తాదూర కంత లేదు మెడకో డోలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాలైంది.. అయినా ఇంతవరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం అందరికీ అందలేదు. అలాగే ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే, అసలే లేదు. ఏడున్నరేళ్ళలో అమరులకు ఇచ్చిన హామీలు ఏవీ పూర్తిగా అమలుకు నోచుకోలేదు. నిజానికి, ఇన్నేళ్ళ తర్వాత కూడా అమరులో అర్హులు ఎందరు అన్న లెక్కకూడా ఖచ్చింతంగా తేల లేదు.
తెలంగాణ తొలి ఉద్యమం (1969) ఉద్యమంలో 365 మంది మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా , మొత్తం కలిపి 1500 మందికి పైగా చనియారు. ఇందులో ఆత్మ బలిదానం చేసుకున్న వారున్నారు. పోలీసు కాల్పులలో చనిపోయిన అమరులున్నారు. ఎలా చనిపోయినా ఈ అందరూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన, తెలంగాణబిడ్డలు.ఆ కుటుంబాలు అన్నీ,అమరుల కుటుంబాలు, అయినా అందులో కొందరే అర్హులు అంటోంది ప్రభుత్వం. అంటే కాదు, పంచ పాండవులు మంచం కోళ్ళులాగా నలుగురు అని మూడు వేళ్ళు చూపించినట్లు 1500 పైచిలుకు మందికి గానూ కేవలం 479 మందికి, అది కూడా ఆర్ధిక సహాయం వరకు మాత్రమే ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చేతులు కడిగేసుకుంది. చివరకు, వ్గాదనం చేసిన అమరుల స్థూపానికి కూడా ఇంతవరకు దిక్కులేదు.అమరులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం సక్రమంగా నిలుపుకోలేక పోయిందనేది ఆరోపణ కాదు ,నిజం.
ఇంతే కాదు, రాష్ట్రంలో ఈ రోజుకు కూడా రైతులు, నిరుద్యోగులు, ఇతర వర్గాలకు చెందినవారు ప్రతి రోజు ఒకరో ఇద్దరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గడచిన ఏడేళ్ళలో అధికారికంగానే 7000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని,అనధికార లెక్కల ప్రకారం చూస్తే ఈ సంఖ్య ఇంతకు ఐదారు రెట్లు ఉంటుందని పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేసీఆర్, ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అన్నట్లుగా ఢిల్లీ రైతుల ఆందోళనలో చనిపోయిన 750 రైతుల కుటుంబాలకు మూడు లక్షల రుపాయాల వంతున పరిహారు ప్రకటించారు. మంచిదే, మూడు కాకపోతే, మరో మూడు కలిఫై ఆరు అదీ చాలదనుకుంటే ఇంకొక ఆరు కలిపి ఫ్యామిలీకి 12 లక్షలు ఇస్తామన్నా వద్దనేది లేదు. అయితే, ఈ 750 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది. రాష్ట్రంలో చనిపోయిన అమరుల సంఖ్యే ఇంతవరకు పక్కాగా తేలలేదు. ఇప్పడు ఢిల్లీలో 750 మంది చనిపోయారు అని ఏ విధంగా లెక్క తేల్చారు. అందుకోసంగా 23కోట్ల రూపాయలను ఏ విధంగా మూట కట్టారు.
అదీ గాక, సహజంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రకృతి విపరీత్యాలు సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించి నప్పుడు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందిస్తాయి. అంతే గానీ, వేరే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బాధితులకు ఆర్థిక సహాయం గానీ మరో సాయం గానీ, ఇవ్వడం కుదరదు . అలా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగ లేదు. నిజానికి అలా, ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో నేరుగా వేలు పెట్టడం సమంజసం కాదు. సభ్యతా సంస్కారం అనిపించుకొండు. అంతేకాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వ నిధులను, మరో రాష్ట్రంలో ఆ ప్రభుత్వ సమ్మతి లేకుండా పంపిణీ జరగడం సాధ్యం కాదు. కాదు, సాధ్యమే అనుకుంటే, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదితి నాథ్, లేదా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ హైదరాబాద్ కి వచ్చి, తమ తమ ప్రభుత్వం తరపున తెరాస ప్రభుత్వం మొండి చెయ్యి చుపించిన తెలంగాణ అమరుల కుటుంబాలకు తలా పది లక్షలు ఇస్తాను అంటే , తెలంగాణ ప్రభుత్వం సిగ్గువదిలి ఒప్పుకుంటుందా ?
నిజానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని, మరొక ప్రభుత్వం తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2014కు ముందు బీహార్’ లో వరదలు వచ్చినప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అయితే బీహర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గుజరాత్ సహాయాన్ని తిరస్కరించారు. అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం, ఈ విధంగా అసంబద్ధమైన, అనలోచిత నిర్ణయాలు ప్రకటించి, చివరాకు అవి అమలు చేయ లేక అభాసుపాలు కావడం ... కొంచెం చాలా బావోదు అంటున్నారు.