జగన్ కు షాక్.. కూన రవికుమార్ కు బెయిల్..
posted on Nov 21, 2021 @ 4:15PM
శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ కు బెయిల్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కూనకు బెయిల్ రావడంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి కూన రవికుమార్ ను తీసుకొచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా వచ్చారు. కూనకు మద్దతుగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. అర్థరాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ సోదరి ఇంట్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి, హైడ్రామా మధ్య అరెస్టు చేశారు.
శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై దురుసుగా వ్యవహరించారని.. కూన రవికుమార్ పై టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. కూన రవికుమార్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట పోలీసులు దౌర్జన్యం చేశారని, దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. వరదలతో జనాలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్ముళ్లు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... కూనను అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా వరదలతో అల్లాడుతుంటే జగన్ ప్రభుత్వం మాత్రం విపక్ష నేతలను అరెస్ట్ చేయడంపై ఫోకస్ చేసిందని ఆయన విమర్శించారు.