గత 30 ఏండ్లలో అతిపెద్ద వర్షం.. టీటీడీకి రూ.4 కోట్ల నష్టం
posted on Nov 21, 2021 8:24AM
రాయలసీమలో వరద బీభత్సం కొనసాగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు తీవ్ర స్థాయిలో పోటెత్తాయి. వరదలతో రాయలసీమ అల్లాడిపోయింది. తిరుపతిలోనూ గతంలో ఎప్పుడు లేనంతగా వరద బీభత్సం కనిపించింది. గత 30 సంవత్సరాల్లో ఇంత భారీ వర్షం కురవలేదని, భారీ వర్షాలతో టీటీడీకి రూ 4 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లాి, కపిలతీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోకి వరద ప్రవేశించింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణగోడ దెబ్బతిన్నది. ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి.రెండవ ఘాట్ రోడ్ లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారు..
శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బ తిన్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జిఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతింది.దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు..
వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు