కారు కూతలు.. బడాయి మాటలు! క్రెడిట్ అంతా కేసీఆర్ దేనట..
posted on Nov 20, 2021 @ 4:55PM
కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో ఏమో కానీ, ఇక్కడ హైదరబాద్’లో అధికార తెరాస మహా ధర్నా నిర్వహించిన మర్నాడే, ఎంతో కాలంగా వివాదస్పదంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందేశంతో పాటుగా సిక్కులకు ఈ శుభ వార్త కూడా అందించారు. అయితే, హైదరబాద్’లో తెరాస నిర్వహించిన మహా ధర్నాకు, ఈ సందర్భంగా తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాసింగ్ కామెంట్స్’గా ఉత్తరాది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా డెల్లి వేదికగా చేస్తున్న ఆందోళనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు మధ్య గొప్ప సంబంధం ఏదో ఉందని అనుకోలేము.
ఇవే వివాదాస్పద చట్టాలకు సంబంధించి, గతంలోనూ తెరాస రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. కేటీఆర్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర కీలక నేతలంతా ధర్నా, రాస్తా రోకో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే ఇవే వివాదస్పద చట్టాలకు తెరాస మద్దతు పలికింది.ముఖ్యమంత్రి అక్కడ ఫస్ట్ యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు, పార్లమెంట్ ఉభయసభల్లోనూ తెరాస ఎంపీలు వ్యవసాయ బిల్లుల (సాగు చట్టాల)కు మద్దతు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి చట్టాలను మెచ్చుకున్నారు. ఇదంతా చరిత్ర.
అయితే హుజూరాబాద్’ ఓటమి షాక్ నుంచి బయటపడేందుకు, ఈ సందర్భంగా ఇచ్చిన దళిత బందు హామీ నుంచి రాజకీయ చర్చను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి వరి వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. భారీ డైలాగ్స్’ పోగేసి బ్రహ్మాండం బద్దలు చేస్తున్న భ్రమలను సృష్టించారు, ఈ ‘వరి ఉరి’ పోరాటంలో భాగంగా నిర్వహించిన మహాధర్నాలో మరో మారు కేసీఆర్ మరో యూ టర్న్, తీసుకున్నారు.ఈసారి, చట్టాలను వ్యతిరేకించారు. గతం మొత్తాన్ని పక్కన పెట్టి కొత్త స్వరం ఎత్తుకున్నారు. అదలా ఉంటే, యాదృచ్చికంగా, వచ్చిన చట్టాల రద్దు ప్రకటన తమ ఖాతాలో వేసుకోవాలని, తెరసా మంత్రులు, ఇతర నాయకులు ఆ విధంగా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇలా ఒకరి వెంట ఒకరు, టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాతోనే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందని చంకలు గుడ్డుకకున్నారు. తాజాగా తెరాస అధికార ప్రతినిధి, అరుపుల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే, జాతీయ స్థాయిలో తమకు పోటీగా కేసీఆర్ నిలుస్తారని భయపడే మోడీ అఘమేఘాల మీద రద్దు నిర్ణయం తీసుకున్నారని, నమ్మించేందుకు చాలా శ్రమ తీసుకున్నారు. ముఖ్యంత్రి రెండు గంటలు ధర్నాలో కూర్చుంటేనే. మోడీ గజగజ వణికి పోయి చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని తెరాస నేతలు చప్పట్లు కొట్టు కున్నారు.
అయితే వాస్తవం అది కాదు. మహా ధర్నాకు మోడీ నిర్ణయానికి మోకాలుకు బోడి గుండుకు ఉన్న సంబంధం కూడా లేదు. అది యాదృచ్చికంగా జరిగిన సంఘటన. నిజానికి, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో ఢిల్లీ రైతుల సుదీర్ఘ ఆందోళనలో కీలక భూమిక పోషిస్తున్న పంజాబ్ రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని గురునానక్ జయంతిని సాగు చట్టాల రద్దు ప్రకటనకు ముహూర్తంగా ఎంచుకున్నారు. అందుకే , గురునానక్ జయంతి సుభాకంశాలతో పాటుగానే చట్టాల రద్దు ప్రకటన చేశారు. మహా ధర్నా , గురునానక్ జయంతి పక్కపక్కన రావడం యాదృచ్చికం .. ఆ యాదృచ్చిక సంఘటన ఆధారంగా తెరాస నాయకులూ ఇంట హడావిడి చేస్తున్నారంటే, గులాబీ పార్టీ రాజకీయంగా ఎంతగా దివాలా తీసిందో అర్తంచేసుకోవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
అయితే అధికార పార్టీ ఇలా దివాలకోరు రాజకీయ పంథాను ఎంచుకోవడానికి కారణం లేక పోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. దళిత బంధును పక్కన పెట్టినా, రైతుల వద్ద నుంచి కొనవలసిన వడ్లను కొనే పరిస్థితి లేక కేంద్రం ఇచ్చిన వివరణతో తప్పించుకునే మార్గం లేక ... తెరాస నాయకులు సొంత డప్పు కొట్టుకుంరున్నారని అంటున్నారు.