కేసీఆర్ ను కలిసిన జగన్.. అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు.. కూన అరెస్ట్.. టాప్ న్యూస్@1PM
posted on Nov 21, 2021 @ 12:04PM
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో జరిగిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు కాసేపు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత జగన్, కేసీఆర్ ఇప్పుడు కలుసుకోవలం చర్చగా మారింది.
-----
రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ పాదయాత్రకు.. ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ నేతలు పురందేశ్వరి, సత్యకుమార్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఈ సందర్బంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు.
--
రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని చెప్పారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.
------
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బాధితులకు కనీసం ఆహారం, త్రాగునీరు ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. సీఎం జగన్ గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి కక్ష సాధింపు చర్యల్లో బిజీ అయిపోయారన్నారు. అర్థరాత్రి యుద్ధ వాతావరణం సృష్టించి టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్‌ని అరెస్ట్ చెయ్యడంపై పెట్టిన శ్రద్ధ వాతావరణ శాఖ హెచ్చరికలో లేదన్నారు. ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదికాదని అన్నారు.
---------
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను పోలీసులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ ప్రసాదరావు పట్ల దుర్భాషలాడారంటూ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి, అది కూడా తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయడమేంటి..? అని పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-----------
అర్థరాత్రి తలుపులు పగలగొట్టి కూన రవికుమార్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే.. వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి ఉందన్నారు. రవికుమార్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కావాలనే జగన్ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని విమర్శించారు.రదలతో ప్రజలు ప్రాణాలు పోతుంటే దానిపై దృష్టి పెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.
---------
రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, నారా రోహిత్ అన్నారు
------
మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణి నారా భువ నేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అవమానించడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ విమర్శించారు. మహిళలను గౌరవించలేని వైసీపీ తీరు నచ్చక ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.గత ఎన్నికల్లో తాను, తన భర్త రెడ్డెప్ప వైసీపీ విజయానికి కృషి చేశామని అయితే, అధికార పార్టీలో ప్రజాస్వామ్యం అభాసుపాలవుతుండటం చూసి జీర్ణించుకోలేక తాము వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
---
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా మీట్లో ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మృతి చెందారని, బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని ప్రశ్నించారు.
---
రైతుల పోరాట ఫలితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగొచ్చి, మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పడంతో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి కొత్త ఉత్సాహం వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ల రద్దు కోసం పార్లమెంటులో పట్టుబట్టాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం బీజేపీ, ముస్లిం ఓట్ల కోసం టీఎంసీ వీటిని బాగా ఉపయోగించుకుంది.
----
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనా వ్యాపార సంస్థలకు గట్టి మద్దతు ప్రకటించారు. తన ప్రభుత్వం చైనా పెట్టుబడిదారులకే పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఇస్లామాబాద్‌లోని ఛాలెంజ్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన చెన్ యాన్ నేతృత్వంలోని చైనీస్ బిజినెస్ ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఈ భరోసా ఇచ్చారు. పాకిస్థాన్, చైనాలు గతం, వర్తమానంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఉంటాయన్నారు