిక్తత..

టీడీపీ నేత‌లు రోడ్డెక్కారు. ఎప్ప‌టిలానే పోలీసులూ వ‌చ్చేశారు. తెలుగుదేశం నాయ‌కులు నిర‌స‌న ర్యాలీకి సిద్ధ‌మ‌య్యారు. య‌ధావిధిగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ లీడ‌ర్లు అయ్య‌న్న‌పాత్రుడు, వంగ‌ల‌పూడి అనిత‌లు రోడ్డుపైనే బైఠాయించారు. ఖాకీల‌తో తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. న‌ర్సీప‌ట్నం అట్టుడికిపోయింది.  విశాఖ జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత త‌లెత్తింది. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిరసన  ప్రదర్శన చేపట్టాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. ర్యాలీకి అనుమతించని పోలీసులు మార్గ మధ్యలోనే తెలుగుదేశం నేత‌ల‌ను అడ్డుకున్నారు.   పోలీసు వలయాన్ని దాటుకుని అయ్యన్నపాత్రుడు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. దీంతో  అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపైనే ధర్నాకు దిగారు.  నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అయ్యన్నకు మద్దతుగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు, పలువురు సీనియర్ నాయ‌కులు ఆందోళనలో పాల్గొన్నారు. టీడీపీపై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అనుచిత ధోర‌ణిపై అంతా మండిప‌డ్డారు.   

గ్రేటర్ లో బీజేపీ బిగ్ ఫైట్.. సీపీకీ కేటీఆర్ కంప్లైంట్ 

ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వెళుతోంది బీజేపీ. గ్రేటర్ హైద్రాబాద్‌లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య  వార్ నడుస్తోంది. జీహెచ్ఎంసీలో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు హంగామా చేశారు. మేయర్ చాంబర్ లోకి చొరబడి విధ్వంసం స్పష్టించారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సీఎం కేసీఆర్ ఫోటోలను తీసి పడేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్లకు తాలిబన్లకు తేడా లేకుండా పోయిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి మండిపడ్డారు.  తాజాగా జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రవంగా స్పందించారు. బీజేపీకి చెందిన కొందరు పోకిరీలు, దుండగులు.. జీహెచ్ఎంసీ కార్యాలయపై దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేట‌ర్లు రౌడీలు, గుండాల్లా వ్య‌వ‌హ‌రించారని ఆయన ట్వీట్ చేశారు. గాడ్సే భ‌క్తులు గాంధీ మార్గాన్ని అనుస‌రిస్తార‌ని ఎలా అనుకుంటారని ట్వీట్టర్ ద్వారా విమర్శించారు కేటీఆర్. ఈ ఘ‌ట‌న‌పై చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సీపీకి విజ్ఞ‌ప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేసిన ప్రాంతంలో పాలతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు గులాబీ కార్పొరేటర్లు.  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత సారధ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ బోర్డుకు పాలాభిషేకం చేసి, మేయర్ ఛాంబర్ వద్ద శుద్ధి నిర్వహించారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ మేయర్ కు వినతి పత్రపత్రం ఇచ్చారు. విధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు ఈ సందర్భంగా శ్రీలతా రెడ్డి చెప్పారు. బహుజన మహిళ  మేయర్‌గా ఉండడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. మేయర్ కార్యాలయంలో ఉన్నది ప్రభుత్వ ఆస్తి అని, దానిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు శ్రీలతా రెడ్డి. 

ఏ ‘రాజధాని’ అభివృద్ధికి ఏపీ రుణం?

ఆంధ్రప్రదేశ్ ఖజానాలోని నిధులను ఇష్టం వచ్చినట్లు వాడేసింది జగన్ రెడ్డి సర్కార్. ఖజానాను గుల్ల చేసేసింది. అధికారులను భయపెట్టి అన్ని ప్రభుత్వ విభాగాల్లోని నిధులను కూడా లాగేసుకుంది. గ్రామ పంచాయతీ ఖాతాలనూ జీరో చేసేసింది. గ్రామపంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిధులతో కూడా కరువు తీర్చుకోవాలని చూసింది. అయినప్పటికీ రాష్ట్ర సర్కార్ రోజువారీ ఖర్చులకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితితోకి జారిపోయింది. ఇవన్నీ ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో.. అసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియని స్థితిలో ‘రాజధాని అభివృద్ధి’ పేరిట 50 వేల కోట్ల రూపాయలు కావాలంటూ ప్రపంచబ్యాంకుకు టెండర్ వేసేందుకు యత్నించడం అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. రాజధాని అంటే అది అవరావతా? లేక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైసీపీ సర్కార్ చెబుతున్న విశాఖా? అదీ కాకపోతే న్యాయ రాజధాని అని తెరపైకి తెచ్చిన కర్నూలా? అనే దానిపై ఎలాంటి స్పష్టతా లేకపోవడం గమనార్హం. అసలు ఏ రాజధానిని ఏపీ సర్కార్ అభివృద్ధి చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఏపీ సర్కార్ చీటికీ మాటికీ ‘ఓవర్ డ్రాఫ్ట్’ అంటూ పరుగులు పెడుతోంది. నిధుల కోసం ఆర్థిక మంత్రి తరచూ ఢిల్లీలో కేంద్ర పెద్దల ముందు మోకరిల్లుతూనే ఉన్నారు. అప్పు కోసం వారం వారం ఆర్బీఐ వద్ద ఏపీ ప్రభుత్వం దేబిరిస్తూనే ఉంది. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం పెడుతోంది. అప్పు ఇవ్వండి మహాప్రభో! అంటూ బ్యాంకులను వేడుకుంటోంది. అయినా పని కాకపోవడంతో.. ఏకంగా ప్రపంచబ్యాంకుకు 50 వేల కోట్లకు టెండర్ వేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అయిపోయింది. ఏ రాజధాని అభివృద్ధి కోసం ఇంత రుణం అవసరమో.. ఒకవేళ ప్రపంచబ్యాంకు అప్పు ఇస్తే.. నిజంగా అభివృద్ధి కోసమే ఆ డబ్బులు ఖర్చు చేస్తారా? లేదంటే అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఏదో రకంగా అప్పు తెచ్చుకోవడమే ఏపీ సర్కార్ లక్ష్యం. అది సక్రమమా? లేక అక్రమమా అనేది జగన్ సర్కార్ పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. అన్ని పరిమితులూ దాటేసి, అప్పు పుట్టని పరిస్థితికి వెళ్లింది. ఇక పూట గడవని దుస్థితిలోకి జారుకుంది. స్థానికంగాను, జాతీయ స్థాయిలోనూ ఏపీ సర్కార్కు చిల్లి గవ్వ కూడా అప్పు పుట్టడం లేదు. ఈ క్రమంలో జగన్ సర్కార్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై కన్నేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు అనేక షరతులు పెట్టి మరీ అప్పు ఇస్తుంది ప్రపంచబ్యాంకు. ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయల రుణం కావాలంటూ ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు చేసింది. ఏపీ సర్కార్ వినతికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందని సమాచారం. ఏపీ సర్కార్ ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ‘రాజధాని నగరాభివృద్ధి’ పేరిట రుణ ప్రతిపాదనను జగన్రెడ్డి సర్కార్ తెరపైకి తేవడం ఆశ్చర్యం కలిగించకమానదు. ఎందుకంటే.. రాజధాని అమరావతి అభివృద్ధికి అప్పు కోసం ప్రపంచ బ్యాంకును టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. రైతుల ముసుగులో వైసీపీ నేతలు రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేయడం గమనించాల్సిన విషయం. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో స్వయంగా పర్యటించి, అంతా సక్రమమే అని సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ.. ప్రపంచ బ్యాంకు షరతులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ నాటి టీడీపీ ప్రభుత్వం రుణ ప్రతిపాదనను విరమించుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడూ ప్రపంచ బ్యాంకును రుణం కావాలని అడగకపోవడం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వైసీపీ అధికారంలోకి రాగానే ‘రాజధాని అభివృద్ధి’ అంటూ ప్రపంచ బ్యాంకును 50 వేల కోట్ల రుణం ఏ ముఖం పెట్టుకుని అడిగిందనేది జవాబులేని ప్రశ్న. రాజధాని మౌలిక సదుపాయాలకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే నెపం చూపించి అమరావతిని అటకెక్కించింది జగన్ సర్కార్. పరిపాలన వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీ ఆమోదించి రెండేళ్లయిన తర్వాత అవి సమగ్రంగా లేవంటూ ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో రాజధాని అభివృద్ధి పేరిట ప్రపంచ బ్యాంకు నుంచి రుణం కోసం ఏపీ సర్కార్ యత్నించడం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. పథకాల నిధులు దారి మళ్లించడంలో, తప్పుడు లెక్కలు చూపించడంలో ఆరితేరిన జగన్ సర్కార్ ఆర్థిక అంశాల విషయంలో విశ్వసనీయత కోల్పోయిందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరైతే ఆ నిధులను రాజధాని అభివృద్ధి కోసమే వినియోగిస్తారా? అనే సందేహం వారు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ఎన్నో అప్పులు, పలు శాఖల్లోని నిధులు లాగేసుకున్న వైసీపీ సర్కార్ కోర్టుల్లో డిపాజిట్లనూ తీసేసుకుంది. ఏపీలో విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రపంచ బ్యాంకు గతంలో ఇచ్చిన నిధులను దారి మళ్లించింది. దీనిపై ప్రపంచ బ్యాంకు సీరియస్గానే స్పందించింది. కేంద్రంతోనే నేరుగా తేల్చుకుంటానంటూ లేఖ కూడా రాసింది. గ్రామీణ రోడ్ల ప్రాజెక్టుకు ఏఐఐబీ ఇచ్చిన నిధులను తరలించుకుపోయింది. దాంతో తర్వాతి వాయిదా చెల్లింపులను ఏఐఐబీ నిలిపేసిన అంశం గమనార్హం. ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రుల కోసం కేంద్రం ఇచ్చిన నిదులను కూడా వైసీపీ సర్కార్ పక్కదారి పట్టించింది. దీనిపై ఆగ్రహించిన కేంద్ర కార్మిక శాఖ ఏపీ సర్కార్కు లేఖ రాసింది. రాజధాని నగరం ఏదో ఇప్పటికీ తేల్చని జగన్రెడ్డి సర్కార్ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తుంది? ఆ నిధులను నిజంగా అభివృద్ధి కోసమే వినియోగిస్తుందా? లేదంటే యధాప్రకారం వాటిని వేరే అవసరాలంటే పట్టుకుపోతుందా? అనే అనుమానాలకు జవాబు లభించని అంశంగా మారింది. జగన్ ఉపసంహరణ వెనక పీకే వ్యూహం?  

ఆ న‌లుగురికీ మ‌రింత‌ భ‌ద్ర‌త.. అంటే, మ‌రింత రెచ్చిపొమ్మ‌నేనా?

తిట్టిందీ వారే. నోటికొచ్చిన‌ట్టు వాగిందీ వారే. అస‌భ్య ప‌ద‌జాలం వాడిందీ వారే. అవ‌మానించిందీ వారే. అవ‌హేళ‌న చేసిందీ వారే. చంద్ర‌బాబును వెక్కి వెక్కి ఏడ్చేలా చేసిందీ వారే. ఉక్కుమ‌నిషి గుండెకు లోతైన‌ గాయం చేసిందీ వారే. ఇంతా చేసి.. అంతగా ర‌చ్చ చేసి.. ఇప్పుడు వారే బాధితుల‌న్న‌ట్టు చేశారు. ఏడిపించిన వారిపైనే సింప‌తీ చూపిస్తున్నారు. ఆ న‌లుగురికి భ‌ద్ర‌త మ‌రింత పెంచారు. ఎందుకు? మ‌రింత సెక్యూరిటీ క‌ల్పిస్తాం.. మీరు చంద్ర‌బాబుపై మ‌రింత రెచ్చిపోండ‌ని ఎంక‌రేజ్ చేసేందుకా? అంటున్నారు. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబు కుటుంబంపై.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ఆవేద‌నా వ్య‌క్తం అయింది. ఇదే అదునుగా.. ఆ వ్య‌తిరేక‌త‌ను సాకుగా చూపిస్తూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ, అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిల‌కు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్ర‌భుత్వం. చంద్రబాబుపై వ్యాఖ్యల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ఆ న‌లుగురికి బెదిరింపులు వచ్చినట్టు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని.. అందుకే సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమీక్షించి.. వారికి భ‌ద్ర‌త పెంచుతూ నిర్ణ‌యం తీసుకుందని ప్ర‌భుత్వం తెలిపింది.  మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లకు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత క‌ల్పించింది ప్రభుత్వం. నాని కాన్వాయ్‌లో అదనంగా మరో సెక్యూరిటీ వెహికిల్ కూడా కల్పించింది. ఇకపై కొడాలి నానికి 7+7 భద్రత ఉండనుంది. మరోవైపు.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్‌మెన్‌లతో పాటు అదనంగా 3+3 గన్‌మెన్ భద్రతను ఇచ్చింది. ఇకపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు 4+4 భద్రత ఉండనుంది.  ప్ర‌తిప‌క్ష నేత‌పై లేనిపోని నీలాప‌నింద‌లు వేసిన వారిని మామూలుగా అయితే క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. కేసులు పెట్టి విచార‌ణ జ‌రపాలి. చ‌ట్టం ముందు నిల‌బెట్టాలి. కానీ, అధికారం వారి చేతిలోనే ఉంది కాబ‌ట్టి.. దాన్ని ఇలా వాడేసుకుంటున్నారు. చెత్త‌ ఆరోప‌ణ‌లు కూసిన ఆ న‌లుగురికి మ‌రింత సెక్యూరిటీ క‌ల్పించి.. జ‌గ‌న‌న్న పాల‌నంటే ఇలానే ఉంటుంద‌ని మరోసారి నిరూపించారు. న‌వ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్న‌ట్టు ఉంది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ తీరు..అంటున్నారు.

ఏపీలో వరద నష్టం ఎంతో తెలుసా... కేంద్రం నుంచి జగనన్న ఏమైనా తెచ్చేనా?

కుండపోత వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వరద బీభత్సం స్పష్టించింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వరద పెను విలయానికి కారణమైంది. ఈ మూడు జిల్లాల్లో గతంలో ఎప్పుడు లేనంతగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వరదలకు 40 మంది చనిపోగా.. స్థానికులు మాత్రం వంది మందికి పైగానే చనిపోయారని తెలుస్తోంది. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వేలాది కిలోమీటర్ల రహదారులు అడ్రస్ లేకుండా పోయాయి. కల్వర్టులు, వంతెనలు కొట్టుకుపోయాయి. వేల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. వర్షాలు తగ్గి నాలుగైదు రోజులవుతున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో నీటిలోనే ఉన్నాయంటే ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో ఊహించవచ్చు.  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన పొందుపరిచారు. భారీ వర్షాలతో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు. టెంపుల్ టౌన్ తిరుపతి అతలాకుతలమైందని ఆయన గుర్తు చేశారు. రెండు హెలికాప్టర్లు, 17 ఎన్డీఆర్ఎఫ్ఎ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలను చేపట్టామని చెప్పారు. భారీ వర్షాల ధాటికి 40 మంది చనిపోయారని తన లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.  196 మండలాల్లోని 1,402 గ్రామాల్లో పెను నష్టం జరిగిందని చెప్పారు. 324 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 69,616 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. పలు జాతీయ రహదారులు, చెరువులు, కాలువలు తెగిపోయాయన్నారు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, మౌలిక వసతులు డ్యామేజ్ అయ్యాయని, రూ.6,054.29 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. 1.43 లక్షల హెక్టార్లలో వరి, శనగ, పత్తి, వేరు శనగ, పొద్దుతిరుగుడు, చెరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు సీఎం జగన్. అరటి, బొప్పాయి. పసుపు, ఉల్లిగడ్డ, కూరగయాల పంటలు 42,299 ఎకరాల్లో నష్టపోయాయన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1,887.65 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. 71 మున్సిపల్ స్కూల్ బిల్డింగులు, కమ్యూనిటీ కేంద్రాలు, 2,764 వీధి దీపాలు, 197.05 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 2,254.32 కిలోమీటర్ల పొడవైన 1,013 పంచాయతీ రోడ్లు, 9 బిల్డింగులు దెబ్బతిన్నాయని చెప్పారు. 1,085 గ్రామీణ నీటి సరఫరా పనులు, 376 పంపింగ్ యంత్రాలు, 183 ఇన్ టేక్ నిర్మాణాలు డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. 33 కేవీ విద్యుత్ ఫీడర్లు 128, 11 కేవీ ఫీడర్లు 679, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 102 చొప్పున దెబ్బతిన్నాయని, 8,474 స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. పంట నష్టం రూ.1,353.82 కోట్లు, పండ్ల తోటల నష్టం రూ.48.06 కోట్లు, రోడ్లు, బిల్డింగుల నష్టం రూ.1,756.43 కోట్లు, నీటిపారుదల శాఖ నష్టం రూ.556.96 కోట్లు, విద్యుత్ శాఖ నష్టం రూ.252.02 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నష్టం రూ.453.33 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నష్టం రూ.381.65 కోట్లు, మున్సిపల్ పరిపాలన నష్టం రూ.1,252.02 కోట్లుగా ఉందని తెలిపారు. వాటికి సంబంధించిన నష్టం అంచనాలను పొందుపరుస్తున్నామని, వీలైనంత త్వరగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంను రాష్ట్రానికి పంపించి ప్రాథమిక అంచనాను సిద్ధం చేయాలని సీఎం జగన్ కోరారు. త్వరగా తమకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.  అయితే ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం ఎంత చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలోనూ ఏపీకి వరద సాయంతో విషయంలో కేంద్ర వివక్ష చూపిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో వరదలపై నాలుగు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి వరద సాయం కేంద్రం నుంచి భారీగానే వస్తుందని ఆశిస్తున్నారు. 

సరిహద్దులు  దాటిన జగన్ ‘అప్పుల’ ఖ్యాతి  

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఖ్యాతి అంతా ఇంతా కాదు. ఇంకే ప్రభుత్వానికి లేదు. ఇప్పుడా ఖ్యాతి దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అవును,ఏపీ గడచిన రెండున్నర సంవత్సరాలలో అందినకాడికి అన్ని సోర్సెస్ నుంచి అప్పులు చేసింది.  దేశంలో ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని ఉపయోగించుకుంది.  కేంద్ర ప్రభుత్వం గీసిన అప్పు గీత (ఎఫ్ఆర్బీఎం) దాటేసింది. ఇతరత్రా అప్పు పుట్టే ఆన్ని సోర్సెస్’ను చుట్టేసింది. ఇక దేశంలో పైసా అప్పు పుట్టే దారిలేక కావచ్చు, ఏకంగా ప్రపంచ బ్యాక్ నుంచి ఒకే సారి, ఓ 50 వేల కోట్ల రూపాయల అప్పుతెచ్చుకునే ‘చక్కటి’ ఆలోచన చేసినట్లు సమాచరం.ఇలా ఒకే సారి ఒకరి దగ్గరే ఏక మొత్తంగా అప్పు తెచ్చుకుంటే, ప్రతి పూటా వాళ్ళదగ్గర వీళ్ళ దగ్గరా చేయి చాచవలసిన అవసరం ఉండదు. ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ,అక్కడ అప్పు తెచ్చి ఇక్కడా సర్డుబాటు చేసే చికాకులు తప్పుతాయని, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తలకాయలు ‘బ్రెయిన్’ పెట్టి అలోచించి ప్రపంచ బ్యాంకు అప్పుకోసం అప్లై చేసినట్లు అక్కడా ఇక్కడా వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదన ప్రపంచబ్యాంకు పరిశీలనలో ఉన్నట్టు కూడా  తెలుస్తోంది.  అదే గనుక నిజం అయితే, ఏపీ ప్రభుత్వం ‘అప్పు కీర్తి’ అంతర్జాతీయ స్థాయికి చేరిందని అనుకోవచ్చును. అయితే అప్పు చేయడం తప్పు కాదు. అలాగే, ప్రపంచ బ్యాంకు వద్ద అప్పుచేయడం తప్పని ఎవరూ అనరు, నిజానికి, ప్రపంచ బ్యాంకు విధానాలను వ్యతిరేకించే, వామపక్ష ప్రభుత్వాలు కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకున్నాయి. అయితే, ప్రపంచ బ్యాంకు సహజంగా, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది ప్రాజెక్టులకు మాత్రమే రుణాలు ఇస్తుందని అంటారు. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అభివృద్ది, ప్రాజెక్టులు అట్టడుగున ఉంటే ఉంటాయి,లేదంటే అట్టడుగునా లేకపోవచ్చును. పంపకాలే వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలో పర్ధం పంక్తిలో ఉంటాయి. సో ..వైసీపీ ప్రభుత్వ పంపకాల పథకాలకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తుందా అనేది అనుమానం అంటున్నారు. అందుకే ప్రభుత్వం.‘రాజధాని నగరాభివృద్ధి’ పేరిట ఈ రుణ ప్రతిపాదనను పంపిందని అంటున్నారు.  నిజానికి గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధి కోసం అప్పు కావాలని ప్రపంచ బ్యాంకును అభ్యర్ధించింది. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, అడ్డుపుల్లలు వేసింది.అయినా, అప్పటి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు తెలిసిన ప్రపంచ బ్యాంకు ఋణం మంజురుకు సుముఖత వ్యక్తపరిచింది. అయితే, ఇతరేతర కారణాల వలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేదు అనుకోండి. అది వేరే విషయం అదలా  ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు వద్ద ఋణం తీసుకోవడాన్ని వ్యతిరేలించిన వైసీపీ, అధికారంలోకి వచ్చి, అప్పు దారులు అన్నీ మూసుకుపోయిన  నేపధ్యంలో అదే ప్రపంచ బ్యాంకు నుంచి, అదే రాజధాని అభివృద్ధి’ కోసం రూ.50వేల కోట్లు రుణం కోరడం గమనార్హం.  రాజధానే లేని, పోనీ ఖరారు కానీ రాష్ట్రంలో ఏ రాజధాని అభివృద్ధి కోసం ఈ అప్పు ఖర్చు చేస్తారు అన్నది మిలియన్  డాలర్ల ప్రశ్న అంటున్నారు పరిశీలకులు. గత తెలుగు దేశం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అమరావతిని రాష్ట్ర  రాజధానిగా గెజెట్’లో ప్రకటించి కొంత వరకు నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు, ప్రభుత్వం మూడు రాజధానుల మత్తులో అమరావతి రాజధాని కాదంటున్నా,  ప్రభుత్వ కార్యకలపాలన్నీ అక్కడి నుంచే సాగుతున్నాయి. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడు రాజధానులు ముచ్చటను పైకి తెచ్చింది. అది వివాదంగా మార్చింది.  అయితే మూడు రోజుల క్రితం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకుని  కొత్త వివాదానికి తెరసింది.  అదే సమయంలో ‘క్యాపిటల్‌ డెవల్‌పమెంట్‌’ పేరుతో ప్రపంచ బ్యాంకు రుణంకోసం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచబ్యాంకుకు చెప్పిన ‘క్యాపిటల్‌’ ఏది? అది... అమరావతేనా? లేక... పరిపాలనా రాజధానిగా చెబుతున్న విశాఖ నగరమా? అదీ కాకపోతే... న్యాయరాజధాని కర్నూలు నగరమా? దీనిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఆదలా ఉంటే ఆర్థిక క్రమ శిక్షణను అటకెక్కించి,నిధులను దారి మళ్ళించడంలో  తప్పుడు లెక్కలు చూపడంలో సంపూర్ణ ప్రావీణ్యతను సంపాదించింది అంటారు. కేంద్ర నిధులు, ఇంతవరకు చేసిన అనేక వందల వేల కోట్ల రుణాలను దారి మళ్లించిన విధంగానే, ఈ ఆప్పును పక్కదారి పాటిస్తారా?  అనే సందేహాలు తలెత్తుతున్నాయి.  నిజానికి ఇప్పటికే ప్రపంచబ్యాంకు రాష్ట్రంలో విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులను వైసీపీ పభుత్వం పందారాలకు పక్కదారి పట్టించింది. దీనిపై ప్రపంచబ్యాంకు సీరియ్‌సగా స్పందించి నేరుగా కేంద్రంతోనే తేల్చుకుంటామంటూ లేఖ రాసినట్లు అధికార వర్గాల సమాచారం. అలాగే, ఏఐఐబీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించింది. దీంతో ఏఐఐబీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి వాయిదా చెల్లింపులను ఆపేసింది. కేంద్ర కార్మిక శాఖ ఈఎ్‌సఐ ఆస్పత్రుల కోసం ఇచ్చిన నిధులను కూడా జగన్‌ సర్కార్‌ దారి మళ్లించింది. దీనిపై కేంద్ర కార్మిక శాఖ... “రాష్ట్రంలో ఈఎ్‌సఐను నేరుగా మేమే నిర్వహించాలనుకుంటున్నాం మీ స్పందన చెప్పండి’’ అని లేఖ రాసింది. రోడ్డు అభివృద్ధి పేరిట విధించిన సెస్‌లు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులతో సహా మరెన్నో శాఖలు, విభాగాల నిధులను వైసేపీ సర్కారు వాడేసుకుంది. ఇవేవీ చాలదన్నట్లు వేలకోట్ల అప్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని పేరుతో ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తెచ్చి... ఏం చేస్తారు? అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారా? లేక... వాటినీ అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా? అనేదే ప్రస్తుత మిలియన్ డాలర్ల అప్పంత పెద్ద సందేహం.అంటున్నారు.

ఉన్మాదులతో పోరాడాలా?.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి..

శాసన సభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని ప్ర‌తిప‌క్ష నేత‌, చంద్రబాబు స‌వాల్ చేశారు. టీడీపీ 22 ఏళ్లు అధికారంలో ఉన్నా తన సతీమణి ఏనాడూ బయటకు రాలేదని.. అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని బాధ‌ప‌డ్డారు. ‘నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్‌ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే బాధపడరా?. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా..? దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. ప్రజల్లోకి వెళ్దాం. ఇది ప్రజాస్వామ్యం.. ఉన్మాదుల స్వామ్యం కాదు. తప్పుడు పనులు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టను. అలిపిరిలో మందుపాతరలకే నేను భయపడలేదు’ అని చంద్రబాబు మండిప‌డ్డారు.  తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్ర‌బాబు పర్యటించారు. ఎవరూ అధైర్యపడొద్దని భ‌రోసా ఇచ్చారు. ‘వరద ప్రాంతాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడా? వరద బాధితులు చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తారా? అని విమ‌ర్శించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం జగన్‌రెడ్డి గాలిలో తిరుగుతారా? అంటూ నిల‌దీశారు. వరదసాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. రౌడీయిజం చేసి కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలిచిందని.. దాన్ని ఇప్పుడు పెద్ద ఇష్యూ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారని.. దొంగ ఓట్లు వేసి దౌర్జన్యంగా గెలిచారని ఆరోపించారు. తాను కంపెనీలు తెస్తే వీళ్లు దందాలు చేస్తున్నారని.. ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా? అని ప్రశ్నించారు. రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించి.. ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.     ‘పోలీసులు వైసీపీకి తొత్తుగా మారారు. నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేసి నిరూపించలేకపోయారు. ప్రశ్నిస్తే నాతో పాటు టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు.. కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తాం. అసెంబ్లీలో మానసికంగా వేధించారు. నా ఇంటిపై.. పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. వైసీపీ నేతలు గంజాయిని డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దు.. టీడీపీ అండగా ఉంటుందని వ‌ర‌ద బాధితుల‌కు చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు.    

తుగ్లక్ సీఎం.. సాయం ప్లీజ్.. ఖిల్లాపై టీడీపీ జెండా.. గంభీర్ కు గండం.. టాప్ న్యూస్@1PM

ఏపీ శాసనసభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.  తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్‌ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి. ప్రజల్లోకి వెళ్దాం అని చంద్రబాబు అన్నారు. భారీగా వర్షాలు వస్తాయని తెలిసినా ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం జరిగేదా? అని ప్రశ్నించారు చంద్రబాబు. వరద బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.  -------- వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన పొందుపరిచారు. భారీ వర్షాలతో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని లేఖలో తెలిపారు సీఎం జగన్.  ---- కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు ----- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ స్పెషల్ డిష్ ను పరిచయం చేశారు. విశాఖపట్నంలో చిట్టెం సుధీర్ అనే యువకుడు చిన్న తోపుడు బండి ద్వారా తయారు చేస్తున్న టేస్టీ టేస్టీ స్పెషల్ ఇడ్లీని జనానికి తెలియజేశారు. రాగి, ఇతర సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని సూచించారు. --------- పశ్చిమ గోదావరి జిల్లా... ద్వారకా తిరుమలలో జోరుగా పందుల పందాలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసు క్వార్టర్స్ వెనుక భాగాన జోరుగా పలువురు పందాలు నిర్వహిస్తున్నారు. రామన్నగూడెం, ద్వారకా తిరుమలకు చెందిన పందుల మధ్య పోటీలు జరుగుతున్నాయి. పందేలపై జోరుగా బెట్టింగ్‌లు సైతం కొనసాగుతున్నాయి ---------- తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో తెలంగాణ సిఎం కేసీఆర్ సేద తీరుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ సిఎం కేసీఆర్ డిల్లీ పర్యటన.. టిఆర్ఎస్, బిజేపి రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.ఈ తీర్థ యంత్రాల తో రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  --- ఏడేండ్ల‌లో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ మాత్ర‌మేనని.. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగాల భ‌ర్తీపై ఉన్న చిత్త‌శుద్దికి ఇదే నిదర్శనమని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైన్సుల ఏర్పాటుకు మాత్రం పుంఖానుపుంఖాలుగా టెండర్లు, ఉద్యోగాల భ‌ర్తీపై మాత్రం పెదవి విప్ప‌డం లేదన్నారు. నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా దొర‌గారికి సోయి రావ‌డం లేదని షర్మిల మండిపడ్డారు. ----- సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ జిల్లా జడ్జి.. సర్వోన్నత న్యాయస్థానం ముందే నిరసన తెలిపారు. అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. మెయిన్ గేటు దగ్గర ఓ వ్యక్తి అర్ధనగ్నంగా కూర్చోవడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది.. ఆయన దగ్గరకు వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. నిరసనను ఆపాల్సిందిగా కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. జడ్జి చాలా సేపు అక్కడే కూర్చున్నారు. చాలాసేపు బతిలాడిన తర్వాత ఆయన చొక్కా వేసుకున్నారు. - కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురుడేశ్వర్‌పై ఐసిస్‌ ఉగ్రవాదుల కన్ను పడినట్టు సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆలయ పరిసరాలలో భద్రతను పెంచారు. అరేబియా సముద్రానికి సమీపంలో ఉన్న హిందువుల అత్యంత పవిత్రస్థలమైన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ్‌ తాలూకాలోని మురుడేశ్వర్‌కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు, భక్తులు విచ్చేస్తుంటారు. ---- భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌కు ఈమెయిళ్ల రూపంలో బెదిరింపులు వచ్చాయి.దీంతో కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కొండ‌ప‌ల్లిలో కేశినేని+దేవినేని.. తాడిప‌త్రిలో జేసీ.. ముగ్గురు మొన‌గాళ్లు..

అప్పుడు తాడిప‌త్రి మున్సిపాలిటీ. ఇప్పుడు కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ. అధికార పార్టీ అహంకారానికి గొడ్డ‌లి పెట్టు. రాజ్యం కోర‌లు క‌ట్ చేసిన ఫ‌లితాలు. ప‌వ‌ర్‌లో ఉన్నామ‌నే పంతంతో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిహాస్యం చేయ‌బోయారు. టీడీపీ శ్రేణులు ప్రాణాలొడ్డి మ‌రీ ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడారు. అరాచ‌కాల‌కు, అక్ర‌మాల‌కు ధీటుగా ఎదురొడ్డి.. ఎదురుదాడి చేసి.. తాడిప‌త్రిపై, కొండ‌ప‌ల్లిపై టీడీపీ జెండా రెప‌రెప‌లాడించారు. ద‌టీజ్ టీడీపీ అనిపించారు.  కొండ‌ప‌ల్లిలో ఎంత డ్రామా చేశారో రాష్ట్ర ప్ర‌జ‌లంతా చూశారు. ప్రజాతీర్పు క్లియ‌ర్ క‌ట్‌గా ఉన్నా.. టీడీపీకే మెజార్టీ క‌ట్ట‌బెట్టినా.. అధికారాన్ని బ‌ల‌వంతంగా లాగేసుకోవాల‌ని చూశారు. ప్ర‌జాభిప్రాయాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని మంట‌గ‌ల‌పాల‌ని కుట్ర‌లు చేశారు. కానీ, అది కొండ‌ప‌ల్లి. అక్క‌డ పాల‌కుల ప‌ప్పులు అస‌లేమాత్రం ఉడ‌క‌లేదు. కౌంటింగ్ ముగియ‌గానే.. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమా రంగంలోకి దిగారు. వైసీపీ కుట్ర‌ల‌ను ముందే గుర్తించారు. గెలిచిన వారిని గెలిచిన‌ట్టు క్యాంపున‌కు త‌ర‌లించారు. ఒకే ఒక ఇండిపెండెంట్ గెలిస్తే.. ఆమెనే నేరుగా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి పార్టీలో చేర్పించుకున్నారు. అలా దేవినేని చాణ‌క్యంతో టీడీపీ-వైసీపీ బ‌లం 15-15తో స‌మానం చేశారు. దేవినేని దెబ్బ‌కు వైసీపీ అబ్బా అంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇలా, ఇప్ప‌టిదాకా దేవినేని చూసుకున్నారు.. ఇక కేశినేని చ‌క్రం తిప్పే వంతు వ‌చ్చింది.  అయినా, ప‌ట్టువ‌ద‌ల‌లేదు అధికార పార్టీ. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎన్నిక‌ను రెండు సార్లు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీ కేశినేని నానికి ఓటు హ‌క్కు ఇవ్వ‌కుండా అడ్డంకులు సృష్టించారు. అధికారం వారి చేతిలో ఉన్నా.. న్యాయం మాత్రం టీడీపీ త‌ర‌ఫునే ఉంది. అందుకే వెంట‌నే హైకోర్టును ఆశ్ర‌యించారు కేశినేని. కోర్టు ఆదేశాల‌తో ఓటు హ‌క్కు ద‌క్కించుకున్నారు. వైసీపీకి మ‌ళ్లీ షాక్‌. ఇక ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్నారు.. స‌మావేశంలో కుర్చీలు విర‌గొట్టి ఎన్నిక‌ను అడ్డుకున్నారు. మ‌ళ్లీ టీడీపీ హైకోర్టుకు వెళ్ల‌డం.. 24 గంట‌ల్లో ఎన్నిక పూర్తి చేయాల‌ని ఆదేశించ‌డం.. పోలీస్ బ‌ల‌గాల భ‌ద్ర‌త‌తో.. టీడీపీ కౌన్సిల‌ర్లు, ఎంపీ కేశినేని నాని.. ద‌ర్జాగా, రాజాలా ఓటు వేయ‌డం.. కొండ‌ప‌ల్లి ఖిల్లా టీడీపీ కైవ‌సం చేసుకోవ‌డం.. అంతా వైసీపీకి దారుణ ప‌రాభ‌వం. టీడీపీకి ఘ‌న విజ‌యం. అందుకే ఇప్పుడు కొండ‌ప‌ల్లిలో తెలుగు త‌మ్ముల్లు మొన‌గాళ్ల‌లా, పోటుగాళ్ల‌లా సంబ‌రాలు చేసుకుంటున్నారు.  సేమ్ టూ సేమ్‌.. కొన్ని నెల‌ల క్రితం తాడిప‌త్రిలోనూ ఇలాంటి సీనే. కొండ‌ప‌ల్లిలో దేవినేని, కేశినేని చ‌క్రం తిప్పితే.. తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మీసం మెలేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, వైసీపీ బ్యాచ్‌కి ఝ‌ల‌క్ ఇస్తూ.. తాడిప‌త్రి మున్సిపాలిటీ ఛైర్మ‌న్ కుర్చీలో ద‌ర్జాగా కూర్చున్నారు జేసీ. తాడిప‌త్రిని.. టీడీపీ అడ్డాగా మార్చారు. అయితే, ఆ విజ‌యం సైతం అంత ఈజీగా ద‌క్క‌లేదు. గెలిచిన టీడీపీ స‌భ్యుల‌ను వైసీపీలోకి లాక్కోవ‌డానికి అధికార పార్టీ గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసింది. డే వ‌న్ నుంచే జేసీ.. టీడీపీ స‌భ్యుల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి వైసీపీకి మొద‌ట్లోనే షాక్ ఇచ్చారు. టీడీపీ మెంబ‌ర్స్ ఆస్తుల‌పై దాడులు, కుటుంబ స‌భ్యుల‌కు బెదిరింపుల‌తో వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. అయినా, వారు అద‌ర‌లేదు..బెద‌ర‌లేదు. జేసీ అండ‌తో టీడీపీ వారంతా ఒక్క తాటిపై ఉన్నారు. తాడిప‌త్రిని తెలుగుదేశానికి క‌ట్ట‌బెట్టారు. చంద్ర‌బాబుకు బ‌హుమ‌తిగా ఇచ్చారు.  అప్పుడు తాడిప‌త్రి.. ఇప్పుడు కొండ‌ప‌ల్లి.. అప్పుడు జేసీ.. ఇప్పుడు దేవినేని+కేశినేని. టీడీపీ ప‌నైపోయిందంటూ ప్ర‌చారం చేస్తున్న వైసీపీ మూక‌ల‌కు ఈ విజ‌యాలు గ‌ట్టి గుణ‌పాఠాలు. అనూహ్యంగా ద‌ర్శి పీఠం సైతం టీడీపీనే కైవ‌సం చేసుకోవ‌డం వైసీపీ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌నేందుకు నిద‌ర్శ‌నం.  

టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. రైతులను దగా చేస్తున్నాయని రేవంత్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో తెలంగాణ సిఎం కేసీఆర్ సేద తీరుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ సిఎం కేసీఆర్ డిల్లీ పర్యటన.. టిఆర్ఎస్, బిజేపి రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.ఈ తీర్థ యంత్రాల తో రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏంది.. ? అని బహిరంగ లేఖలో నిలదీశారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్, బీజేపీ రాజకీయా చదరంగంలో రైతు పావుగా మారారని చెప్పారు. రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కొండపల్లి ఖిల్లాపై టీడీపీ జెండా.. జగన్ కు దిమ్మతిరిగే షాక్ 

అధికార పార్టీ కుట్రలు చిత్తయ్యాయి. వైసీపీ నేతల దౌర్జన్యాలు ఫలించలేదు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీపై తెలుగు దేశం పార్టీ జెండా ఎగిరింది. హైకోర్టు ఆదేశాలతో అత్యంత భద్రత మధ్య సాగిన చైర్మెన్ ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థికి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీకౌన్సిలర్ చిట్టిబాబు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.  కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులున్నాయి. ఎన్నికల్లో టీడీపీ 14 వార్డులు, వైసీపీ 14 వార్డులు గెలవగా... 14 వార్డులో స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు పెరగగా.. వైసీపీ బలం 14గా ఉంది. కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గంలో ఉంది. దీంతో మైలవరం వైసీపీ ఎమ్మెల్యేకు ఎక్స్ అఫిషియో ఓటు ఉంది. దీంతో వైసీపీ బలం కూడా 15కు చేరింది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని ఎక్స్ అఫీషియోగా కొండపల్లిలో నమోదు చేసుకోవడంతో వైసీపీకి షాక్ తగిలింది. కేశినేని ఓటుతో టీడీపీ బలం 16కు పెరగగా.. వైసీపీకి 15 మంది సభ్యులే ఉన్నారు. అందుకే ఓడిపోతామనే భయంతో వైసీపీ నేతలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. సోమవారం, మంగళవారం ఎన్నిక జరగాల్సి ఉండగా... వైసీపీ సభ్యుల విధ్వంసంతో జరగలేదు. చివరికి ఎన్నికల అధికారి చైర్మెన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి పంపించారు. అయితే చైర్మెన్ ఎన్నికను కావాలనే అడ్డుకుంటున్నారంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బుధవారం చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఆదేశించింది. ఫలితాన్ని మాత్రం ప్రకటించవద్దని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని విజయవాడ సీపీని ఆదేశించింది హైకోర్టు. దీంతో అత్యంత భారీ భద్రత మధ్య కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు.  భారీ భద్రత నడుమ ఎంపీ కేశినేని నాని సహా వార్డు సభ్యులను పోలీసులు కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమని సైతం వార్డు సభ్యులు బస్సులో వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొండపల్లిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. వార్డు సభ్యుల బస్సులో వస్తున్న మీడియా సిబ్బందిని కూడా మార్గమధ్యలోనే దించివేశారు. కొండపల్లిలో స్థానికులకు కూడా పోలీసుల ఆంక్షలు తప్పని పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆంక్షలు వర్తించలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 

గంభీర్‌కు ఉగ్ర‌వాదుల బెదిరింపు.. సెక్యూరిటీ పెంపు..

మాజీ క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు.. పార్ల‌మెంట్ స‌భ్యుడు కూడా. డాషింగ్ ఓపెన‌ర్ మాత్ర‌మే కాదు.. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ కూడా. అలాంటి గౌత‌మ్ గంభీర్‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశారు. చంపేస్తామంటూ బెదిరించారు. బీజేపీ త‌ర‌ఫున పాకిస్తాన్‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తూ.. క‌శ్మీర్‌కు చెందిన ఐఎస్ఐఎస్ టెర్ర‌రిస్టుల లిస్టులో చేరాడు గౌతం గంభీర్‌. బీజేపీ నేత కావ‌డం, క్రికెట‌ర్‌గా మంచి ఇమేజ్ ఉండ‌టం, ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌టం.. ఇలా బాగా పాపులర్ అయిన గంభీర్‌కు ఉగ్ర‌వాదులు వార్నింగ్ ఇవ్వ‌డంతో ఢిల్లీ పోలీసులు ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యారు. ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర భ‌ద్ర‌త‌ను మ‌రింత‌ పెంచారు. గౌత‌మ్ గంభీర్‌కు ఈ-మెయిల్స్‌లో బెదిరింపులు వచ్చాయి. కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించే దిశ‌గా విచారణ జరుపుతున్నారు. ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. బెదిరింపులతో ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని గౌతమ్ గంభీర్ ఇంటి ద‌గ్గ‌ర‌ సాయుధ పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. గౌతమ్ గంభీర్ 2019లో బీజేపీ త‌ర‌ఫున తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచారు.   

వర్క్  ఫ్రమ్ హోం సీఎం జగన్.. విపక్షాల విమర్శలకు వైసీపీ బదులేది?  

కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పాపులర్ అయింది. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో మెజార్టీ సంస్థలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం చేయించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్ కంట్రోల్ లోనే ఉన్నా... ఇంకా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఏపీకి సంబంధించి రాజకీయంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాక రాజేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి అంటూ విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ పై జనాల్లోకి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయినా సీఎం మాత్రం బయటికి రాలేదనే విమర్శలు వస్తున్నాయి. తన సొంత జిల్లా కడపలోనూ దుర్బర పరిస్థితులు ఉన్నా సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడం లేదు. అసెంబ్లీలో తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలం వాడారంటూ ప్రెస్ మీట్ లో వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు కూడా రెండు రోజుల్లో తేరుకుని జనంలోకి వెళ్లారు. కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వాళ్లకు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. తీవ్రమైన బాధలో ఉన్నా చంద్రబాబు ప్రజల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం గాల్లో చక్కలు కొట్టి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు జనాల నుంచి వస్తున్నాయి. తాజాగా జగన్ ను టార్గెట్ చేస్తూ జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.  ఏపీలో వరదల కారణంగా ముఖ్యమంత్రి జగన్ను వర్క్ ఫ్రం హోమ్ సీఎంగా విమర్శిస్తూ జనసేన తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి కనీసం పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కదలని ముఖ్యమంత్రి అంటే జగనే అని.. ఆయన వర్క్ ఫ్రం హోమ్ సీఎం అని నాదెండ్ల విమర్శించారు. ప్రజలు వరదతో కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం గాల్లో హెలికాప్టర్లో తిరిగి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం పరిపాలన దక్షత లేని నాయకుడిగా జగన్ తయారయ్యారని నాదెండ్ల విమర్శించారు . ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.   సీఎం జగన్ తీరుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతల నుంచి కౌంటర్లు రావడం లేదు. జగన్ తీరుపై వైసీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని, అందుకు వాళ్లు కూడా స్పందించడం లేదని అంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్ వెళ్లకపోవడంతో తమపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని వైసీపీ నేతలు ఓపెన్ గానే అంగీకరిస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు జనాలను ఓదారుస్తుంటే.. జగన్ రెడ్డి ప్యాలెస్ లో ఉండటం సరికాదని చెబుతున్నారు. మొత్తంగా వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి జగన్ అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతుండటం ఆసక్తిగా మారింది. 

కొండపల్లిలో హై టెన్షన్.. భారీ భద్రత మధ్య  చైర్మెన్ ఎన్నిక 

కృష్ణా జిల్లాలో కొండపల్లిలో హై టెన్షన్ నెలకొంది. అత్యంత భద్రత మధ్య కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో కార్యాలయం దగ్గర ఆంక్షలు విధించారు పోలీసులు. భారీ భద్రత నడుమ ఎంపీ కేశినేని నాని సహా వార్డు సభ్యులను పోలీసులు కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమని సైతం వార్డు సభ్యులు బస్సులో వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొండపల్లిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. వార్డు సభ్యుల బస్సులో వస్తున్న మీడియా సిబ్బందిని కూడా మార్గమధ్యలోనే దించివేశారు. కొండపల్లిలో స్థానికులకు కూడా పోలీసుల ఆంక్షలు తప్పని పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆంక్షలు వర్తించలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.  కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులున్నాయి. ఎన్నికల్లో టీడీపీ 14 వార్డులు, వైసీపీ 14 వార్డులు గెలవగా... 14 వార్డులో స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు పెరగగా.. వైసీపీ బలం 14గా ఉంది. కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గంలో ఉంది. దీంతో మైలవరం వైసీపీ ఎమ్మెల్యేకు ఎక్స్ అఫిషియో ఓటు ఉంది. దీంతో వైసీపీ బలం కూడా 15కు చేరింది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని ఎక్స్ అఫీషియోగా కొండపల్లిలో నమోదు చేసుకోవడంతో వైసీపీకి షాక్ తగిలింది. కేశినేని ఓటుతో టీడీపీ బలం 16కు పెరగగా.. వైసీపీకి 15 మంది సభ్యులే ఉన్నారు. అందుకే ఓడిపోతామనే భయంతో వైసీపీ నేతలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. సోమవారం, మంగళవారం ఎన్నిక జరగాల్సి ఉండగా... వైసీపీ సభ్యుల విధ్వంసంతో జరగలేదు. చివరికి ఎన్నికల అధికారి చైర్మెన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి పంపించారు. అయితే చైర్మెన్ ఎన్నికను కావాలనే అడ్డుకుంటున్నారంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బుధవారం చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఆదేశించింది. ఫలితాన్ని మాత్రం ప్రకటించవద్దని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని విజయవాడ సీపీని ఆదేశించింది హైకోర్టు. దీంతో అత్యంత భారీ భద్రత మధ్య కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 

మూడు లీటర్ల పెట్రోల్ కు కిలో టమోట.. తగ్గేదేలే.. 

తెలుగు రాష్ట్రాల్లో టమోట ధర చుక్కలు చూపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా టమోట ధరలు మండిపోతున్నాయి. టమోటకు ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లా మార్కెట్లలోనూ రేట్లు రోజురోజుకు ఎవరూ ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. చిత్తూరు జిల్లా వికోట మార్కెట్ రేటు చుక్కలనంటింది. ఎన్నడూ లేని విధంగా పస్ట్ గ్రేడ్ క్వాలిటి టమోట కిలో రూ.250పలికింది. పది కేజిల టమోట బాక్స్ ధర 2500వరకు పలికింది.  టమోట మార్కెట్ కు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన మదనపల్లి మార్కెట్ లోనూ టమోట ధర విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడ కూడా మొదటి రకం క్వాలిటీ టమోట కేజీ 230 నుంచి 250 వరకు పలుకుతోంది. దీంతో టమోట సేల్స్ భారీగా పడిపోయాయని చెబుతున్నారు. మార్కెట్ లోనే కిలో టమోట ధర 250 పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్లలో 3 వందల నుంచి 350 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో జనాలు చుక్కలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మూడు లీటర్ల పెట్రోల్ రేటుకు కిలో టమోట వస్తోంది.  గత రెండు సంవత్సరాలుగా కరోనా,అతివృష్టి తో టమోట రైతులు తీవ్రంగా నష్టపోయారు..గత నెల రోజులుగా చిత్తూరు, అనంతపురం,కడప జిల్లాలలో  టమోట పండించే ప్రాంతాలలో వరుస వర్షాలు కురవడంతో  టమోట  తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..దీంతో దిగుబడి తక్కువ కావడంతో ధరలు పెరిగాయి..ఈ దరలు మరో మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వినియోగదారులు మాత్రం పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నారు. కూరల్లో ఇష్టంగా తినే టమోట కొన్ని రోజులుగా వంటకాలకు దూరమైందని చెబుతున్నారు.