కేసీఆర్ ను కలిసిన జగన్.. ఏం మాట్లాడుకున్నారో?
posted on Nov 21, 2021 @ 12:22PM
తెలుగు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. అవును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ వివాహ వేడుకల్లో కలుసుకున్నారు. చాలా సేపు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య గుసగుసలు కూడా నడిచాయి. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండగా.. ఇటీవల కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపించింది. జల వివాదం పై రెండు రాష్ట్రాల మధ్య వార్ నడిచింది. ఏపీ, తెలంగాణ మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. పరస్పర సవాళ్లు కూడా విసురుకున్నారు. పాలనపైనా సెటైర్లు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్, కేసీఆర్ లు కలుసుకోవడం... గుసగుసలు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి శంషాబాద్ లో జరిగింది. ఈ వివాహానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇద్దరూ ఒకే సమయంలో రావడంతో పక్కపక్కనే కూర్చుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్ చెవిలో కేసీఆర్ ఏదో చెబుతూ కనిపించారు. జగన్ కూడా కేసీఆర్ ఏదో వివరించారు. ఈ ఘటన వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఏపీ సీఎం జగన్... కేంద్ర దగ్గర అడుక్కుంటున్నారంటూ వారం రోజుల క్రితం కామెంట్ చేసి కాక రాజేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే వివాహ వేడుకలో ప్రశాంత్ రెడ్డి కూడా జగన్ దగ్గరే ఉన్నారు.
జగన్, కేసీఆర్ లు ఏం మాట్లాడుకున్నారన్నది ఇప్పుడు చర్చగా మారింది. జల వివాదంపై మాట్లాడుకున్నారా? కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారా అన్నది ఆసక్తిగా మారింది. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో అనూహ్య ఘటనలు జరిగాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడారు. సభలో జరిగిన పరిణామాలపై మనస్తాపం చెందిన చంద్రబాబు.. ప్రెస్ మీట్ లో బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అంశంపైనా జగన్ తో కేసీఆర్ మాట్లాడారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత కేసీఆర్, జగన్ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.